కొత్త ఫోన్ కొన్నప్పుడు బాక్స్‌లో చార్జర్ రాకపోవడం ఇప్పుడో ట్రెండ్ అయిపోయింది. ఇక పాత చార్జర్లేమో కొత్త ఫోన్ల వేగాన్ని అందుకోలేవు. ఇలాంటప్పుడు ‘మంచి చార్జర్ ఎక్కడ దొరుకుతుంది?’ అని వెతికే వాళ్లకోసం.. మన స్వదేశీ బ్రాండ్ ‘ఓక్టర్’ అదిరిపోయే ఆప్షన్‌ను పట్టుకొచ్చింది. అదే.. ఓక్టర్ 65W GaN చార్జర్. సాధారణ సిలికాన్ బదులు గాలియం నైట్రైడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ చిన్న చార్జర్.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ల్యాప్‌టాప్ వరకు అన్నిటినీ చార్జ్ చేసేస్తుంది. ఇతర చార్జర్లతో పోలిస్తే GaN చార్జర్లు సైజులో చిన్నవిగా ఉంటాయి. కానీ, పనితీరులో పవర్ఫుల్. చార్జింగ్ సమయంలో తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి.
గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను చార్జ్ చేసినా.. ఇది ఏమాత్రం వేడెక్కదు. ఇందులో షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్, వోల్టేజ్ స్పైక్స్ నుంచి రక్షణ ఇచ్చే ఇన్-బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది సూపర్ ఫాస్ట్ కాకపోవచ్చు కానీ, రోజువారీ అవసరాలకు మాత్రం పక్కాగా సరిపోతుంది. ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీని 55 నిమిషాల్లోనే సున్నా నుంచి వంద శాతానికి నింపేస్తుంది.
ఇక మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం2) అయితే దాదాపు మూడు గంటల్లో ఫుల్‌చార్జ్ అయిపోతుంది. ఆఫీస్‌కి వెళ్లేముందు ఒక 15-20 నిమిషాలు ప్లగ్ పెట్టినా చాలు.. కొన్ని గంటల పాటు నిశ్చింతగా ఉండొచ్చు. ఇది గ్లాసీ వైట్ ఫినిషింగ్‌తో సింపుల్‌గా కనిపిస్తుంది. మరకలు పడినా తడి గుడ్డతో తుడిస్తే మెరిసిపోతుంది. చార్జర్‌తోపాటు బాక్స్‌లో 1.5 మీటర్ల పొడవున్న యూఎస్బీ-సి టూ యూఎస్బీ-సి కేబుల్ కూడా వస్తుంది.