వేసవి సెలవులు ముగిసాయి. బడులు మొదలయ్యాయి. ఉదయం పూట ఇళ్లలో సాధారణంగా కనిపించే దృశ్యం పిల్లలను స్కూలుకు రెడీ చేయడం. కొందరు పిల్లలకు ‘స్కూల్’ అనే మాట వింటేనే ఒళ్లు వణికిపోతుంది. ఏడుపులు, పెడబొబ్బలు, కడుపునొప్పి నెపాలు మొదలవుతాయి. దీనిని కేవలం ‘బద్ధకం’ లేదా ‘మొండితనం‘ అని కొట్టిపారేయలేం. సైకాలజీ లో దీనిని ‘స్కూల్ ఫోబియా’ లేదా ‘స్కూల్ రిఫ్యూజల్’ అంటారు. పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి తీవ్రమైన భయాందోళనలను ప్రదర్శించడమే ఈ సమస్య ముఖ్య లక్షణం.
స్కూల్ ఫోబియా అనేది వేర్వేరు పిల్లల్లో వేర్వేరు రూపాల్లో బయటపడుతుంది. రెండు ఉదాహరణలను గమనిద్దాం..
ప్రణీత్ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం నిద్ర లేవగానే ‘అమ్మా, నాకు కడుపు నొస్తుంది, తల తిరుగుతుంది‘ అని ఏడవడం మొదలుపెడతాడు. తీరా హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్ అంతా నార్మల్ అని చెప్తారు. స్కూల్ బస్సు రాగానే అమ్మను గట్టిగా పట్టుకుని, అస్సలు వదలకుండా ఏడుస్తాడు. అసలు కారణం ఏమిటంటే ఇక్కడ ప్రణీత్‌కు స్కూల్ అంటే భయం కంటే, అమ్మను వదిలి అంతసేపు దూరంగా ఉండాల్సి వస్తున్నదనే బెంగ. అమ్మకు ఏమైపోతుందో, లేదా తనే అమ్మకు దూరమైపోతాడేమో అన్న అభద్రతా భావం ఆ పిల్లవాణ్ని వెంటాడుతున్నది.
అంజలి ఐదో తరగతి దాకా బాగా చదివింది. ఆరో తరగతికి కొత్త స్కూల్లో చేరాక మెల్లగా స్కూల్ మానేయడం మొదలుపెట్టింది. వారం లో రెండు మూడు రోజులు ఏదో ఒక నెపంతో ఇంట్లోనే ఉండిపోతుంది. క్లాస్‌లో అందరి ముందు టీచర్ ప్రశ్నలు అడిగితే తను సమాధానం చెప్పలేనని, మిగతా పిల్లలు తనను చూసి నవ్వుతారని భయపడుతున్నది. అసలు కారణం ఏమిటంటే కొత్త వాతావరణం, క్లాస్‌రూమ్‌లో పర్ఫార్మెన్స్ ప్రెజర్, తోటి పిల్లల ఎగతాళి వల్ల అంజలిలో సామాజిక ఆందోళన పెరిగిపోయింది. స్కూల్ వాతావరణం తనకు సురక్షితం కాదనే భావన మనసులో నాటుకుపోయింది.
ప్రణీత్, అంజలి లాగా స్కూల్ అంటే భయపడే పిల్లలు రకరకాల స్పందనలు చూపిస్తారు, ఆ భయానికి కారణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మానసిక, కారణాలు, కొన్ని సామాజిక కారణాలు ఉంటాయి.
కుటుంబ వాతావరణం : ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, కొత్తగా వేరే ఊరు మారడం, లేదా ఇంట్లో కొత్త పాప/బాబు పుట్టడం వల్ల తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భయం.
పాఠశాలలో ప్రతికూల అనుభవాలు: కఠినమైన ఉపాధ్యాయుల శిక్షలు, హోమ్‌వర్క్ ఒత్తిడి, తోటి పిల్లల వేధింపులు.
అభ్యసన సమస్యలు: డిస్లెక్సియా లాంటి సమస్యల వల్ల చదవడం, రాయడంలో వెనుకబడిపోవడం, దానివల్ల క్లాస్‌రూమ్‌లో అవమానానికి గురవుతామనే భయం.
