నిజానిజాల సంగతి అటుంచితే.. వెంటాడే పర్యాటక కేంద్రాలుగా ముద్రపడిన ప్రాంతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. చరిత్ర పుటల్లో చెరగని రక్తపాతాన్ని చవి చూసిన ప్రాంతాలు కొన్నైతే, నమ్మరాని కారణాలు చుట్టిముట్టి మట్టికొట్టుకుపోయిన ఆనవాళ్లు ఇంకొన్ని. విహారంలో వినూత్నం కోరుకునే వాళ్లకు ఇప్పుడు ఇవి హంటింగ్ డెస్టినేషన్స్. సిమ్లా-కాల్కా రైల్వే లైన్లోని టన్నెల్ నం.33 కూడా ఈ తరహా సందర్శన స్థలమే!
సిమ్లా-కాల్కా న్యారో గేజ్ రైలు మార్గాన్ని బ్రిటిష్ హయాంలో నిర్మించారు. సుమారు ఒక కిలోమీటర్ పొడవున్న టన్నెల్ నం.33 నిర్మాణ బాధ్యతలను సివిల్ ఇంజినీర్ కోలోనెల్ బడోగ్కు అప్పగించారు అధికారులు. రెండు వైపుల నుంచి సొరంగం తవ్వకం ప్రారంభించాడు బడోగ్. రెండు ఒకచోట కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేశాడు. తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రెండు సొరంగాలు దారి తప్పాయి. అధికారులు ఆగ్రహించారు. నిర్లక్ష్య వైఖరికి గానూ ఒక రూపాయి జరిమానా విధించారు. దీనిని అవమానంగా భావించిన బడోగ్ అదే సొరంగంలో తుపాకీతో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తర్వాత కొన్నాళ్లకు రైలు మార్గం పూర్తయింది.. రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. టన్నెల్ 33లోకి ప్రవేశించగానే రైలు ఆగిపోయేదట. ఎవరో వచ్చి మరమ్మతు చేసేవారట. మళ్లీ రైలు కదిలేదట. అలా వచ్చే వ్యక్తి బడోగని కొందరి నమ్మకం. ఎందుకొచ్చిన గొడవని ఆ సొరంగాన్ని మూసేశారు అధికారులు. కానీ, సొరంగానికి వేసిన తాళాలు వాటికవే ఊడిపోయాయి. కట్టిన గొలుసులు తెగిపోయాయి. బడోగ్ రైళ్లను స్వాగతిస్తున్నాడని మళ్లీ రాకపోకలు ప్రారంభించారు. ఇప్పటికీ ఆ సొరంగం నుంచి రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కొందరు మాత్రం టన్నెల్ 33లో కోటు, హ్యాటుతో ఉన్న బడోగ్ని చూశామని భయంగా చెప్పుకుంటూ ఉంటారు.
చేరుకునేదిలా: హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు వెళ్లి.. అక్కడి నుంచి కాల్కా రైలెక్కితే టన్నెల్ నం.33 గుండా ప్రయాణించవచ్చు.