కాస్మటిక్స్ శరీరానికి అందాన్ని మాత్రమే ఎందుకివ్వాలి? మనసుకు ఆహ్లాదాన్నీ పంచితే ఎంత బావుంటుంది? – కాస్మటాలజీని న్యూరాలజీతో జోడించడం ద్వారా ఇదంతా సాధ్యమేనని గుర్తించారు ‘జస్ట్ హ్యూమన్’ వ్యవస్థాపకురాలు రోష్నీ జైస్వాల్. మన చర్మం ఓ అత్యద్భుత నిర్మాణం. మంచి స్పర్శకు పులకిస్తుంది. చెడు స్పర్శకు ఇబ్బంది పడుతుంది. తన సంతోషాన్నీ, నిరసననూ మెదడుకు చేరవేస్తుంది. చర్మానికి, మెదడుకు మధ్య ఉన్న ఆ బంధాన్ని ‘జస్ట్ హ్యూమన్’ అర్థం చేసుకుంది. మెదడును సానుకూలంగా ప్రభావితం చేసే పదార్థాలను ఎంచుకుంటే కాస్మటిక్స్‌కు మరింత శక్తి వస్తుందంటారు రోష్నీ. ఇదంతా జరగాలంటే.. మెదడు నుంచి చర్మానికి, చర్మం నుంచి మెదడుకు సంకేతాలను మోసుకెళ్లే న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును అధ్యయనం చేయాలి.
ఆ ప్రయత్నంలో జస్ట్ హ్యూమన్ ఇప్పటికే చాలా అడుగులు వేసింది. తాము తయారుచేసే కాస్మటిక్స్.. రంగు, వాసన, సున్నితత్వం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ ప్రయోగాల వెనుక ఓ చేదు అనుభవమూ ఉంది. ఓ దశలో రోష్నీ జైస్వాల్ ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడ్డారు. ఆ సమయంలో ఎలాంటి సౌందర్య సాధనాలు వాడాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే ‘జస్ట్ హ్యూమన్’ ఆలోచన వచ్చింది. తను పారిశ్రామికవేత్తల కుటుంబంలో పుట్టింది. వారసత్వంగా వచ్చిన జగ్జీత్ ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నది.