చూచిరాత అనేది ఒకప్పుడు స్కూల్స్‌లో సర్వసాధారణ విషయం. రోజూ తెలుగు, ఇంగ్లిష్ అవసరమైతే హిందీ చూచిరాత పిల్లలకు హోమ్‌వర్క్‌లో భాగంగా ఉండేది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా, క్లాస్ అల్లరి చేసినా ప్రశ్నలకు జవాబులను పదిసార్లో, ఇరవైసార్లో చూసి రాయమనడం శిక్షగా ఉండేది. ఇది తెలియకుండానే పిల్లలను పాఠాలు నేర్చుకునేటట్లు చేసేది.
ఇప్పుడు పరిస్థితి మారింది. నోట్ పుస్తకాల స్థానంలో ఫోన్ నోట్స్, ట్యాబ్‌లు వచ్చేశాయి. పిల్లలు రోజూ కాపీ రైటింగ్
రాయడం అనేది తగ్గిపోయింది. దీని ప్రభావం పిల్లలు నేర్చుకోవడంపై పడుతున్నది.
పెద్దల మాట చద్దన్నం మూట అన్నట్లుగానే చేత్తో రాయడం అనేది నేర్చుకునే ప్రక్రియను పరిపుష్టం చేస్తుంది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ టెక్నాలజీతో అలవాటు పడిన ఈ రోజుల్లో చేతితో రాసే పద్ధతి పాతదిగా అనిపించవచ్చు. తరగతిలో నోట్స్ చేతితో రాసుకోవడం మంచిదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నపిల్లలకు చేతితో రాయడం నేర్పించడం చాలా అవసరం. ఇటీవల సైంటిస్టులు చేతితో రాయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవి ఇలా ఉన్నాయి.
గుర్తించడం సులభం..
ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం విద్యార్థులు చేతితో నోట్స్ రాసుకున్నప్పుడు వారి మెదడులోని మోటార్, విజువల్, సెన్సరీ, మెమొరీకి సంబంధించిన భాగాలు ఎక్కువ పని చేస్తున్నాయి. మన చేతి వేళ్లు అక్షరాలను రాసేటప్పుడు మెదడులోని వివిధ భాగాలు చురుకుగా పనిచేస్తాయి. దీంతో అక్షరాలను గుర్తించడం, వాటిని గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది.
బుర్రలో కసరత్తు..
కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు, మనం కేవలం లెక్చరర్ చెప్పింది వినకుండా టైప్ చేస్తాం. అప్పుడు మనం విన్న సమాచారాన్ని మెదడులో ప్రాసెస్ చేయడం తక్కువగా ఉంటుంది. చేతితో రాసేటప్పుడు ప్రతి పదాన్ని రాయడం కష్టం. దానివల్ల మనం ముఖ్యమైన పాయింట్లను మాత్రమే ఎంచుకొని వాటిని మనకు ఇప్పటికే తెలిసిన విషయాలతో పోల్చి రాసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనం కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతాం.
వేళ్ల కదలిక..
చేతితో రాసేటప్పుడు, మన వేళ్లు అక్షరాలను రాసేటప్పుడు, ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన కదలిక అవసరం. ఉదాహరణకు, ‘a’, ‘b’ అక్షరాలను రాసేటప్పుడు మన చేతి కదలికలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది అక్షరాలను వేరుగా గుర్తించడంలో మెదడుకు సహాయపడుతుంది. కీబోర్డులో టైప్ చేసేటప్పుడు, ప్రతి అక్షరానికి ఒకే రకమైన వేలి కదలిక ఉంటుంది, దీనివల్ల మన మెదడుకు ఎక్కువ కసరత్తు ఉండదు.
జ్ఞాపకశక్తికి ఊతం..
చేతితో రాసినప్పుడు మనం ఒక ఆలోచనను లేదా పదాన్ని భౌతికంగా సృష్టించగలం. ఒక పదాన్ని రాసేటప్పుడు, మనం దాని రూపాన్ని, దాని అక్షరాల కదలికను చేతితో అనుభవిస్తాం. ఇది మెదడులోని వివిధ భాగాలను అనుసంధానిస్తుంది, జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. విద్యార్థులు ఒక పదాన్ని చదువుతూ దానితో సంబంధం ఉన్న చర్యను చేస్తే, వారికి ఆ పదం సులభంగా గుర్తు ఉంటుంది.
మోటార్ స్కిల్స్ అభివృద్ధి..
పిల్లలు చేతితో రాస్తే మెదడులోని మోటార్ సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. ఇది చదవడం, రాయడం ఇతర నేర్చుకునే ప్రక్రియలకు చాలా అవసరం. డిజిటల్ ఉపకరణాల వాడకం ఎక్కువైన ఈ రోజుల్లో, పిల్లలకు పెన్సిల్ పట్టుకోవడం కూడా తెలియడం లేదు. ఇది వారి మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. చిన్నపిల్లలు బొమ్మలు గీయడం, పజిల్స్ చేయడం లాంటివి చేస్తే వారి మెదడు ఉత్తేజితం అవుతుంది.
డిజిటల్ తగదు..
డిజిటల్ పరికరాలతో ఉపయోగాలు ఉన్నా వాటిపై పూర్తిగా ఆధారపడితే మన మెదడు పనితీరు తగ్గుతుంది. మనం మెదడుకు పని ఇవ్వకుండా అన్ని పనులను ఫోన్లు, కంప్యూటర్లకు అప్పగిస్తున్నాం. ఫొటోలు తీయడం, జీపీఎస్ ఉపయోగించడం వల్ల మనం విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కాలక్రమేణా జ్ఞాపకశక్తిని, మోటార్ స్కిల్స్‌ను దెబ్బతీస్తుంది. చేతితో రాయడం నేర్చుకోవడం అనేది పిల్లల మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి చాలా ముఖ్యమైనది.
ఇప్పుడు అర్ధమైంది కదా.. చేత్తో రాయడం పిల్లలకు ఎంత ముఖ్యమో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. టీచర్లు, పేరెంట్స్ పాత చింతకాయ పచ్చడి అంటూ చేత్తో రాయడాన్ని తీసి పారేయకుండా, రోజూ వారితో కనీసం రెండు, మూడు పేజీలు అన్నా రాయిస్తే పిల్లల అభ్యసన సామర్థ్యం మెరుగుపడటం ఖాయం.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261