పెరటి తోటలకు వంటగది వ్యర్థాలను ఎరువుగా వాడటం తెలిసిందే! అందులోనూ వడగట్టిన ‘టీ పొడి’ని నిత్యం మొక్కలకు వేస్తుంటారు. మొక్కల ఎదుగుదలలో వాడేసిన చాయ్పత్తా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిర్వహణ సరిగ్గా లేకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
టీ పొడిలో నత్రజని, పొటాషియంతోపాటు మరికొన్ని సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఇవి మొక్కలు పెరగడానికి సాయపడతాయి. నేల సారాన్ని పెంచడంలో కీలకమైన వానపాములను కూడా టీ పొడి ఆకర్షిస్తుంది. ముఖ్యంగా, పెరట్లో ఎక్కువగా పెంచే గులాబీలు, మనీ ప్లాంట్, మల్లెజాతి మొక్కలు, ఫెర్న్ లాంటి మొక్కలకు ‘టీ పొడి’ చాలా ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, ఎక్కువ మొత్తంలో వేస్తే మొక్కలకు కీడు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. టీ పొడిలో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. చాయ్పత్తాను అలాగే మొక్కలకు వేయడం వల్ల కుండీల్లోని మట్టి పీహెచ్ సమతుల్యత తెబ్బతింటుంది.
అంతేకాకుండా పాలు, చక్కెర (టీ)తో కలిసిన టీ పొడి.. మొక్కల వేర్లకు హాని కలిగిస్తుంది కూడా. ఫంగస్, కీటకాలు, దోమల ఉధృతిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా, కాక్టస్, తులసి, కలబంద వంటి మొక్కలకు టీ పొడి వాడక పోవడమే మంచిది. అందుకే, మొక్కలకు వేయాలనుకునే టీ పొడిని ముందే బాగా కడగాలి. దీనివల్ల టీ పొడిలోని కెఫిన్తోపాటు పాలు, చక్కెర లాంటివి తొలగిపోతాయి. తర్వాత టీ పొడిని రెండుమూడు రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాతే మొక్కలకు వాడాలి. ఇక నిత్యం టీ పొడిని వేయడానికి బదులుగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి వేస్తే చాలు. అదికూడా తక్కువ మొత్తంలో వేయాలి. చిన్నచిన్న కుండీల్లో పెంచే మొక్కలకైతే.. 1-2 టీ స్పూన్ల టీ పొడి వేస్తే చాలు.