కుక్కను పెంచితే మనిషి.. మొక్కను పెంచితే మహర్షి.. మరి మనిషే తన శరీరాన్ని విడిచి ‘మొక్క’లా మారిపోవాలనే తలంపు ఉంటే? వారినేమనాలి? ‘ద వెజిటేరియన్’ నవలలోని ఓ గృహిణి భావన ఇది. మాంసం తినడం మానేసి మొక్కగా మారాలనుకొనే మధ్య వయస్కు రాలైన ఒక కొరియన్ మహిళ కథే ఈ నవల. సౌత్ కొరియాకు చెందిన హాన్ కాంగ్ ఈ నవలా రచయిత్రి. సాహితీ రంగానికి ఆమె చేసిన సేవకు గానూ హాన్ కాంగ్‌ను నోబెల్ బహుమతి వరించింది. పురస్కారం ప్రకటించిన వారంలోనే ‘ద వెజిటేరియన్’ నవల పది లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమెజాన్‌లో అవుటాఫ్ స్టాక్.
యాబైమూడేండ్ల హాన్ కాంగ్ ఇప్పటి వరకు ఏడు నవలలు రాసింది. ‘ద వెజిటేరియన్’ నవలకు బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈమె సాహిత్యంలో చేసిన కృషికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నోబెల్’ ప్రైజ్ కూడా దక్కింది. కొరియాలో నోబెల్ సాధించిన మొట్టమొదటి రచయిత్రిగా, ఆసియాలోనే ఈ ఘనత వహించిన ప్రప్రథమ మహిళా రచయితగా హాన్ హానర్ అందుకుంది. 2016లో ‘ద న్యూయార్క్ టైమ్స్’ రివ్యూలో ప్రపంచంలోని పది అత్యుత్తమ పుస్తకాల్లో ఒకటిగా ‘ద వెజిటేరియన్’ నిలిచింది. హాన్ కాంగ్ కొరియాలోని గ్వాంగ్జూలో పుట్టింది. తండ్రి, అన్న రచయితలు, తమ్ముడు కార్టూనిస్టు. తండ్రి నుంచి రచనాసక్తిని పుణికిపుచ్చుకున్న హాన్ చిన్నప్పుడే కలం పట్టింది. తనలోని భావాలను అక్షరీకరించేది. చారిత్రక గాయాలను తెలియజేస్తూ మానవ జీవితంలోని సున్నితత్వాన్ని వెలికితీసే గాఢమైన కవితాత్మక రచన చేయడం హాన్ శైలి.
ఈమె ప్రతి నవలలో అతి సాధారణంగా ఉండే మహిళాపాత్ర మనస్తత్వమే ఈమెది కూడా. ‘నోబెల్ సాధించిన మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నార’ని అడిగితే.. ‘నేను చేసుకునే సంబరం ఏంటంటే నా కొడుకుతో కలిసి చాయ్ తాగడమే’ అని చెప్పింది హాన్. అంతేకాదు, ‘ఈ బహుమతి నా జీవితంలో ఎలాంటి మార్పు కలగజేయబోదని నేను కోరుకుంటాను’ అని కూడా చెప్పింది.
‘ద వెజిటేరియన్’ నవలలో ఇద్దరు దంపతులు ఉంటారు. అతి సామాన్యులు. భార్య బ్రా కూడా ధరించడానికి ఇష్టపడని అత్యంత సామాన్యురాలు. కొరియన్లు స్వతహాగా మాంసప్రియులని ప్రపంచమంతా తెలిసిందే! భోజనంలో బొక్కలేనిదే బొజ్జనిండని మనుషులు. అతి సామాన్యురాలైన ఆ గృహిణి సాబా, సాంగో, ఎండ్రెడ్ చేపలను నిష్ఠగా అగ్గిపై గ్రిల్ చేసి, సోయాసాస్ చిలకరించి, ఆపై నిగనిగలాడే పంది మాంసాన్ని స్టీమ్ చేసి, గార్లిక్ సాస్‌తో ఘాటుగా వండి వార్చి, పచ్చని ఆకుల్లో చుట్టి పక్కన పెడుతుంది. ఆనక నత్త గుల్ల్లల్లోని మాంసాన్ని నేర్పుగా బొటనవేలితో పెకిలించి.. ఆ తర్వాత సముద్రపు చేపపిల్లల చెక్కిళ్లను వలిచి రుచికరంగా వండటంలో, తినడంలోనూ నేర్పరి. కొరియన్ దేశస్తులతోపాటు ఆ దంపతులూ అలా తింటూ రోజులు గడిపేస్తుంటారు.
