ఆరోగ్య సంరక్షణలో చాలాదేశాలు ముందున్నప్పటికీ హెపటైటిస్ బి, సి.. ప్రజారోగ్యానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఏటా పది లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే.. శ్రామిక మహిళలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ఈ ‘సైలెంట్ ఇన్ఫెక్షన్లు’.. చాపకింద నీరులా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
హెపటైటిస్ బి, సి లక్షణాలతో అనారోగ్యానికి గురైనప్పుడు.. చాలామంది మామూలు అలసట, హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడిగా భావిస్తుంటారు. దాంతో వ్యాధి ముదిరి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సమయ పరిమితులు, బాధ్యతలు సర్వసాధారణం. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణపై అంతగా దృష్టిపెట్టడం లేదు. కొన్ని సంస్థలు వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకే ఎక్కువగా స్క్రీనింగ్ చేస్తున్నాయి. హెపటైటిస్ నిర్ధారణ పరీక్షలు అరుదుగానే జరుగుతున్నాయి. అంతేకాకుండా.. డయాగ్నోస్టిక్ కేంద్రాలు, క్లినిక్స్ వంటివి సాధారణ వ్యాపార సమయాల్లోనే నడుస్తాయి. దాంతో, ఉద్యోగ-ఉపాధి రంగాల్లో పనిచేసేవారికి స్క్రీనింగ్ చేయించుకోవడం వీలు కావట్లేదు. ఫలితంగా, రోగనిర్ధారణ పరీక్షలు తగ్గి.. వారి ప్రాణాల మీదికి వస్తున్నది.
ఈ సమస్యలకు ఆన్-సైట్ స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం కూడా సమస్యను మరింత జఠిలంగా మారుస్తున్నది. ఇక హెపటైటిస్పై సాధారణ ప్రజల్లో అనేక అనుమానాలు-అపోహలు ఉన్నాయి. మాదకద్రవ్యాల వాడకం, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్గా ఈ వ్యాధి ముద్రపడి పోయింది. దాంతో విద్యావంతులైన మహిళలు కూడా తరచుగా పరీక్షలు చేయించుకోవడానికి, రోగ నిర్ధారణ గురించి బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడుతున్నారట. తమను తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం, వృత్తిపరమైన వాతావరణాలు.. సకాలంలో చికిత్స చేయించుకోవడానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మారాలనీ, ఉద్యోగ-ఉపాధి రంగాల్లో ఉన్న మహిళలకు హెపటైటిస్పై సంపూర్ణ అవగాహన కల్పించాలని వారు సూచిస్తున్నారు.