Japan | అత్యాధునిక సాంకేతికతకు అనాది సాంప్రదాయాలకు జపాన్ నిలయం. అయితే, ఈ ద్వీపదేశంలోని వివాహిత మహిళలు.. తమ భర్తలపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశామని భావిస్తున్నారట. ఇటీవలి ఓ సర్వే.. ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వివాహబంధం వెనకుండే భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. ఒక్క జపాన్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తాన్నీ ఆలోచనలో పడేసింది.
జపనీస్ వివాహ సంబంధాల సంస్థ ‘ప్రెసియా’ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా.. 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల 287 మంది వివాహిత మహిళల్ని ఎంచుకున్నది. వారందరికీ సరళంగానే కనిపించే ఓ భారీ ప్రశ్న వేసింది. ‘మీరు మీ భర్తను వివాహం చేసుకున్నందుకు చింతిస్తున్నారా?’ అన్నదే ఆ ప్రశ్న. అయితే, ఆశ్చర్యకరంగా వారిలో 70 శాతం మంది ‘అవును’ అని చెప్పారు. తాము పెళ్లి చేసుకున్నందుకు ఏదో ఒక సందర్భంలో బాధపడ్డామని వెల్లడించారు. ఒకవేళ కాలం వెనక్కి తిరిగితే, తమ ప్రస్తుత భర్తను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోబోమని 54 శాతం మంది స్పష్టం చేశారు. ఈ సర్వే ఫలితం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయానికి అధిక ప్రాధాన్యమిచ్చే జపాన్‌లాంటి దేశంలో వివాహబంధంపై ఈ స్థాయిలో అసంతృప్తి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా, వివాహ బంధంలో ఉన్న జపనీస్ మహిళల మనోభావాలను విశ్లేషించింది.
ఇక జపాన్ మహిళలు ఇలా పశ్చాత్తాపం చెందడానికి గల కారణాలనూ సర్వే ప్రతినిధులు కనుగొన్నారు. అందుకు ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని 37.2 శాతం మంది వెల్లడించారు. 22.6 శాతం మంది.. తాము కోరుకున్న దానికంటే తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మరో 14.6 శాతం మంది తమ భర్తలకు సరైన ఆర్థిక అవగాహన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటిపనిలో సహాయం చేయకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు 11.11 శాతం మంది చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరంగా.. 36.6% మంది మహిళలు తమ భర్త శారీరక రూపం విషయంలో రాజీపడటానికి పెద్దగా బాధపడటం లేదని అన్నారట. అంటే, అందం కంటే ఆర్థిక స్థిరత్వమే ముఖ్యమని వారు భావిస్తున్నారని సర్వే ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. జపాన్‌లో పెరుగుతున్న ధరలు, పిల్లల పెంపకం ఖర్చుల దృష్ట్యా.. మహిళలు ‘ప్రేమ’ కంటే ‘ఆర్థిక భద్రత’కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.