ఒకరోజు ఆ గృహిణి తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచి వంటింట్లోకి వెళ్తుంది. అక్కడున్న ఫ్రిజ్ డోర్ తీసి ఏ కదలికలూ లేకుండా చెదిరిన జుట్టుతో అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే వాష్ రూమ్ కోసం లేచిన భర్త.. చుట్టూ చీకటిలో ఫ్రిజ్ వెలుతురులో దెయ్యంలా నిలబడ్డ తన భార్యని చూసి షాక్ అవుతాడు. ఆ దృశ్యం తన కాపురంలో ఒక సునామీ రేపుతుందని అతను అప్పుడు ఊహించలేకపోతాడు. ఆ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన అతి ఖరీదైన మాంసం ముక్కలు తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటుందామె. ఇక నుంచి మాంసం తినననీ, వండననీ కరాఖండిగా చెబుతుంది. భర్త ఆశ్చర్యంతో ఎందుకని అడిగితే ‘ఒక కల వచ్చింది’ అని చెబుతుంది. ఆ ఇంట్లో ఒక నిశ్శబ్ద తిరుగుబాటు మొదలవుతుంది. ఆమె శరీరం కూడా ఒక మాంసం ముద్దే కదా అందుకని తన శరీరాన్ని కూడా వదిలేసి సూర్యరశ్మి తప్ప మరే అవసరం లేని ఒక ‘మొక్క’లా బతకాలని అనుకుంటుంది. ఎందుకలా? ఏందా కల?
Han Kang
మెజారిటీ కొరియన్లు తినే మాంసాన్ని ఒక గృహిణి రెబెలియస్గా నిరసించడం అన్నది రచయిత్రి హాన్ కాంగ్ ఎంచుకున్న ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్.. ఒక ఉపమానం. ఆ ఇంట్లో మాంసం తినొద్దన్న ఆమె నిర్ణయం.. ఆడవాళ్లు ఏం చేయాలో నిర్ణయించే పురుషాధిక్య సమాజానికి సవాల్. నిరంకుశమైన సామాజిక నిబంధనలు, సంప్రదాయాలతో మమేకమైన ఒక పితృస్వామ్య వ్యవస్థకు ఆమె మౌన నిరాకరణ ఒక ధిక్కారం. ఈ భూమి మీద మనిషివైనా, ఏ జీవివైనా పచ్చి రక్తపుమాంసం ముద్దలే! ఇది బతకడానికి చేసే హింస. హాన్ కాంగ్ రాసిన ప్రతి నవల కూడా శరీరం, ఆత్మ, బతికున్నవారు, చనిపోయినవారు, నేరస్తుడు, బాధితుడు.. ఈ అంశాల చుట్టే తిరుగుతుంది.
1980లో సౌత్ కొరియాలో గ్వాంగ్జూ తిరుగుబాటు జరగడానికి ముందు ప్రభుత్వ సైనికులు ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ దమనకాండ.. మానవత్వంలోని భిన్నమైన హింసా, దయ, విముక్తి పట్ల హాన్ కాంగ్లో లోతైన ఆలోచనలు రగిలించింది. ఆనాడు ఆమె మనసులో ప్రజ్వరిల్లిన అగ్నికీలలే ‘ద వెజిటేరియన్’ నవల రాయడానికి పురిగొల్పాయి. ‘మనుషులంతా మొక్కలుగా మారాలి’ అన్న థీమ్‌తో ఆమె రకరకాల షార్ట్ స్టోరీస్ కూడా రాసుకుంది. వీటన్నిటికీ ఫైనల్ వెర్షనే ‘ద వెజిటేరియన్’.
మూడు చాప్టర్లతో ఉన్న ఈ పుస్తకం తప్పక కొని చదివాల్సినది.. మొదటి భాగంలో భర్త, రెండో భాగంలో ఆమె చెల్లె భర్త, మూడో భాగంలో చెల్లి- మూడు వేర్వేరు కథలుగా ఉంటాయి. సెక్స్, ఈర్ష్య, విద్వేషం గురించి చర్చిస్తాయి.హాన్ కాంగ్ నవలల్లో స్త్రీ కోరుకునేది ఫ్రీడం కాదు, లిబరేషన్. ఇందులోనూ అదే కనిపిస్తుంది.
‘ద వెజిటేరియన్’ నిజంగా ఒక వింత, విచారం, అందం, ఆకర్షణీయం.. ఒక మాయాజాలం! నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిసారి కొరియావారికి రావడం అదీ మహిళకు రావడం ఒక పొయెటిక్ జస్టిస్!
… మృత్యుంజయ్
కార్టూనిస్టు