ఇటీవలి కాలంలో రిలేషన్షిప్లో ఉంటూ.. భాగస్వామిని మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ధోరణి బాధితులపై మానసికంగా, సామాజికంగానూ తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకుంటే.. మోసం చేయడానికి వెనకాడతారని తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. అందుకే, చీటింగ్ చేయాలని అనుకునేవారు ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించాలని ఈ పరిశోధన చెబుతున్నది. ఇజ్రాయెల్‌లోని రైచ్మన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది.
సంబంధాలలో విశ్వసనీయతను ఎలా కాపాడుకోవాలో శాస్త్రీయంగా వివరించింది. ‘పర్స్పెక్టివ్ టేకింగ్’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంటే.. అవతలి వ్యక్తి కోణంలో ఆలోచించడం అన్నమాట. పరిశోధనలో భాగంగా 20 నుంచి 47 ఏళ్ల వయసున్న 408 మందిని ఎంపిక చేశారు. ఇందులో 213 మంది మహిళలు, 195 మంది పురుషులు ఉన్నారు.
అపరిచితురాలిని పరిచయం చేశారు. ఆ సమయంలో వారు తమ భాగస్వామి కోణం నుంచి ఆలోచించేలా ప్రేరేపించారు. ఎవరైతే తమ భాగస్వామి భావాలను, వారి బాధను అర్థం చేసుకునేలా ఆలోచించారో.. వారిలో ఇతర వ్యక్తులపై ఆకర్షణ, తనవారిని మోసం చేయాలనే కోరిక గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. భాగస్వామి కోణం నుంచి ఆలోచించినప్పుడు మనసులో కొన్నిమార్పులు వస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. అవతలి వ్యక్తిలా ఆలోచించినప్పుడు, వారు మనకు ఎంత ముఖ్యమో గుర్తించడం సులభం అవుతుంది. ఇక ‘నేను ఇలా చేస్తే నా భాగస్వామి ఎంతలా కుంగిపోతారు?’ అనే ఆలోచన రావడం వల్ల వెనక్కి అడుగు వేస్తారు.
అంతేకాకుండా, కొత్త వ్యక్తుల పట్ల కలిగే తాత్కాలిక ఆకర్షణను ఎదుర్కోవడానికి ఈ ‘ఎంపతీ’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల ప్రస్తుత సంబంధంపై కమిట్మెంట్ మరింతగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తానికి ‘నేను మోసం చేయకూడదు’ అని నియంత్రించుకోవడం కంటే.. ‘నా వల్ల నా భాగస్వామికి కలిగే బాధ ఏమిటి?’ అని ఆలోచించడం వల్ల సంబంధాలు మరింత బలంగా ఉంటాయని ఈ అధ్యయనం నిరూపించింది.