నోస్టాల్జియా ఎప్పుడూ బాగుంటుంది. అప్పుడలా ఉండేది, అప్పట్లో ఇలా చేసేవాళ్లం అంటూ చెప్పుకొనే కబుర్లూ ఎంతో బాగుంటాయి. మరి ఫ్యాషన్కీ నోస్టాల్జియా గుర్తొచ్చిందేమో… పాతకాలం నాణేలతో నగలు రూపొందించి, మనతో అప్పటి జ్ఞాపకాలు కలబోసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఒక్క పైస, రెండు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, పావలా… ఇలా మన దగ్గర కొన్నేళ్ల క్రితం వరకూ రకరకాల నాణేలు చలామణిలో ఉండేవి. తర్వాత తర్వాత అవి కనుమరుగై పోయాయి. వాటిని ఈ కొత్త జువెలరీ ట్రెండు మళ్లీ తెరమీదికి తెస్తున్నది.
పైసా నుంచి పావలా దాకా రకరకాల నాణేలను పోగేసి వాటిని చెవిపోగులు, కమ్మలు, లాకెట్లు, గొలుసులుగా తీర్చిదిద్దుతున్నారు. పాత రూపాయి బిళ్లల్నీ ఇందులో చేరుస్తున్నారు. వీటిలో అచ్చంగా నాణేన్నే ఉంచి చేసేవి కొన్నయితే, దాని చుట్టూ నగలకుండే నగిషీలు అద్ది వస్తున్నవి మరికొన్ని. ఎలా పెట్టుకున్నా సరే, చూడగానే చటుక్కున పాతస్మృతుల్ని తట్టి లేపే ఇవి కొత్త క్రేజ్గా మారుతున్నాయి. మరి వీటితో మీరూ కనెక్ట్ అయ్యారా?!