వర్షాకాలం అంటే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకునే సమయం. చల్లటి గాలులు, పచ్చని పరిసరాలు, కురిసే జల్లులు పిల్లలకు ఎంతో ఆనందాన్ని పంచుతాయి. వర్షంలో తడవడం, నీటిగుంటల్లో ఆడుకోవడం, స్నేహితులతో కలిసి బయట గడపడం చిన్నారులకు ఎంతో ఇష్టమైన విషయాలు. అయితే ఈ అందమైన కాలమే అనేక అంటువ్యాధులకు కూడా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. అందుకే శిశువైద్యులు ప్రతి వర్షాకాలాన్ని ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా చూడాలని సూచిస్తుంటారు.
ప్రతి ఏడాది వర్షాలు ప్రారంభమైన తర్వాత జ్వరం, దగ్గు, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు వంటి సమస్యలతో దవాఖానలకు వచ్చే చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వీటిలో చాలా వ్యాధులను సరైన జాగ్రత్తలతో పూర్తిగా నివారించవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే, ముందస్తు నివారణే ఉత్తమ మార్గం. ఈ నివారణ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేస్తే పిల్లలను వర్షాకాల వ్యాధుల నుంచి సమర్థంగా రక్షించవచ్చు.
వర్షాకాలంలోనే ఎందుకు?
వర్షాలు కురిసిన తర్వాత అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కలుషిత నీటి సమస్యలు ఎక్కువవుతాయి. అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. పిల్లలు బయట ఆడుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా తినడం, బురదలో ఆడటం, ఒకరి వస్తువులు మరొకరు ఉపయోగించడం లాంటి అలవాట్ల వల్ల ఇన్ఫెక్షన్లు సులభంగా సోకే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

నిర్లక్ష్యం కూడదు
వర్షాకాలంలో ఎక్కువగా ఆందోళనకు గురిచేసే లక్షణం జ్వరం. అయితే ప్రతి జ్వరం ఒకే కారణంతో రాదు. కొన్ని జ్వరాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే, మరికొన్ని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, ఇన్ఫ్లుయెంజా వంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా యాంటీ బయాటిక్స్ వాడకూడదు. పిల్లల శరీర ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా వారి చురుకుదనం, నీరు తాగుతున్నారా, శ్వాస సరిగా ఉందా లాంటి అంశాలను కూడా గమనించాలి. జ్వరం రెండు నుంచి మూడు రోజులకు మించి కొనసాగినా లేదా వాంతులు, శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన కడుపునొప్పి, అసాధారణ నిద్రమత్తు తదితర లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
డెంగ్యూ.. ప్రమాదకరం
వర్షాకాలం ప్రారంభమైతే ఎక్కువగా వినిపించే పేరు డెంగ్యూ. ఈ వ్యాధిని వ్యాపింపజేసే ఏడిస్ దోమలు మురికి నీటిలో కాకుండా శుభ్రమైన నిల్వ నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. నీటి కుండీలు, కూలర్లు, బకెట్లు, పాత టైర్లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు, చిన్న మూతలు లాంటి వాటిలో నిల్వ ఉన్న కొద్దిపాటి నీరు కూడా దోమల పెరుగుదలకు దోహదం చేస్తుంది. డెంగ్యూ వచ్చిన పిల్లల్లో అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, మూత్రం తగ్గడం, చేతులు కాళ్లు చల్లబడటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. ప్రతి వారం ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిని తొలగించడం ద్వారా డెంగ్యూ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఇవీ ప్రమాదకరమే
డెంగ్యూతో పాటు మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా వర్షాకాలంలో పెరుగుతాయి. మలేరియాలో జ్వరం, వణుకు, చెమటలు, వాంతులు కనిపిస్తాయి. చికున్‌గున్యాలో తీవ్రమైన కీళ్ల నొప్పులు వారాల తరబడి ఉండవచ్చు. ఈ వ్యాధుల నివారణకు దోమల పెరుగుదలను అరికట్టడం, దోమతెరలు ఉపయోగించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, పిల్లలకు దోమల నివారణ క్రీములు లేదా రిపెలెంట్లు ఉపయోగించడం చాలా అవసరం.
మరోముప్పు విరేచనాలు..
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కావడం, ఆహారం త్వరగా పాడవడం వల్ల విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్, హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. చిన్నపిల్లల్లో విరేచనాల వల్ల శరీరంలో నీరు వేగంగా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం చాలా అవసరం. తల్లిపాలను ఆపకూడదు. పెద్ద పిల్లలకు శుభ్రమైన నీరు, తాజా ఇంటి ఆహారం ఇవ్వాలి. వైద్యులు సూచించినప్పుడు జింక్ సప్లిమెంట్లు కూడా ఉపయోగపడతాయి.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
వర్షాకాలంలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ, అడెనోవైరస్, రైనోవైరస్ లాంటి వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. సాధారణంగా పిల్లలు విశ్రాంతి, ద్రవాహారం తీసుకుంటే కోలుకుంటారు. అయితే ఆస్తమా, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న పిల్లల్లో న్యుమోనియా లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి పడిపోవడం, ఆహారం తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వీటిని నిర్లక్ష్యం చేయొద్దు
తేమ ఎక్కువగా ఉండే ఈ కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు, కంటి కలక వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వర్షంలో తడిసిన దుస్తులను వెంటనే మార్చడం, చెప్పులు పూర్తిగా ఆరబెట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తువ్వాళ్లు పంచుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.
పోషకాహారం తప్పనిసరి
ఏ ఒక్క ఆహారం వ్యాధులను పూర్తిగా నివారించదు. కానీ, సమతుల్యమైన పోషకాహారం, తగిన నిద్ర, వ్యాయామం, సమయానికి టీకాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తాజా ఇంటి ఆహారం, ఆకుకూరలు, శుభ్రంగా కడిగిన పండ్లు, గుడ్లు, పప్పులు, పాలు, చేపలు లేదా ఇతర పోషకాహారం ఇవ్వాలి. రోడ్డు పక్కన లభించే అపరిశుభ్రమైన ఆహారాన్ని తగ్గించాలి.
టీకాలు ముఖ్యం
వర్షాకాలం కారణంగా పిల్లల టీకాలను వాయిదా వేయకూడదు. వయసు, అవసరాన్ని బట్టి ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్ టీకాలను కూడా శిశువైద్యుల సూచన మేరకు వేయించాలి. టీకాలు పిల్లలను మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా రక్షిస్తాయి.
ఇక పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, చేతులు కడుక్కునే అలవాటు, జ్వరం ఉన్న పిల్లలను గుర్తించడం, పాఠశాల పరిసరాల్లో నిల్వ నీటిని తొలగించడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. అదే విధంగా ప్రతి కాలనీలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సీజనల్ వ్యాధులను గణనీయంగా
తగ్గించవచ్చు.
చివరిగా, వర్షాకాలం పిల్లలకు ఆనందాన్ని అందించే కాలమే కావాలి, అనారోగ్యాన్ని కాదు. తల్లిదండ్రులు పరిశుభ్రత, పోషకాహారం, టీకాలు, దోమల నివారణ, సకాలంలో వైద్య సలహా వంటి సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. ప్రతి కుటుంబం తీసుకునే చిన్న జాగ్రత్తే ప్రతి చిన్నారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన రక్షణ కవచంగా మారుతుంది.
పాటించాల్సిన పది సూత్రాలు
డాక్టర్. సురేష్ కుమార్ పానుగంటి
సీనియర్ పీడియాట్రీషియన్
పసిపిల్లల వైద్య నిపుణులు
యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ , హైదరాబాద్