సేవా భావనతో ప్రారంభమైన బుడిబుడి అడుగుల ప్రయాణం సమాజంలో విశాలమైన మార్పులకు దారి తీస్తే అది నిజమైన అభివృద్ధి ప్రయాణంగా నిలుస్తుంది. సేవా భావంతో రామ్ కీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రయాణం అందుకు ప్రతీకగా నిలిచింది. అవసరం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, సామాజిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను అమలు చేసేలక్ష్యాలతో ప్రారంభమైన ఈ సంస్థ, కాలక్రమేణా విస్తరించి దేశవ్యాప్తంగా సేవల పరిధిని విస్తరించుకుంది. 20 ఏండ్లుగా కొనసాగుతున్న రామ్ కీ ఫౌండేషన్ సేవా ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి.
2006లో రామకీ గ్రూప్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భావనతో ఈ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించి, అక్కడి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేశారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో తక్షణ అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. సీఎస్ఆర్ చట్టం అమల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలను ప్రారంభించడం ఈ సంస్థ ప్రత్యేకతగా నిలిచింది.
ప్రారంభంలో చిన్నచిన్న సేవా కార్యక్రమాలతో మొదలైన ఈ ప్రయాణం, క్రమంగా విస్తరించి ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం 20 రాష్ర్టాల్లో 350 మందికి పైగా సిబ్బందితో 40కి పైగా ప్రాజెక్టులను అమలు చేస్తూ సుమారు 55 లక్షల మందికి సేవలు అందిస్తున్నది.
గిరిజనాభివృద్ధి రంగంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో 500 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి చేపట్టి వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. సంప్రదాయ వ్యవసాయం నుంచి ఆదాయ వనరులను విస్తరించే దిశగా ఈ కార్యక్రమాలు ప్రభావవంతంగా మారాయి. ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడంలో ‘సంచార్ వైద్యశాలలు’ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని దూర ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్లు చేరుకుని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. రోజువారీగా వందలాది మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
సంస్థ సేవలను విస్తరించడంలో భాగస్వామ్య వ్యవస్థ కీలకంగా మారింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలూ జత కలవడంతో సేవల పరిధి పెరిగింది. ఈ భాగస్వామ్యంతో మొబైల్ వైద్య యూనిట్ల సంఖ్య పెరిగి మరింత దూర ప్రాంతాలకు చేరుకోవడం సాధ్యమైంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ భాగస్వామ్యాలు కలిసొచ్చినప్పుడు సామాజిక సేవలు మరింత ప్రభావవంతంగా మారుతాయని ఈ మాడల్ చూపిస్తున్నది.
మహిళా సాధికారత దిశగా కూడా ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తున్నది. మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నది. మత్స్యకార కుటుంబాలకు సహాయం అందించడం, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను కల్పించడం లాంటి చర్యలు మహిళల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకువచ్చాయి. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ఫౌండేషన్ ముందుకు సాగుతున్నది. వివిధ ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వేలాది యువతకు శిక్షణ అందిస్తున్నది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సహజ వనరులను కాపాడే దిశగా కూడా రామ్కీ సంస్థ కృషి చేస్తున్నది. భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా సేవలను మరింత విస్తరించేందుకు ఫౌండేషన్ ముందుకు సాగుతున్నది. మరిన్ని మొబైల్ వైద్య యూనిట్లను ఏర్పాటు చేసి కనీసం 15 రాష్ర్టాల్లో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సేవల పరిధి పెరగడమే కాకుండా వాటి నాణ్యతను మెరుగుపరచడంపైనా దృష్టి నిలిపింది.
సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం, అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడం, భాగస్వామ్య సంస్థలతో ముందుకు సాగడం అనే మూడు మూలాధారాలపై రామ్ కీ ఫౌండేషన్ తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. రెండు దశాబ్దాల ఈ సేవా యాత్రను పురస్కరించుకుని 20వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకొన్నది. భవిష్యత్‌లో మరింత విస్తరించి మరిన్ని జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది రామ్ కీ ఫౌండేషన్.
స్థిరమైన మార్పే లక్ష్యం
మేం చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ మహిళల పునరావాసం మా కార్యక్రమాల్లో కీలక భాగం. వారికి ఆరోగ్య సేవలతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థిరమైన జీవనోపాధి దిశగా తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాల అమలులో 75 మంది ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడి జీవితంలో స్థిరమైన మార్పు తీసుకురావడమే మా లక్ష్యం.
– ఎం.వి. రామిరెడ్డి, ప్రెసిడెంట్, రామ్ కీ ఫౌండేషన్
– రెండు దశాబ్దాల సామాజిక స్పర్శ