శిల్పా శ్రీకుమార్.. సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. సాక్షాత్తు తన పెండ్లిలో.. నవవధువు అలంకరణలో మద్దెల వాయించి అందరినీ ఆకట్టుకున్నదీ అమ్మాయి. కేరళ సంప్రదాయ వాద్యమైన చెండ మద్దెల వాయిస్తూ శిల్ప ఆప్లోడ్ చేసిన వీడియో కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ అయిపోయింది. ఆ వాద్య విన్యాసం ఆమె చిరకాల వాంఛ. యాదృచ్ఛికంగా తన పెండ్లిలోనే ఆ కలను నిజం చేసుకున్నది. ‘ఇదంతా ముందుగానే ప్లాన్ చేశారా?’ అని అడిగితే.. ‘లేదు. లోలోపల మాత్రం మక్కువ ఉండేది. ఆ క్షణానికి మనసు చెప్పిన మాట విన్నానంతే’ అని సమాధాన మిచ్చింది.
‘పొన్నన్ బ్లూ మ్యాజిక్ టీమ్’ అనే మ్యూజికల్ ట్రూప్లో శిల్ప సభ్యురాలు. తమ బృంద సభ్యులను కూడా పెండ్లికి పిలిచింది. ఆమె ప్రతిభ తెలుసు కాబట్టి.. ఇన్స్ట్రుమెంట్ అందుకోమని ఒత్తిడి చేశారు. తప్పలేదు. శిల్ప చెండ మద్దెల భుజానికి వేసుకోగానే తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులంతా మంత్రమేసినట్టు చూస్తుండిపోయారు. ఆమె భర్త, నాన్న ఆనందంతో స్టెప్పులేశారు.
దుబాయ్లో పెరిగిన శిల్ప భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం నేర్చుకున్నది. చెండ మద్దెల మీద పట్టు సాధించాలనీ ఉండేది. తన కలను ఇలా నిజం చేసుకుంది. ప్రస్తుతం, దేశంలోని అతికొద్దిమంది చెండ మద్దెల మహిళా వాద్యకారులలో శిల్పా శ్రీకుమార్ ఒకరు.