నిండు నూరేండ్ల మనిషి జీవితకాలం తగ్గుతూ వస్తున్నది. మన దేశంలో మనిషి సగటు ఆయుష్షు 67.7 సంవత్సరాలే! అదే జపాన్‌లో అయితే ఇది 85 వసంతాలు! అంతేకాదు, అక్కడ వందేండ్ల జీవితం అనుభవిస్తున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దీనికి కారణం, జపనీయులు ఆచరించే ‘ఇకిగాయ్’ జీవన విధానమే అని చెబుతున్నారు. ఈ జీవనశైలిని ఆచరిస్తే.. ఆయురారోగ్యాలు పెరుగుతాయని శాస్త్రవేత్తల ఉవాచ.
ఇకిగాయ్ అంటే ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉండటమే! జీవించడానికి ఒక కారణాన్ని వెతుక్కోవడం, అలాగే జీవితానికి ఒక అర్థాన్ని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. నవ్వుతూ ఉండటం, నచ్చినవారితో ఉండటం కూడా ఇకిగాయ్లో భాగమే. అప్పుడు ప్రతీ మనిషి తాను చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంటాడు. దానివల్ల జీవితంలో అసంతృప్తి దూరమై సంతోషంగా జీవించగలుగుతాడు.
ఎవరి ఇకిగాయ్ని వారే అన్వేషించుకోవాలి. వారివారి ఇష్టాలకు అనుగుణంగా దీన్ని ఎంచుకోవాలన్నమాట.
ఎవరి జీవితానికి వారే తమ ఇకిగాయ్‌ను వెతుక్కోవాలి. అయితే మొదట్లో అది కష్టంగా అనిపిస్తుండొచ్చు. ఉదాహరణకు అప్పటికే జీవితంలో బిజీగా ఉంటే, కొత్త ఇకిగాయ్‌ను అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చిన్నచిన్న బ్రేక్స్‌తో మొదలుపెట్టాలి. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ సమయాల్లో వ్యాపకాన్ని మొదలుపెట్టొచ్చు. తర్వాత సమయం పెంచుకుంటూ, ఆపైన దాన్నే ప్రవృత్తిగానో, వృత్తిగానో మార్చుకోవచ్చు.
ఇకిగాయ్ జీవన విధానాన్ని అలవర్చుకుంటే జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది. కారణం నచ్చిన పని చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ప్రకృతితో మమేకమవ్వడం, ఎప్పుడూ మనస్ఫూర్తిగా నవ్వడం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, నచ్చిన వాళ్లతో సమయం గడపడం, సమస్యలకు బెదరకుండా అర్థం చేసుకోవడం వంటివన్నీ ఇకిగాయ్ నేర్పిస్తుంది. అందువల్ల మనిషి సంతోషంగా ఉంటాడు. ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది. ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది.