ఎండలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా దెబ్బతింటుంది. బయట అడుగుపెడితే చాలు.. చర్మం కందిపోయి నల్లగా మారుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ రాసుకున్నా.. అంతంత మాత్రమే ప్రభావం చూపుతుంది. అందుకే, ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే.. అందాన్ని ఎంచక్కా కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
టమాటాల్లో ‘లైకోపీన్’ అనే యాంటి ఆక్సిడెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఇది అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడటంలో ఆలుగడ్డలు ముందుంటాయి. వీటిలో ఉండే పిండి పదార్థాలు ఎండలకు చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. శరీరానికి కొత్త మెరుపును తీసుకొస్తాయి. కాబట్టి, ఈ కాలంలో ఆలుగడ్డ – టమాటాను మెనూలో భాగం చేసుకోండి. ఈ రెండిటికీ ఆలివ్ నూనెను జత చేస్తే.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
స్ట్రాబెర్రీ, దానిమ్మ, జామ వంటి పండ్లలో ఉండే పోషకాలు.. ఎండల్లో చర్మం నల్లగా మారకుండా కాపాడతాయి. దానిమ్మలో పుష్కలంగా దొరికే ఎలాజిక్ ఆమ్లం.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, జామ పండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ క్యాన్సర్, ఇతర సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇవేకాకుండా.. కివీ, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్లు కూడా చర్మానికి రక్షణగా నిలుస్తాయి.
టీ, కాఫీలు ఎక్కువగా తాగితే.. వేడి చేస్తుందని అంటారు. కాబట్టి, ఈ వేసవిలో గ్రీన్ టీకి షిఫ్ట్ అయిపోండి. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు సాయపడటంతోపాటు ఎండ నుంచీ తగిన రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో ఉండే ట్యానిక్ ఆమ్లం, ఇతర సమ్మేళనాలు.. ఎండ కారణంగా చర్మం కందిపోకుండా కాపాడతాయి. అంతేకాదు.. గ్రీన్ టీ తాగే వారిలో సన్‌బర్న్ సమస్య చాలా తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లోనూ తేలింది.