‘సేంద్రియ ఎరువులే వ్యవసాయానికి ఆదరువు’ అని నమ్మాడు ఆ రైతు. భూసారాన్ని పెంపుచేస్తూ అధిక ఫలసాయాన్ని అందుకుంటూ లాభాలే కాదు అవార్డులూ అందుకుటుంన్నాడు ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డి. అతడి సేంద్రియ సేద్యం ఉద్యానవన శాస్త్రవేత్తలకు పరిశోధనా కేంద్రం. వ్యవసాయ విద్యార్థులకు పాఠశాల. అందరిలా సాగుబడిలో సాగుతున్న రైతుని సరైన బాటలో నడిపిన ఎద్దు నేర్పిన ఎవుసం ఇది!

నల్లగొండ జిల్లా, చందంపేట మండలంలో పోలేపల్లి గ్రామం. ఆ ఊరి రైతు లోకసాని పద్మారెడ్డి పద్దెనిమిది ఎకరాలలో బత్తాయి తోట వేశాడు. మరికొంత భూమిలో కుంకుడు సాగు మొదలుపెట్టాడు. తన చేను గట్టున ఓ నేరేడు చెట్టుంది. నేలలో సారం లేక ఆ చెట్టు పెద్దగా కాసింది లేదు. ఆ నేరేడు చెట్టుకి రోజూ ఎడ్లను కట్టేసేవాడు పద్మారెడ్డి. కొన్నాళ్లు గడిచాయి. బత్తాయి పంట పెద్దగా రాలేదు. కానీ, ఓ రోజున కొమ్మల నిండా కాసిన నేరేడు చెట్టుని చూసి ఆశ్చర్యపోయాడు ఆ రైతు. ఎన్నో ఏండ్లు పెద్దగా పండ్లు కాయని ఈ చెట్టు ఇప్పుడెందుకు విరగ్గాసిందో ఆయనకు అర్థం కాలేదు. ఆశ్చర్యపోయాడు, ఆలోచించాడు. కారణం కనిపెట్టాడు. ఆ చెట్టుకు ఎడ్లను కట్టేయడం, మేత వేయడం, అది మేతను తొక్కుతూ తిరగడం, పెండ వేయడం, మూత్రం పోయడం వల్ల అక్కడ నేల సారవంతమైంది. ఆ సారం వల్లే నేరేడు కాసింది. ఈ సత్యం తెలిశాక భూసారం లేక దిగుబడినివ్వని బత్తాయికి ఏమి చేయాలో పద్మారెడ్డికి అర్థమైంది.
ఇలా మొదలై…
పద్మారెడ్డి పూర్తిస్థాయిలో సేంద్రియ సాగుకు మళ్లాడు. సంతకు తీసుకుపోయే ముసలి ఆవులు, ఎడ్లను కొన్నాడు. వాటి మూత్రం ఒక గుంటలోకి పోయేట్టు చేశాడు. ఆ గుంతలోనే పెండ వేసేవాడు. ఆ రెండూ కలిసిన తర్వాత మురిగిపోయి ద్రావణంలా తయారయ్యేది. పశువుల దగ్గరి కసువు, కుళ్లిన, పాడైపోయిన కాయలు ఆ గుంతలో వేసి కుళ్లిపోయేలా చేశాడు. పదిహేను రోజుల తర్వాత దానిని బత్తాయి చెట్లకు ఎరువుగా వేశాడు. అంతే.. తోట ఏపుగా పెరిగింది. ఫలసాయం పెరిగింది! పాతికేళ్ల నుంచి గోవు ఆధారిత సేంద్రియ పద్ధతిని ఆధారం చేసుకుని బత్తాయితోపాటు కుంకుడు, నిమ్మ, జామ, ఉసిరి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, సీతాఫలం, వరి పంటలు పండిస్తున్నాడు.

కుంకుడు సాగు ప్రయోగం
రైతులకు పద్మారెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చేది కుంకుడు సాగు. అటవీ పంటగా భావించే కుంకుడును వాణిజ్య పంటగా వేశాడు. పోలేపల్లిలో 12 ఎకరాల్లో కుంకుడు సాగు చేస్తూ రైతులకు మార్గదర్శిగా నిలిచాడు. పద్మారెడ్డి సాగు చేసిన కుంకుడుకు ‘లోకసాని పద్మారెడ్డి కుంకుడు’ పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో అధిక శాతం సాపోనిన్ ఉంది. దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొకల నర్సరీని పెంచాడు. మేలుజాతి కుంకుడు మొక్కల విస్తరణకు విశేషంగా కృషి చేస్తున్నాడు. కుంకుళ్లను తక్కువ రేటుకు మార్కెట్లో అమ్మకుండా, తానే విలువ ఆధారిత ఉత్పత్తులు తాయరు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. రైతు పంట పండిస్తే సరిపోదని, వ్యాపారిగా పంటకు అదనపు విలువ జోడిస్తేనే లాభం వస్తుందని చెబుతున్నాడు.
అవార్డుల సేద్యం!
కుంకుడు సాగులో ఎన్ని ప్రయోగాలు చేశారో నిమ్మ జాతి పంటల సాగులోనూ పద్మారెడ్డి అన్ని ప్రయోగాలు చేశాడు. దిగుబడి సాధించాడు. తాను సాగుచేస్తున్న బత్తాయి తోటలో నిమ్మతోపాటు రంగాపూర్ వేరుమూలంపై సాత్ గుడి అంటు కలిగిన మొకలు, జంబేరి వేరుమూలంపై సాత్ గుడి అంటు కలిగిన మొకలు, న్యూసెల్లార్ గోల్డ్, కాటోల్ గోల్డ్, జైన్ సీడ్ లెస్ బ్రెజిలియన్ ఆరెంజ్, మాల్టా జఫా, బారి మాల్టా, వియాత్నాం ఆల్ సీజన్ మాల్టా ఉన్నాయి. తన వ్యవసాయ క్షేత్రంలో నలభై సంవత్సరాల క్రితం నాటిన బత్తాయి మొక్కలు ఇప్పటికీ ఫల సాయం ఇస్తున్నాయి. ఇన్నేళ్లు ఫలసాయం ఇవ్వడం దేశంలోనే అరుదు. పద్మారెడ్డి సాగు నైపుణ్యాలకు ఈ తోట ఒక సాక్షి. ఉద్యానవన పంటలతోపాటు వరిని కూడా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు.
నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణా కార్యశాలల్లో పద్మా రెడ్డి మాస్టర్ ట్రైనర్‌గా రైతులకు సాగు పాఠాలు చెప్పాడు. సాగుబాటలో పద్మారెడ్డి సాధించిన విజయాలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ‘లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఛాంపియన్ ఫార్మర్, వనమాలి’ అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ సెంట్రల్ సిట్రస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 42వ ఆవిర్భావ దినోత్సవం రోజున సన్మానించేందుకు ఆహ్వానించింది. లోకసాని పద్మారెడ్డి ప్రయాణం ఒక రైతు కథ మాత్రమే కాదు. అది సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణ, విలువ ఆధారిత ఉత్పత్తులు, రైతు పారిశ్రామికత, స్థిరమైన ఆదాయం అనే ఐదు స్తంభాలపై నిర్మితమైన విజయగాథ.

‘వ్యవసాయం అంటే పంట పండించడం మాత్రమే కాదు. పంటకు విలువ జోడించి, ప్రకృతికి హాని తలపెట్టకుండా రైతు ఆర్థికంగా బలపడే విధానాన్ని నిర్మించడమే నిజమైన వ్యవసాయం’
– లోకసాని పద్మారెడ్డి
మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి