 
                                                            పై అధికారి మెప్పు పొందాలని సగటు ఉద్యోగి కోరుకోవడం సహజం. అందుకోసం ఆఫీసర్ చెప్పిన ప్రతి పనికీ ‘ఎస్ బాస్’ అనేస్తుంటారు. కానీ, అలా అన్నిటికీ ‘ఎస్’ అనడం సబబు కాదని నిపుణుల మాట. అధికారి ప్రశంసల కోసం అన్ని పనులూ భుజానికెత్తుకోవడంతో కుటుంబంతో గడిపే విలువైన కాలం కరిగిపోతుందని చెబుతున్నారు. అలా కావొద్దంటే.. ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘నేను చేయలేను’ అంటే.. ఉద్యోగి సామర్థ్యంపై అనుమానం వస్తుంది. అలాకాకుండా ‘వేరే పని ఉంది’, ‘ఇప్పుడైతే కుదరకపోవచ్చు’ ఇలా చెప్పడం మీ నిర్ణయాన్ని సూచిస్తుంది.
‘ఇలా చెప్పడం నా వల్ల కాదంటే..’ అందరూ, అన్ని పనులూ మీ నెత్తినే రుద్దుతారు అని గుర్తుంచుకోండి. కాలక్రమంలో అది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పనిచేసే చోట మీ సామర్థ్యం మేరకు కష్టపడాల్సిందే! కానీ, మీరు ఏం చెప్పినా కాదనకుండా చేస్తారు అనే భావన బాస్‌లో పొడ చూపిందా.. అది మీ సామర్థ్యానికి గుర్తింపు కాదు, బలహీనతను క్యాష్ చేసుకునేందుకు దారి తీయవచ్చు. పరిస్థితి ఇంత వరకు రావొద్దంటే.. ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. ఆశయాలు సాధించాలంటే పట్టుదల ఉండటం మంచిదే! కానీ, అది పరిమితి దాటొద్దని గుర్తెరగండి.
 
                            