వన్‌ప్లస్ వాచ్ 3ను ఇంతవరకూ ఒకే సైజులో చూశాం. అది 47 ఎంఎం మోడల్. కొంచెం పెద్దగానే ఉండేది. కానీ ఇప్పుడు.. మణికట్టు చిన్నగా ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా వన్‌ప్లస్ మరో మోడల్ తీసుకువస్తున్నది. అదే 43 ఎంఎం వాచ్ 3. త్వరలోనే భారీ లాంచ్ ఈవెంట్లో అధికారికంగా దేశీయ మార్కెట్లో దీన్ని ప్రకటించబోతున్నారు. అప్పటివరకూ టెక్ ప్రియులంతా వాచ్‌లో ఏయే ఫీచర్స్ ఉంటాయో! అని ఊహించుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం నెట్టింట్లో వచ్చిన లీక్‌లను చూస్తే దీన్ని నెక్స్ జనరేషన్స్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారని అర్థమైపోతున్నది.
కొత్త వాచ్ బరువు కేవలం 37.8 గ్రాములు మాత్రమే. అంటే, చేతికి తేలికగా ఉంటుంది. డిస్ప్లే పరిమాణం కూడా కాస్త తగ్గింది. 1.5 అంగుళాల నుంచి 1.32 అంగుళాలకు తీసుకురాగలిగారు. ఈ కొత్త మోడల్లో కూడా మైండ్ అండ్ బాడీ ఎవాల్యుయేషన్ ఫీచర్ ఉంటుంది. అంటే, ఫిజికల్ హెల్త్‌తోపాటు, మీ మూడ్ స్ట్రెస్ లెవెల్.. విషయాలపై కూడా ట్రాకింగ్ చేస్తుంది. బారోమీటర్తో రియల్ టైమ్‌లో మానసిక స్థితిని అంచనా వేయగలదు. వన్‌ప్లస్ వెబ్సైట్లో ఈ వాచ్ గ్లోబల్‌గా రిలీజ్ కానుందని కూడా ప్రకటించారు.
ధర: రూ. 29,000 (అంచనా)
దొరుకు చోటు: వన్‌ప్లస్.కామ్
ఫోన్లో ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్లతో డిస్టర్బ్ అవుతున్నదా? స్మార్ట్‌ఫోన్‌లో చదవడం కష్టంగా మారిందా? అయితే, ‘కిండిల్ పేపర్‌వైట్ 2025’ మీకు మంచి పరిష్కారం కావచ్చు. కొత్తగా వచ్చిన కిండిల్ ఇప్పుడు మరింత స్మార్ట్ అయ్యింది. పేజ్ టర్నింగ్ స్పీడ్ పెరిగింది. బ్యాక్‌లైటింగ్ మెరుగైంది. ఫోన్లోని యాప్ ద్వారా.. ఇట్టే లింక్ అయిపోతుంది. ఒకసారి సెటప్ అయిన తర్వాత, మీరు ఇంతకుముందు కొన్న పుస్తకాలతోపాటు.. మీ అభిరుచి మేరకు పుస్తకాల సూచనలు కూడా వస్తాయి.
లేటెస్ట్ కిండిల్ హోమ్‌పేజీలోనే స్టోర్ బటన్ ఉంది. దీంతో సులభంగా పుస్తకాల్ని బ్రౌజ్ చేసి కొనొచ్చు. బ్యాక్లైటింగ్లో మార్పులు చేసుకుని రూమ్‌లో లైట్లు లేకపోయినా రాత్రిపూట చదవడానికి వీలవుతుంది. ఈ వార్మ్ లైట్‌ను మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్లు ఓపెన్ చేసి ఆర్టికల్స్ చదవడానికి ఇందులో ఒక బ్రౌజర్ కూడా ఉంది.
ధర: 16,999
దొరుకు చోటు: అమెజాన్.కామ్
టెక్నో స్పార్క్ గో-2 మార్కెట్లోకి వచ్చింది. ఫోన్లో కొన్ని సూపర్ ఫీచర్లు ఉన్నాయి. భారతీయ యూజర్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఎల్లా ఏఐ అసిస్టెంట్ ఉంది. ఇది భారతీయ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇస్తుంది. అంటే.. హ్యాపీగా మీరు తెలుగులోనే వాయిస్ కమాండ్స్ ఇస్తూ చిన్నచిన్న పనులు ముగించేయొచ్చు. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. పంచ్-హోల్ డిజైన్.. స్క్రీన్ స్పేస్‌ను పెంచింది అనుకోవచ్చు.
ఈ ఫోన్లో ఒక యూనిక్ ఫీచర్ ఉంది. అదే నో నెట్వర్క్ కమ్యూనికేషన్. మొబైల్ సిగ్నల్ లేనిచోట కూడా కొన్ని ముఖ్యమైన కమ్యూనికేషన్ ఫంక్షన్లు పనిచేస్తాయి. అంటే.. మీరు నెట్వర్క్ లేని ఏరియాల్లో కూడా ఎమర్జెన్సీ టూల్స్ లేదా పీర్-టు-పీర్ ఫీచర్ల ద్వారా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. టెక్నో మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో 8 జీబీ ర్యామ్‌ను పొందొచ్చు. ఇంటర్నల్ మెమొరీ 64జీబీ.
ధర: రూ.6,999 , దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్.కామ్
సీలింగ్ ఫ్యాన్ అంటే.. ఎక్కువశాతం మంది డిజైన్ చూస్తారు గానీ, టెక్నాలజీ గురించి పెద్దగా ఆలోచించరు. కానీ, ఆ రోజులు పోయాయి. సీలింగ్ ఫ్యాన్‌ను కూడా కాస్త స్మార్ట్‌గా ఆపరేట్ చేయొచ్చు. అంతేనా.. ఫ్యాన్ సైలెంట్‌గా, స్మూత్‌గా తిరిగేదీ ఎంచుకోవచ్చు. ఇదిగోండి.. ఓరియంట్ కంపెనీ నుంచి వచ్చిన ఉజాలా ప్రైమ్ మోడల్ని ప్రయత్నించొచ్చు. ఈ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. అంటే, పదేపదే లేచి స్పీడ్ మార్చాల్సిన పని లేదు. హాయిగా ఏ సోఫాలో కూర్చోనో.. మంచంపై నుంచి లేవకుండానే దీన్ని నియంత్రించొచ్చు.
ఇది ముఖ్యంగా పెద్దవాళ్లకు, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బీఎల్డీసీ మోటార్ ఫ్యాన్.. కేవలం 32 వాట్స్ కరెంట్ మాత్రమే తీసుకుంటుంది. దీంతో కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. ఫ్యాన్‌కు ఉన్న మూడు బ్లేడ్లతో 1200 ఎంఎం స్పీడ్‌తో గది మొత్తం గాలిని సమంగా పంపుతుంది. ఫ్యాన్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. దీని బరువు కేవలం 3.1 కిలోలే. ఇంటీరియర్ ఆధారంగా ఫ్యాన్ ఎంపిక చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్. ఫ్యాన్‌తోపాటు డౌన్ రాడ్ షకిల్ కిట్ కూడా వస్తుంది. వీటితో ఫ్యాన్‌ను భద్రంగా అమర్చొచ్చు.
ధర: రూ. 2,799
దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్.కామ్