మాకొక అబ్బాయి. పందొమ్మిదేండ్లు. ఓసారి అనుకోకుండా తన సెల్ఫోన్ చూడాల్సి వచ్చింది. వాట్సాప్ చాట్స్ చదువుతుంటేనే భయమేసింది. అమ్మాయిలతో సెక్స్ సంభాషణలు చేస్తున్నాడు. మద్యం అలవాటూ ఉన్నట్టు అనుమానం. తరచూ అబద్ధాలు ఆడతాడు. చదువుల్లో మాత్రం చాలా చురుకు. డిస్టింక్షన్ తెచ్చుకుంటాడు. స్నేహితులతో బాగానే ఉంటాడు. మా ఇద్దరి మాటలనూ గౌరవిస్తాడు. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని నా అనుమానం? చికిత్స అవసరం అంటారా?
టీనేజ్ అంటేనే అర్థంకాని పజిల్. నిన్నమొన్నటి వరకు మనసునిండా పసితనం నింపుకొన్న బాలబాలికల ఆలోచనలు.. కౌమారంలో కాలుపెట్టగానే ఒక్కసారిగా మారిపోతాయి. కొన్నిసార్లు తమను తాము పిల్లలమని అనుకుంటారు. కొన్నిసార్లు అచ్చం పెద్దల్లా ప్రవర్తిస్తారు. మీ అబ్బాయిలో అసాధారణ లక్షణాలేవీ కనిపించడం లేదు. ఆధునిక సమాజంలో నైతికతకు అర్థాలు మారిపోయాయి. ఎవరినీ బెదిరించనంత కాలం, బ్లాక్ మెయిల్ చేయనంత కాలం.. తమకు నచ్చిన విషయాల్ని, నచ్చిన భాషలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని నవతరం భావిస్తున్నది.
ఇక మద్యపానం అంటారా? సోషల్ డ్రింకింగ్ను సమాజం మెల్లమెల్లగా ఆమోదిస్తున్నది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే.. బాబును కూర్చోబెట్టుకుని మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి చర్చించండి. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను వివరించండి. అంతేకానీ, తీవ్రంగా కోపగించుకోవడం, హెచ్చరించడం మంచి పద్ధతులు కాదు. దీనివల్ల తిరుగుబాటు తత్వం మొదలవుతుంది. ఏం చెప్పినా పరోక్షంగానే. చివరగా ఒక్క మాట. మీరు పెరిగిన వాతావరణం వేరు. మీ పిల్లలు పెద్దయిన వాతావరణం వేరు. వాళ్లు మీలా ఉండాలనుకోవడం అత్యాశ, అసాధ్యం కూడా.