బాలకార్మిక వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రమే ‘భారతమ్మ ఎక్కడ?’ పద్దెనిమిది ఏండ్లలోపు పిల్లలు బడిబయట ఉంటే, వాళ్లందరూ బాలకార్మికులే. ఒక అంచనా ప్రకారం ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకున్నవారే. ఈ దుర్మార్గ వ్యవస్థలో బందీ అయినవారిలో బాలుర కంటే బాలికలే అధికం. ఈ బందీలందరూ కటిక పేదరికంలో పుట్టినవారే.
ఒక పాఠశాలలో విద్యార్థులు భారతమాతను కొలుస్తూ, గానం చేస్తూ ఉంటారు. ఓ జర్నలిస్టు ప్రవేశించి.. ‘కంటి ముందు భారతమాత భవితవ్యం మంటగలిసి పోతుంటే, ఈ దారుణాన్ని చూస్తూ, సహిస్తూ భారతమాతను ఘనంగా కీర్తించలేం’ అని వాపోతుంది. ‘దారుణమా..?’ ( అని విద్యార్థులు ప్రశ్నిస్తే).. ‘అవును దారుణమే. రండి చూపిస్తాను’ అంటూ వారిని తీసుకువెళ్తుంది.
సంపన్నుల ఇంట్లో ఓ బాలిక పనిమనిషిగా ఉంటుంది. ఆ కుటుంబంలో తన ఈడు బాలిక చక్కగా ముస్తాబై బడికి వెళ్తుంటే, ఆ పాపకు ఈ పాప మూగగా అన్ని సేవలు చేస్తుంటుంది. తన ఆశలన్నిటిని లోలోపలే అణచుకుంటూ ఒంటరిగా బాధపడుతుంటుంది. పైగా ఇంటి యజమానురాలు కొడుతుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతుంది. ఈ సందర్భంలో ‘చిట్టి పొట్ట చేతబట్టుకొని, అడుగడుగున అణచివేతలో.. ఓ పసిపాప.. పాలబుగ్గల చినపాప.. మొగ్గగానే నేలరాలేవా…’ నేపథ్య గానం ప్రేక్షకుల హృదయాల్ని కరిగించింది.
‘నీకు చదువుకోవాలని లేదా? నీవు బడికి వెళ్లవా?’ మేకలు కాసే ఓ పిల్లను జర్నలిస్ట్ అడుగుతుంది. ‘మరి మరి బడికెళ్తే ఈ మేకలమందను ఎవరు కాస్తారు?’ అని అమాయకంగా ఆ పిల్ల ఎదురు ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఆ పాపకు తండ్రి లేడు. అమ్మ, తమ్ముడు ఉన్నారు. ఉన్న ఆస్తి ఈ మేకలమందే. అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేసే ఓ పాపను ఓనరు వచ్చి మందు కలియబెట్టమని ఆర్డర్ వేస్తాడు. చేతులు మండుతున్నాయని పాప ఏడుస్తున్నా వినడు. ‘నేను ఏ పని చెప్తే ఆ పనే చేయాలి’ అని ఒత్తిడి చేస్తాడు. ‘చేతులు మండుతున్నా చేత్తా సేఠ్. లేకుంటే ఇల్లెల్లదుగా…?’ అని ఆ పాప విలపిస్తుంది.
ఓ పాపను బలవంతంగా ‘జోగిని’గా మార్చడానికి ప్రయత్నిస్తుంటే.. ఆ పాప హృదయ విదారకంగా రోదిస్తూ ‘వద్దూ.. వద్దూ.. నన్ను జోగిని చేయొద్దు. మీకు దండం పెడతా’ అని వేడుకుంటూ సొమ్మసిల్లి పడిపోతుంది. ‘తెగిపడ్డ నింగి చుక్కలం. చెత్తకుండి కాడ కుక్కలం. అయినా మేం భారతీయులం. అమ్మయ్య లేని అనాథలం’ అని ప్లాట్ఫాం మీద అనాథ పిల్లలు ఏడుస్తూ, పాడుకుంటూ, అడుక్కుంటూ ఉంటారు. జర్నలిస్ట్ అక్కడికీ వస్తుంది. మీకు చదువుకోవాలని అనిపించదా?’ అని అలాగే అడుగుతుంది. ‘అనిపిస్తుంది. కానీ, అడుక్కోందే డబ్బులు రావుగా? డబ్బులు రాకపోతే కడుపు ఎట్లా నిండుద్ది?’ అని దీనంగా బదులిస్తారు.
