నిన్నటిదాకా ‘తెలుపు – నీలం’ యూనిఫామ్‌లో ‘పాఠశాల’కు వెళ్లిన పిల్లలు! పాఠాలకూ.. పంతుళ్లకూ భయపడ్డవాళ్లు! రేపోమాపో.. కొత్త బంగారులోకంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమ కలలను పండించుకోవడానికి.. ‘కాలేజీ క్యాంపస్’లో కాలు పెట్టబోతున్నారు. జీవితంలో స్థిరపడటానికీ, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ‘కాలేజీ క్యాంపస్’నే ఓ వేదికగా మార్చుకోబోతున్నారు. అయితే.. ఇలాంటి కీలక సమయంలో కొందరు విద్యార్థులు తప్పటడుగులు వేస్తుంటారు. అప్పటివరకూ సుపరిచితంగా ఉన్న చిన్న ప్రపంచం..
ఒక్కసారిగా విస్తరించడంతో భయంతో ముడుచుకుపోతారు. కానీ, ఇప్పుడు అప్రమత్తంగా లేకుంటే.. జీవితమే తల్లకిందులయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ‘కాలేజీ క్యాంపస్’లో అడుగు పెడుతున్న విద్యార్థుల కోసం కొన్ని సలహాలు – సూచనలు ఇస్తున్నారు.
మీ జీవితంలో అత్యుత్తమ సమయాన్ని కాలేజీ క్యాంపస్‌లో గడుపుతారు. ఇక్కడే జీవితాంతం తోడుగా ఉండే స్నేహితులు కలుస్తారు. ఎన్నో అత్యుత్తమ అనుభవాలు పొందుతారు. కాబట్టి, ఎలాంటి బెరుకు లేకుండా క్యాంపస్‌లో అడుగుపెట్టాలి.
ఇక క్యాంపస్ అంటే.. కేవలం మార్కులు, గ్రేడ్లు మాత్రమే కాదు. విజ్ఞానాన్ని పెంచుకునే ఓ భాండాగారం. ఇక్కడ మార్కుల వెంట పరుగులు పెట్టకుండా.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. సవాళ్లను స్వీకరించడం అలవాటుగా మార్చుకోవాలి. స్వీయ ఆవిష్కరణలకు రూపం ఇవ్వడం ద్వారా.. మీ జ్ఞానాన్ని మరింత విస్తృతం చేసుకోవాలి.
సరైన మద్దతు, ప్రోత్సాహం ఉంటే.. ఏదైనా సాధించవచ్చు. అందుకే, మీ క్యాంపస్‌లో మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, ప్రొఫెసర్లు, సంస్థలతో కలిసి ప్రయాణించాలి. మీదైన ఓ నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకోవాలి.
క్యాంపస్ నుంచి బయటికి వెళ్లేటప్పటికి మీ కాళ్లపై మీరు నిలబడేలా ఉండాలి. అందుకోసం మీ అభివృద్ధికి ఆలంబనగా నిలిచే అలవాట్లను అలవర్చుకోవాలి.
ఎలాంటి ప్రయాణంలోనైనా ఎదురుదెబ్బలు ఉంటాయి. ఏ మార్గం కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉండదు. తిరస్కరణలు, వైఫల్యాలు, ఊహించని మలుపులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ, అవే మిమ్మల్ని మరింత రాటుదేలుస్తాయి. ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకోవాలి.
చదువుతోపాటు మీ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. చదువే లోకంగా బతికేస్తే.. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు వాకింగ్, యోగా, డ్యాన్స్ లాంటివి తప్పనిసరి. ట్రెక్కింగ్, లాంగ్ డ్రైవ్స్లాంటివి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి.