ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాం అన్నదానితో సంబంధం లేకుండా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే ఒకే ఒక్క సోపానం విద్య. అది ఉంటే చాలు మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది, బతుకు మీద భరోసా లభిస్తుంది. ముఖ్యంగా తీవ్ర లింగవివక్షకు గురవుతున్న ఆడపిల్లల జీవితాల్లో ఇది ఎనలేని మార్పును తెస్తుంది. ఈ విషయాన్ని మనసారా నమ్మిన మనిషి దిల్లీకి చెందిన సఫీనా హుస్సేన్. ‘ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీవో’ను స్థాపించి దాని ద్వారా భారత్‌లోని 20 లక్షల మందికిపైగా ఆడపిల్లలకు విద్యాసేవ చేశారు. అందుకుగాను ప్రఖ్యాత రామన్‌మెగసెసే పురస్కారం లభించిందా సంస్థకు. ఈ సందర్భంలో ఎన్జీవోతో పాటు, దాని వెనకున్న వ్యక్తుల గురించి కొన్ని విలువైన విశేషాలు..
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించగలదన్న మాట ఎంత నిజమో, ఒక విద్యావంతుడు మరో విద్యావంతుడ్ని తీర్చిదిద్దగలడన్న మాటా అంతే సత్యం. అందుకే తాను శ్రమించి సంపాదించుకున్న చదువును పది మందికీ చేరువ చేసేందుకు పోరాటం చేయాలని నిశ్చయించుకుంది సఫీనా హుస్సేన్. దిల్లీలోని ఒక ఇరుకింట్లో నివసించేదామె కుటుంబం. ప్లస్‌టూ చదువు అయిపోయాక పెండ్లి చేద్దాం అని అనుకున్నారు ఇంట్లో వాళ్లు. మూడు సంవత్సరాల పాటు ఆమె చదువుకు దూరం అయింది కూడా. కానీ, అదే సమయంలో బంధువు ఒకామె తనను చేరదీసింది.
చదువు మీద ఎంతో మక్కువ ఉన్న సఫీనా ఆమె దన్నుతో ఏకంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రఖ్యాత విద్యాసంస్థ నుంచి పట్టా పుచ్చుకోవడంతో కార్పొరేట్ ఉద్యోగాలు వరుస కట్టాయి. కానీ, ఆమె మనసు అక్కడ స్థిమితంగా లేదు. భారత్‌కి తిరిగి వచ్చి తనలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆడపిల్లల చదువుకు అండగా ఉండాలని 2007లో ఎడ్యుకేట్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది.
ఆడపిల్లల చదువును ప్రోత్సహించేలా స్వచ్ఛంద సంస్థ స్థాపించాలనుకున్నప్పుడు దేశంలోని ఏయే రాష్ర్టాల్లో అత్యధికంగా బడి మానేస్తున్న పిల్లలు ఉన్నారన్న సర్వే చేశారు సఫీనా. దాని ఆధారంగా రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో తన అవసరం ఎక్కువగా ఉందని గ్రహించి అక్కడి గ్రామాల్లో పనిచేయడం ప్రారంభించారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని 30,000 గ్రామాల్లో ఈ సంస్థ సేవలందిస్తున్నది. ప్రతి ఊరు లేదా ప్రాంతంలో ‘టీమ్ బాలిక’ పేరుతో వలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్లు ప్రభుత్వం, ఇతర స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రతి ఇంటిలోనూ బడి ఈడు పిల్లల్ని గుర్తించి వాళ్ల ఇండ్లకు వెళ్లి మాట్లాడతారు.
కుటుంబ సభ్యుల్లో స్ఫూర్తి నింపి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసి తిరిగి బడిలో చేరేలా కృషి చేస్తారు. సంస్థకు ఇలాంటి 23 వేల టీమ్‌లు ఉన్నాయి. ఇప్పటి దాకా 20 లక్షల మందికి పైగా ఆడ పిల్లలు వీళ్ల ద్వారా బడిబాట పట్టారు. మధ్యలో చదువు ఆపేసిన పెద్ద వాళ్లతోనూ పది పరీక్షలు రాయించి, వృత్తి విద్యా కోర్సుల్లో చేర్పించి, చిన్న స్థాయి ఉద్యోగాలు వచ్చేలానూ చూస్తారు.
ఇలా దాదాపు 24 లక్షల మందికి సాయం చేసింది ఎడ్యుకేట్ గర్ల్. ‘చదువు ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్లో అత్యుత్తమ మార్పుల్ని తెచ్చిందనీ, ఇలా తమ ద్వారా తిరిగి పుస్తకం పట్టుకునే వారి సంఖ్య కోటి దాటాలన్నదే లక్ష్యమనీ, తమ కృషికి మెగసెసే పురస్కారం లభించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చిందనీ’ అంటున్నారు సఫీనా. ఆసియా నోబెల్‌గా పిలిచే రామన్ మెగసెసే అవార్డును అందుకోవడం అంటే మాటలేం కాదు కదా మరి!