ఓ అనాథ బాలికను కొందరు సామూహికంగా అత్యాచారం చేస్తారు. ఆ బాధలో ఆ పాప పిచ్చిదైపోతుంది. గర్భం దాలుస్తుంది. చచ్చిన బిడ్డను కంటుంది. ఓ బొమ్మను ఎత్తుకుని ఆ పిచ్చితల్లి రోడ్ల మీద తిరుగుతుంది. ‘చక్కదనాల చుక్కమ్మ.. నీవు పగిలిన అద్దం ముక్కమ్మ… జవాబు లేని లెక్కమ్మా… పొద్దురాని తూర్పు దిక్కమ్మా’ అంటూ విషాదగీతం నేపథ్యంగా వినిపిస్తుంది. కడుపులో ఉన్నది ఆడబిడ్డని తెలుసుకున్న ఓ అత్త ‘ఆడబిడ్డను కనడానికి వీల్లేదు. కంటే నా ఇంటిగడప తొక్కవ్’ అని కోడలికి హుకుం జారీ చేస్తుంది. అప్పుడు కడుపులోని ఆడ శిశువు బయటికి వచ్చి ‘నన్ను పుట్టనివ్వరా అమ్మా! అర్ధరాత్రి ఆడది గడప దాటినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అన్నాడే బాపూజీ. గడపే కాదు నన్ను కడుపులో నుంచి లోకంలోకే రానివ్వడం లేదు కదమ్మా… ఇదెక్కడి స్వాతంత్య్రం అమ్మా’ అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అందరూ మ్రాన్పడిపోతారు.
ఇలా ఏడు సందర్భాల్లో.. బాలికల దయనీయ జీవితాల్ని రేఖామాత్రంగా ఈ రూపకం ఆవిష్కరిస్తుంది. భారతమాత ఎక్కడో ఊహల్లో ఉండదు. మనకు రోజూ కనిపించే ప్రతి చెల్లిలో, అక్కలో, అమ్మలో ఉంది. ఆడవాళ్లందరిలో ఉంది. ‘ఈ పసిమొగ్గలు వికసించకుండా నేలరాలిపోతే భారతమ్మ ఉనికే ఓ పెద్ద ప్రశ్న’ అని జర్నలిస్ట్ చివరగా పొలికేక వేస్తుంది.
ముప్పై ఏళ్ల క్రితం బాలికా చైతన్య కళాయాత్రలో రూపొందిన ఈ కళారూపం (నాటిక) ఇప్పటికీ సజీవంగానే ఉన్నది. అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినం (జూన్ 12) సందర్భంగా హైదరాబాద్ జవహర్నగర్ బస్తీలో ఈ నాటిక ప్రదర్శించారు. ప్రదర్శించిన బాలికలు, చూస్తున్న బస్తీవాసులు, పిల్లలు అలాంటి నిరుపేద వలస కుటుంబీకులు కావడం వల్ల త్వరగా నాటికతో కనెక్ట్ అయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలెన్ని ఉన్నా… అధికారులు, ప్రజలు, సమాజ సేవకులు అందరూ కలిసి సమన్వయంతో కృషి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
నాటిక పేరు: భారతమ్మ ఎక్కడ?
రచన: దేవేంద్ర
రూపకల్పన, దర్శకత్వం: ఎస్సార్
సమర్పణ: లైట్
నిర్వహణ: క్రై, జనవిజ్ఞాన వేదిక
నటులు: అక్షిత, హర్షిత, జీవన, ఇంద్రజ, దారుణ్య తదితరులు
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు