పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్’ తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల కోసం సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. ఫలితంగా, పిల్లల పెంపకంపై పట్టు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించాల్సిన అవసరం ఉన్నది.
‘దేవుడా.. కూతుర్ని ఇవ్వమంటే, క్వొశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రీ?’.. అతడు సినిమాలో డైలాగ్ ఇది. నవతరం నైంటీస్ తల్లిదండ్రుల నోటినుంచి ప్రతినిత్యం వినిపిస్తూనే ఉన్నది. పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక.. వారిని కసురుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా, రెండు నుంచి ఆరేళ్ల పిల్లలు తమచుట్టూ ఉన్న ప్రతిదాన్నీ సునిశితంగా పరిశీలిస్తుంటారు. చూసిన ప్రతి ఒక్కదాని గురించీ తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు. వారిలో ఉండే ఆలోచనా పద్ధతిని ‘మ్యాజికల్ థింకింగ్’గా వ్యవహరిస్తారు. దాని ప్రభావంతోనే.. పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటారు. వాటికి ఓపికగా సమాధానం చెప్పాలి. అప్పుడే.. వారి ఆలోచనా పరిధి మరింత విస్తృతం అవుతుంది.
కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన నైంటీస్ కిడ్స్.. తమ పిల్లలనూ అదేబాటలో నడిపిస్తున్నారు. ట్యాబ్ కొనివ్వడం.. యూట్యూబ్ ఆన్ చేసి ఇవ్వడం! పాటలు.. పాఠాలూ అన్నీ అందులోనే! ఇలా పిల్లల్ని గ్యాడ్జెట్లకు అలవాటు చేయడం.. వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. డిజిటల్ పరికరాలను ఎక్కువగా వాడటం వల్ల.. పిల్లల శారీరక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి హాని కలుగుతుంది. అందుకే, యూట్యూబ్ పాఠాలకు బదులుగా.. పుస్తకాలు చదివేలా చూడండి. దీనివల్ల వారిలో భాషా నైపుణ్యాలు పెరుగుతాయి.
గొప్ప జ్ఞానం, పఠనా శక్తి అలవడుతుంది.
ఇక కథలు చెప్పమంటూ పిల్లలు పోరినా.. కొందరు పట్టించుకోరు. సమయం లేదనో.. ఉదయాన్నే ఆఫీస్కు వెళ్లాలనో సాకులు చెప్పి తప్పించుకుంటారు. కానీ.. పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీతికథలు.. వారిని సన్మార్గంవైపు నడిపిస్తాయి. తప్పొప్పుల గురించి అవగాహన కల్పిస్తూ.. జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాయి. మరికొన్ని కథలు.. పిల్లల్లో జిజ్ఞాసను, సృజనాత్మకతను పెంచుతాయి. వారి తెలివితేటలూ పెరుగుతాయి.
పిల్లలు వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. వారినే అనుకరిస్తారు. వారు ఎలా ఉంటే.. పిల్లలూ అలాగే ఉంటారు. అందుకే.. పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ వాడటం మానేయాలి. అప్పుడు వారుకూడా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తారు. అలాగే.. ఇంట్లో పెద్దల పట్ల తల్లిదండ్రులు గౌరవంతో వ్యవహరిస్తే.. పిల్లలు కూడా ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తారు.