ఏ ఇంటి వంటగదిలో చూసినా స్టీలు, అల్యూమినియం పాత్రలతోపాటు నాన్‌స్టిక్ పాత్రలు దర్శనమిస్తాయి. ఇక సంప్రదాయ మట్టిపాత్రలు వంటకోసం అంతగా వాడటం లేదనే చెప్పాలి. కొంతమంది మాత్రం ఆరోగ్య కారణాలతో మళ్లీ మట్టిపాత్రలకు మళ్లుతున్నారు. ఇటీవల భారతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) కూడా నాన్‌స్టిక్ కంటే సంప్రదాయ పాత్రలే వంటకు సురక్షితమని పేర్కొన్నది. ఈ దిశగా తాజాగా “భారతీయులకు ఆహార మార్గదర్శకాలు” జాబితా విడుదల చేసింది. ఇందులో మనం వంటకు ఉపయోగించదగ్గ పాత్రల స్వభావాన్ని ఎన్ఐఎన్ వివరించింది. వాటి వివరాలు…
కొత్త మార్గదర్శకాల్లో ఎన్ఐఎన్.. మట్టిపాత్రలను వంటకు వినియోగించడం వల్ల కలిగే మేలు, భద్రతలను గురించి వివరించింది. మట్టిపాత్రల్లో వండటం వల్ల వంట పర్యావరణ హితంగా సాగుతుంది. నూనె తక్కువగా అవసరం అవుతుంది. పైగా మట్టిపాత్రలకు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ.
నాన్‌స్టిక్ ప్యాన్ల వినియోగం గురించి, లోహాలు, స్టీలు, గ్రానైట్ పాత్రల గురించి కూడా ఎన్ఐఎన్ వివరాలను అందించింది. నాన్‌స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్లలో వంట ఏమేరకు మంచిదనే దాని గురించి చర్చ చాలా ఏండ్లుగా సాగుతున్నది. వీటిని వాడుతున్నప్పుడు ఉష్ణోగ్రత 170 డిగ్రీలకు మించకుండా చూసుకోవాలి. ఒకవేళ నాన్‌స్టిక్ పాత్రల కోటింగ్ చెరిగిపోతే వాటిని వాడకూడదు. వీటిని శుభ్రపర్చుకోవడం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అందువల్ల నాన్‌స్టిక్ కంటే సంప్రదాయ పాత్రలే వంటకు మంచివి.
మట్టిపాత్రలు మనదేశంలో మారుమూల ఊళ్లలో కూడా సరసమైన ధరలకే దొరుకుతాయి. అయినా, ఒకప్పుడు భారతీయులు చాలావరకు మట్టిపాత్రల్లోనే వంటలు చేసుకున్నారు. కాలమాన పరిస్థితుల్లో ఆ సంప్రదాయం కనుమరుగవుతూ వచ్చింది. కానీ, మట్టిపాత్రల్లో వండితే రుచికి రుచి… పోషకాల నష్టం కూడా ఉండదు. నూనె అవసరం తక్కువగా ఉంటుంది. ఇవి ఆల్కలిన్ (క్షార) గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలనూ వీటిలో వండుకోవచ్చు. పొరలుపొరలుగా ఉంటాయి కాబట్టి మట్టిపాత్రల్లో ఆహార పదార్థాలు చాలాసేపటి వరకు తాజాగా ఉంటాయి.
నాన్‌స్టిక్ ప్యాన్లతో పోలిస్తే గ్రానైట్ పాత్రలు చాలావరకు సురక్షితమైనవని ఎన్ఐఎన్ పేర్కొన్నది. అయితే, వీటిని కూడా టెఫ్లాన్ కోటింగ్ లేనివే ఎంచుకోవాలి.
చింతపండు, నిమ్మరసం లాంటి ఆమ్లగుణం కలిగిన ఆహార పదార్థాలను అల్యూమినియం, ఐరన్, అన్లైన్డ్ కంచు, రాగి పాత్రల్లో నిల్వ ఉంచడం అంత సురక్షితమైన విధానం కాదు.
స్టెయిన్లెస్ స్టీలు పాత్రల్లో వంట కూడా మంచిదేనట. వీటిని ఉపయోగించడం, శుభ్రపర్చడం కూడా ఎంతో సులువు.