దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. కలిసి నిద్రించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనేక కారణాల వల్ల ఇప్పుడు భార్యాభర్తలు విడివిడిగా పడుకుంటున్నారు. భర్త గురక పెడుతున్నాడని కొందరు.. భార్య అతిగా ఫోన్ వాడుతున్నదని మరికొందరు, దుప్పటిని పంచుకోవడం ఇష్టంలేక.. ఇష్టం లేకుండా హత్తుకోవడం నచ్చక.. ఇలా వివిధ కారణాలు చెబుతూ ‘స్లీప్ డైవర్స్’ తీసుకుంటున్నారు. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. రెస్‌మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వే – 2025 ప్రకారం.. స్లీప్ డైవర్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది.
మనదేశంలో 78 శాతం జంటలు ఎవరికి వారే పడుకుంటున్నారని తేలింది. ఆ తర్వాత స్థానం చైనా ఆక్రమించగా.. అక్కడ 67 శాతం జంటలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. దక్షిణ కొరియాలోనూ 65 శాతం జంటలు విడివిడిగా నిద్రిస్తున్నాయి. మొత్తం 30,000 మందితో సర్వే నిర్వహించి.. ‘స్లీప్ డైవర్స్’కు కారణాలను కనుగొన్నారు. వీరిలో 32 శాతం మంది.. భాగస్వామి గురక, బిగ్గరగా శ్వాస తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతున్నదని వెల్లడించారు.
ఇక విశ్రాంతి కోసమని 12 శాతం చెప్పగా, 10 శాతం నిద్ర సరిపోవడం లేదని చెప్పుకొచ్చారు. బెడ్‌పై భాగస్వామి ఫోన్ వాడకం వల్ల విడిగా పడుకుంటున్నామని మరో 8 శాతం మంది తెలిపారు. అయితే, ఇలా జంటలు విడివిడిగా నిద్రిస్తున్నంత మాత్రాన వారి మధ్య సమస్య ఉన్నట్టు కాదని సర్వే ప్రతినిధులు అంటున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే స్లీప్ డైవర్స్ తీసుకోవడమే మంచిదని కొందరు చెబుతుండగా.. దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. కలిసి పడుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.