కొందరు పిల్లలు.. చాలా సులభంగా అబద్ధం చెప్పేస్తుంటారు. తప్పు చేసినప్పుడో, తల్లిదండ్రులను సంతోషపెట్టడానికో.. కట్టుకథలు అల్లుతుంటారు. పెరుగుతున్న కొద్దీ ‘అది తప్పు!’ అని తెలుసుకొని మానేస్తారు. కొందరు మాత్రం.. పెద్దయ్యాక కూడా కొనసాగిస్తుంటారు. ‘అబద్ధాల కోరు!’గా ముద్రవేసుకుంటారు. అలా కావొద్దంటే.. బాల్యంలోనే అసత్యాల కొమ్మను వంచేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చెబితే ఫర్వాలేదు. కానీ, అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం.. పిల్లలు నిజాయతీగా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలి. వారు ఎప్పుడూ నిజం చెప్పేలా ప్రోత్సహించాలి. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలి. నిజం చెప్పినా.. ఎలాంటి సమస్యా ఉండదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే.. పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ఉండగలుగుతారు.
ఏదైనా పొరపాటు చేసినప్పుడు.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా అబద్ధం చెబుతుంటారు. డెవలప్మెంట్ సైకాలజీలో 2002లో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. తప్పు చేసినప్పుడు నిజాయతీగా ఉంటే.. ఫలితం ప్రతికూలంగా ఉంటుందని వారి నమ్మకం. అందుకే, అబద్ధాన్ని ఒక వ్యూహంగా మలుచుకుంటారు.
ఇక చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రశంసలు పొందడానికి కూడా పిల్లలు అబద్ధాలు ఆడుతుంటారట. 2016లో జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ చైల్డ్ సైకాలజీ జరిపిన ఓ పరిశోధన ఈ విషయాన్ని తేల్చింది. తాము అన్నిట్లో బెస్ట్ అనిపించుకోవడానికి, సామాజిక అంచనాలను అందుకోవడానికి పిల్లలు అబద్ధాలు చెబుతారని వెల్లడైంది.
పిల్లలు పెరిగేకొద్దీ.. స్వయంప్రతిపత్తిని కోరుకుంటారు. ఈ క్రమంలోనూ అబద్ధం చెబుతారు. ముఖ్యంగా, టీనేజర్లు ఎక్కడికి వెళ్తున్నదనీ, ఏం చేస్తున్నదీ తల్లిదండ్రుల దగ్గర దాచి పెడుతుంటారు. జర్నల్ ఆఫ్ అడోలెసెన్స్లో 2010లో ప్రచురితమైన సర్వే.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టింది. అయితే, టీనేజర్లు ఇలా సమాచారాన్ని దాచిపెట్టడం వెనక దురుద్దేశం ఉండదు. కేవలం వారి గోప్యత, స్వాతంత్య్ర భావాన్ని కాపాడుకోవడానికే అని సదరు సర్వే తేల్చింది.