పిల్లలు స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తున్నప్పుడు పేరెంట్స్ కొట్టడమో, తిట్టడమో చేయకూడదు. ఆ ప్రవర్తన వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పేరెంట్స్ చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే పిల్లల్లో స్కూల్ భయం పోగొట్టొచ్చు.
పిల్లవాడు స్కూలుకు వెళ్లనని ఏడుస్తున్నప్పుడు ‘దానికి అంత భయమెందుకు?‘, ‘నువ్వు మొండివాడివి’ అని కొట్టిపారేయకండి.
ఏం చేయాలి: ‘నువ్వు స్కూలుకు వెళ్లడానికి భయపడుతున్నావని నాకు అర్థమవుతున్నది. కానీ మనం దాన్ని అధిగమించగలం. నేను నీకు తోడుగా ఉంటాను’ అని ధైర్యం చెప్పండి. భయం సహజమని వారు గుర్తిస్తేనే దాన్ని దాటడానికి సిద్ధపడతారు.
స్కూల్ లేని రోజుల్లో కూడా ఉదయం లేవడం, రాత్రి పడుకునే సమయాలు ఒకేలా ఉండేలా ప్లాన్ చేయండి.
ఏం చేయాలి: ఉదయం పూట ఇంట్లో హడావిడి, అరవడం లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంచండి. స్కూల్ బ్యాగ్, దుస్తులు రాత్రే సర్ది పెట్టుకోవడం వల్ల ఉదయం ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
భయం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి రోజంతా స్కూల్లో వదిలేయడం వల్ల మానసిక షాక్ కలగవచ్చు. దానికి బదులుగా మెల్లమెల్లగా అలవాటు చేయండి.
ఏం చేయాలి: మొదటి రోజు కేవలం స్కూల్ గేట్ వరకు తీసుకెళ్లి తీసుకురావడం. మరుసటి రోజు ఒక గంట సేపు మాత్రమే క్లాస్‌లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత లంచ్ టైమ్ వరకు ఉంచడం. ఇలా క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లండి.
పిల్లవాడు ఏడ్చి ఇంట్లోనే ఉండిపోయినప్పుడు, ఆ సమయంలో ఇంట్లో టీవీ చూడటం, మొబైల్ గేమ్స్ ఆడటం లేదా ఇష్టమైన వంటలు చేసి పెట్టడం వంటివి చేయకూడదు.
ఏం చేయాలి: స్కూల్ సమయంలో ఇల్లు సాదాసీదాగా, బోరింగ్‌గా ఉండాలి. ‘నువ్వు స్కూల్‌కు వెళ్లకపోయినా ఇంట్లో ఆటలు ఉండవు, చదువుకోవాల్సిందే’ అనే స్పష్టత ఇవ్వాలి. అప్పుడు పిల్లలు ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చని భావిస్తారు.
స్కూల్ బస్సు దగ్గర, గేట్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళనపడుతూ, ఎక్కువసేపు అక్కడే ఉండిపోవడం వల్ల పిల్లల భయం మరింత పెరుగుతుంది.
ఏం చేయాలి: ‘నేను సాయంత్రం 4 గంటలకు నిన్ను పిక్-అప్ చేసుకోవడానికి వస్తాను. బై, హావ్ ఎ గుడ్ డే!’ అని నవ్వుతూ, నిశ్చయంగా చెప్పి వచ్చేయాలి. మీరు ఎంత ధీమాగా ఉంటే, పిల్లవాడు అంత సురక్షితంగా భావిస్తాడు.
స్కూల్ ముగిసిన తర్వాత పిల్లవాడు ఇంటికి రాగానే… ‘ఈరోజు స్కూల్లో నీకు బాగా నచ్చిన ఒక్క మంచి విషయం ఏంటి?’ అని అడగండి. ఇది వారి మెదడులో స్కూల్ పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను మార్చి, సానుకూల అంశాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది.
పిల్లల్లో స్కూల్ ఫోబియా అనేది తాత్కాలిక మానసిక స్థితి మాత్రమే. దీనిని మొండితనంగా భావించి శిక్షిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక టీమ్‌గా పనిచేసి, అవసరమైతే స్కూల్ కౌన్సెలర్, చైల్డ్ సైకాలజిస్ట్ సహాయం తీసుకుంటే పిల్లలు మళ్లీ ఎంతో ఉత్సాహంగా స్కూలుకు వెళతారు.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261