ఆలుమగల మధ్య మాటపట్టింపులు ఎన్నో ఉంటయి. అలకలు మామూలే! అయినా ఇద్దరి మధ్యా ఉండే ప్రేమ.. వాటిని అధిగమించేలా చేస్తుంది. మూడుముళ్లు, ఏడడుగులతో ఒక్కటయ్యే జంట బంధం నూరేండ్లూ కొనసాగాలంటే.. ఈ ఏడు దశలనూ దాటాల్సిందే! ఇందులోని ఒక్కో దశ.. తనదైన సరికొత్త సవాళ్లతో సాగుతుంది. ఒక్కోసారి అందంగా, మరోసారి క్రూరంగా మారుతుంది. అన్ని దశలనూ దాటినప్పుడే.. దంపతుల మధ్య ప్రేమతోపాటు నమ్మకమూ పెరుగుతుంది. వివాహబంధం.. మధురమైన అనుబంధంగా మారుతుంది.
పెళ్లయిన కొత్తలో.. గాలిలో తేలినట్లుగా అనిపిస్తుంది. ప్రతీ క్షణం, ప్రతిరోజూ ఒక అద్భుతమైన కథలా సాగుతుంది. భాగస్వామి గురించి తెలిసే ప్రతీ చిన్న విషయం.. ఓ మాయాజాలంగా తోస్తుంది. ఈ దశంతా సంతోషంగానే సాగిపోతుంది. ఉభయులూ ఒకరినొకరు అర్థం చేసుకునే దశ కూడా ఇదే!
నవ దంపతులిద్దరూ తమలోని మంచి గుణాలు, ఉత్తమ స్వభావాన్ని మాత్రమే బయటపెడతారు. ఎక్కడలేని దయ, ఓర్పు, ప్రేమను ప్రదర్శిస్తారు. వారివారి నెగెటివ్ షేడ్స్‌ను మాత్రం.. తమలోనే దాచుకుంటారు. తమ వివాహ బంధాన్ని కలకాలం నిలిపి ఉంచడానికి ప్రేమ ఒక్కటే చాలని అనుకుంటారు. అయితే, ఇది కేవలం అందమైన భ్రమ మాత్రమేనని తెలుసుకోలేరు. ఎందుకంటే.. నిజమైన వైవాహిక జీవితం ఇంకా మొదలవ్వలేదు. కాల పరీక్ష ఇంకా ప్రారంభమవ్వలేదు.
రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇద్దరి లోపాలు, బలహీనతలు బయటపడతాయి. ఒకప్పుడు అందంగా అనిపించినవి.. ఇప్పుడు చిరాకు తెప్పిస్తాయి. ఆనందంగా, ఉల్లాసంగా మొదలయ్యే సంభాషణలు.. మరింత లోతుగా సాగుతాయి. అయితే.. భాగస్వామిలోని అసలైన వ్యక్తిని చూడటం ఈ దశలోనే ప్రారంభమవుతుంది.
ఈ దశ చాలా కష్టతరంగా సాగుతుంది. వివాహబంధంలోని అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరి మధ్యా విభేదాల వాస్తవికత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగం, ఆస్తిపాస్తులు, అత్తమామలు.. భాగస్వామిలో కొత్త సందేహాలకు దారి తీస్తాయి. ఇలాంటి సమయంలో చాలామంది ‘కలిసి జీవితాంతం సంతోషంగా ఉండగలమా?’ అని సందేహ పడుతుంటారు. అయితే, ఒకరిపై ఒకరికి నమ్మకం సడలకుంటే.. ప్రేమ తగ్గకుంటే.. వారిలోని లోపాలు, బలహీనతలను మార్చుకునే అవకాశం దక్కుతుంది.
దుర్భరమైన నిరాశ దశను విజయవంతంగా దాటి ముందుకు సాగితే.. వాస్తవ జీవితంలోకి అడుగుపెడతారు. ఒకరినొకరు మార్చుకోవడానికి ప్రయత్నించడం మానేసి.. ఇద్దరూ కలిసి ఎలా ఎదగాలో నేర్చుకోవడం మొదలుపెడతారు. ఎదుటివారిపై ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది. నమ్మకం, స్థిరత్వంతోపాటు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం ప్రారంభమవుతుంది. మనుగడ ప్రశ్నార్థకమైన వివాహబంధం.. పునరుజ్జీవం పోసుకుంటుంది. ఇది.. కఠినమైన శిశిరం తర్వాత వచ్చే వసంత రుతువు లాంటిది. కొత్త చిగుర్లతో బంధం బలంగా మారుతుంది.
ఇప్పటివరకూ భార్యభర్తలిద్దరూ ఎన్నో దుర్భరమైన రోజులను చూసి ఉంటారు. వాదోపవాదాలు, ఒత్తిడి, ఆందోళన, భయం.. ఇలా ఎన్నిటినో దాటి వస్తారు. అయినప్పటికీ.. ఇంకా కలిసే ఉన్నారు. అక్కడే ఇద్దరిలో లోతైన ప్రేమ ప్రారంభమవుతుంది. ఇకపై ప్రేమను నటించాల్సిన అవసరం ఉండదు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఈ దశ.. మొదటి దశ కన్నా ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు.
గతకాలపు గొడవలు, మనస్పర్ధలు వైవాహిక బంధాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి, చివరి దశ అందంగా మారుతుంది. సాంగత్యం మరింత బలంగా తయారవుతుంది. ఇక్కడ ఇద్దరూ కేవలం దంపతులు మాత్రమే కాదు. జీవితాంతం తోడూనీడగా ఉండే సహచరులుగా మారుతారు. ఉదయం టీ తాగడం మొదలు.. సాయంత్రపు నడకల దాకా; రోజంతా పంచుకునే కష్టసుఖాలు మొదలు.. నిశ్శబ్దంగా చేసే ప్రార్థనల దాకా.. రోజువారీ సాధారణ విషయాలలోనూ ఆనందాన్ని పొందుతారు. ఈ దశకు చేరిన బంధం.. జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంది.