యువతలో చాలామంది రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. కొందరు ఏవేవో రీల్స్ చేస్తూ.. కాలక్షేపం చేస్తుంటారు. ఈ ‘పల్లెటూరి కుర్రోళ్లు’ కూడా రీల్స్ చేస్తుంటారు. అందరినీ నవ్విస్తారు. కొసమెరుపుగా.. చక్కని సందేశమిస్తారు. పేదరికంలో పుట్టిన ఈ కుర్రోళ్లు.. రీల్స్ ద్వారా తమకు వచ్చిన ఆదాయంతో పెద్దమనసును చాటుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే మార్పు మనలోనే రావాలంటూ వీళ్లు చేసిన చిన్న వీడియో… రాష్ట్ర పోలీస్ శాఖ అభినందనలు అందుకుంది. సరదాగా రీల్స్ మొదలుపెట్టి.. కోట్లలో వ్యూస్ కొల్లగొడుతున్న ‘పల్లెటూరి కుర్రోళ్లు’ యూట్యూబ్ చానెల్ డైరెక్టర్, ఎడిటర్, స్క్రిప్ట్ రైటర్ ఖదీర్ బాషా బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది జోగులాంబ గద్వాల జిల్లా, ఐజా మండలంలోని బైనపల్లె గ్రామం. అమ్మానాన్నలిద్దరు చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు. నేను వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటా. నాకు చిన్నప్పటినుంచి చదువంటే ఎంతో ఇష్టం. మా ఊళ్లోని సర్కార్ బడిలో పదో తరగతి దాకా చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులతో నా చదువు అక్కడే ఆగిపోయింది. చదువు కోసమని ఇంట్లో నుంచి పారిపోయా. ఏడాదిపాటు ఎక్కడెక్కడో తిరిగా! మళ్లీ ఇంటికి వచ్చాక, చదువు మీద నా ఆసక్తి చూసి.. మా మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదివిస్తామని నాకు హామీ ఇవ్వడంతో అందులో చేరాను. కానీ, ఫీజు కడితేనే పబ్లిక్ పరీక్షలు రాయనిస్తామని హాల్‌టికెట్ ఇవ్వకుండా బెదిరించారు. ఫీజ్ కట్టలేక పరీక్షలు రాయలేదు. నా పదోతరగతి సర్టిఫికెట్లు వారి దగ్గరే ఉండటంతో మళ్లీ చదువుకునేందుకు ప్రయత్నించలేదు.
ఊర్లో సొంత పొలం లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లేవాణ్ని. కూరగాయల తోటల్లో, పూల తోటల్లో, పత్తి చేన్లలో పని చేసుకుని బతుకుతున్న రోజుల్లో ఫొటోగ్రఫీ నేర్చుకోవాలన్న ఆసక్తి మొదలైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూనే.. ఫొటోగ్రఫీ నేర్చుకున్నా. సమయం దొరికినప్పుడు మా దోస్తుల ఫోన్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేవాణ్ని. కొన్నిరోజులకు నాకూ అలాంటి రీల్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ, నా దగ్గర స్మార్ట్‌ఫోన్ ఎక్కడిది? మా దోస్తు ఫోన్ తీసుకొని.. వీడియో రికార్డు చేసేవాణ్ని.
వాళ్ల ఫోన్ నుంచే నా అకౌంట్ క్రియేట్ చేసి.. వాటిని పోస్టు చేసేవాణ్ని. మూడేండ్ల కిందట బైక్ దొంగతనం కాన్సెప్ట్‌తో ఒక కామెడీ వీడియో తీసి పోస్ట్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లక్షకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది. మరోవైపు ఇప్పుడు నా టీమ్‌లో ఉన్న కుర్రోళ్లు గతంలో చిన్నచిన్న రీల్స్ చేసేవాళ్లు. వారి యాక్టింగ్ బాగుందనిపించి.. నా టీమ్‌లో చేర్చుకున్నా. అలా అందరం కలిసి ‘పల్లెటూరి కుర్రోళ్లు’ చానెల్ ప్రారంభించాం.
వారానికి రెండు రోజులు షూటింగ్‌లు చేసుకుంటూ మిగతా రోజుల్లో సొంత పనులు చూసుకుంటాం. ప్రారంభంలో నాలుగురోజులకు ఒక వీడియో అప్లోడ్ చేసేవాళ్లం. ఇప్పుడు రెండు రోజులకు ఒకటి చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 420 రీల్స్ పోస్ట్ చేశాం. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ ఎనిమిది రీల్స్కైతే కోట్లలో వ్యూస్ వచ్చాయి. మొదట్లో మేం వీడియోలు తీస్తుంటే.. మా ఊరోళ్లు ‘వీళ్లకేం పనీపాటా లేదా?’ అన్నట్టు చూసేవాళ్లు. ఇప్పుడు వారి పొలాల్లో షూటింగ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు.
‘పల్లెటూరి కుర్రోళ్లు’కు ముందు మేమంతా అర్ధాకలితో అలమటించినవాళ్లమే! ఇప్పుడు మా పరిస్థితి కాస్త మారింది. మా ఊళ్లోనే స్టూడియో ఏర్పాటు చేసుకొని… వలసలకు దూరంగా హాయిగా జీవిస్తున్నాం. మా యూట్యూబ్ చానెల్ మీద నెలకు రూ.లక్ష వరకు వస్తుంది. ఓ ఇరవై వేలు ఖర్చులు పోగా, మిగతా డబ్బును అందరం పంచుకుంటాం. మా టీం సభ్యులు రాజపురం, కిసాన్‌నగర్ క్యాంప్, మేడికొండ గ్రామాలకు చెందినవాళ్లు.
ఇందులో ఒకడైన దేవేంద్రకు తండ్రిలేడు. పేద కుటుంబం. అతనికి ఫొటోగ్రఫీ నేర్పించా. మరొక యాక్టర్ రాజుకు సొంతిల్లు లేదు. కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. హరికీ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ నేర్పించా. సెకండ్ హ్యాండ్ బండ్లు ఎక్స్పోర్ట్ చేస్తూ జీవనం సాగించే పరశురాములుకు తండ్రిలేడు. మా సూచనలతో దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. వలస కుటుంబమైన వీరేశానికి యాక్టింగ్ వల్ల వచ్చే డబ్బు ఎంతో ఊరటనిస్తుంది. ఇలా మా సంపాదన మా కుటుంబాలకు ఆసరా అవుతున్నది.
గతేడాది మా చానెల్ హ్యాక్ అయింది. పరిష్కారం కోసం చాలామందిని సంప్రదించాం. ఆ సమయంలోనే గద్వాల్ పోలీస్‌లు ఫోన్ చేసి..‘పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సందేశాత్మక వీడియో తీయాల’ని చెప్పారు. మా చానెల్ పరిస్థితిని చెప్పగా వారు సహకరించడంతో వీడియో తీసి సెలెక్షన్‌కు పంపించాం. మేం చేసిన వీడియో రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిందని అధికారులు ఫోన్ చేసి చెబితే ఫ్రాంక్ కాల్ అని కొట్టిపారేశాను. మళ్లీ మా జిల్లా పోలీసులు చెబితే గానీ నమ్మకం కుదరలేదు.
రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తరువాత మా బాధ్యత మరింత పెరిగిందనిపించింది. నవ్వించడంతోపాటు సామాజానికి ఉపయోగపడే అంశాలను మా వీడియోల్లో మరింత జోడించాలనుకున్నాం. మా ఆదాయం ఒక్కోనెల ఒక్కోలా ఉంటుంది. అనుకున్నదానికంటే ఎక్కువ వచ్చే డబ్బులతో కొన్ని సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నాం. మూడేండ్లుగా వేసవిలో మా గ్రామంలో చలివేంద్రం నిర్వహిస్తున్నాం. నాలుగు గ్రామాల్లోని మెయిన్ సెంటర్లలో బెంచీలు ఏర్పాటుచేశాం. మా ఊరిలోని వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేశాం. మా ఊరి రోడ్డు సమస్యపై మా రీల్స్ ద్వారా వినూత్నంగా నిరసనలు తెలియజేసి.. ఆ రోడ్డును పూర్తి చేయించాలన్నదే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.
మా వీడియోకు అవార్డు ఇచ్చే సందర్భంలో.. ఒక చిన్నగదిలో అవార్డు ఇచ్చి ఫొటో దిగి పంపిస్తారని అనుకున్నా. కానీ నేను ఊహించనంత పెద్ద వేదికమీద ఆ వేడుక జరిగింది. అయితే, కార్యక్రమ ప్రాంగణంలో మా వాలకం చూసి అక్కడి సిబ్బంది మమ్మల్ని అడ్డుకున్నారు. నిర్వాహకులు జోక్యం చేసుకొని లోపలికి రానిచ్చారు. ముందు వరసలో కూర్చొంటే కూడా అడ్డుపడ్డారు. చివరికి స్టేజ్ ఎక్కుతుంటే కూడా ఆపే ప్రయత్నం చేశారు. మళ్లీ నిర్వాహకులే జోక్యం చేసుకొని రమ్మన్నారు. ‘నాతో కలిసి ఓ ఫొటో దిగండి’ అని డీజీపీ సార్ అడిగినప్పుడు సంతోషడ్డాం. ఊహించని విజయమిది.
– రాజు పిల్లనగోయిన