‘అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. కానీ, కాస్త ఒళ్లు తగ్గితే ఎంత బాగుంటుందో!’.. ఓ పొరుగింటామె విశ్లేషణ.‘మీరు బరువు తగ్గాలి. లేకపోతే బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వచ్చేస్తాయి మరి’.. ఓ డాక్టరు గారి హెచ్చరిక.‘అందరూ నన్ను రకరకాల పేర్లతో వెక్కిరిస్తున్నారు. నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు’.. ఓ పిల్లాడి నామోషీ! పక్కింటి వాళ్లను పట్టించుకోకుండా ఉంటేనో, డాక్టర్ హెచ్చరికను బేఖాతరు చేస్తేనో, తోటిపిల్లలను అదిలిస్తేనో ఈ మాటలు విదిలించేసుకోవచ్చు. కానీ, అద్దం అబద్ధం చెప్పదు కదా. బీఎంఐ ఇండెక్సులూ, తూకపు అంకెల జోలికే వెళ్లకుండా ఓసారి చూసుకుంటే చాలు.. అధిక బరువు ఉన్నారో లేరో తేలిపోతుంది! దానికి తోడు ఆయాసం, మోకాలి నొప్పులు, ఉబ్బరం, నడకలో ఇబ్బంది లాంటి ప్రాథమిక హెచ్చరికలు ఎలాగూ కనిపిస్తాయి. వాటిని దాటుకుని సన్నగా, నాజూగ్గా మారిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. లావుగా కనిపించాలని, దాని దుష్ఫలితాలూ అనుభవించాలని ఎవరూ కోరుకోరుగా! అందుకే తేలికైన, అందుబాటులో ఉన్న పరిష్కారాలతో అధిక బరువును వదిలించుకునే మార్గాలు కొన్ని అన్వేషిద్దాం.
ఒకప్పుడు ఊబకాయం అనేది సామాన్యుడి సమస్యగా ఉండేది కాదు. జన్యుపరంగానో లేకపోతే విలాసమైన జీవితాల వల్లో వచ్చేది. ఇప్పుడలా కాదు. దాదాపుగా ప్రతి నలుగురిలోనూ ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్టు అంచనా. శ్రమ జీవులను ఈ జాబితాలోంచి పక్కన పెడితే, మధ్యతరగతి ప్రజల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంతోకొంత ఊబకాయంతో కనిపించడం ఇప్పుడు సహజం. దాన్ని దాటాలనుకోవడం సమంజసం. కానీ, బరువు తగ్గాలి అనగానే మనకు తోచే రెండే రెండు మార్గాలు. ‘వ్యాయామం చేయాలి, తిండి పరిణామం తగ్గించుకోవాలి. రేపో మాపో వాకింగ్ మొదలుపెడదాం, ట్రెడ్మిల్ కొనేద్దాం, ఏదన్నా ఆటలో చేరదాం’ అనుకుంటూ వ్యాయామానికి దూరంగానే గడిపేస్తుంటాం. ఇక బలవంతంగా నోటిని కట్టేసుకునే ప్రయత్నంలో ఒకటి రెండు రోజుల్లోనే విఫలం అవుతుంటాం. కాసేపు సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే బరువు తగ్గడానికి మరిన్ని మార్గాలు లేవా? అసంతృప్తి లేకుండా కాస్తకాస్తగా పాటిస్తూ సన్నబడలేమా.. అంటే చాలానే జవాబులు వినిపిస్తాయి.

Obesity
ఆకలి ఓ అవసరం
ఆకలి, సత్తువ, రుచి, కాలక్షేపం, వ్యసనం. ఆహారానికి ఈ అయిదు దశలూ ఉంటాయి అనుకుంటే మిగతా జీవులు మొదటి మూడింటి దగ్గరే ఆగిపోతాయి. కానీ, మనిషి మాత్రమే కాలక్షేపం కోసమో, వ్యసనంగానో ఆహారాన్ని తీసుకోవడం కనిపిస్తుంది. నలుగురూ కలిసినప్పుడో లేదా నలుగురినీ కలుపుకొనేందుకో తినడం వేరు. కానీ, రెండు భోజనాల మధ్య నిరంతరం తింటూ ఉంటే మాత్రం అది కచ్చితంగా సమస్యే. మరీ ముఖ్యంగా ఒంటరితనం, ఉద్వేగం, అసంతృప్తి, ఒత్తిడి మధ్య గడిచే ఆధునిక ఉద్యోగస్తులలో ఈ అలవాటు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు వెలువడే డొపమైన్ తాత్కాలికంగా ఊరట కలిగిస్తుందట. ప్రతికూలతల మధ్య ఆహారాన్ని తీసుకోవడం వెనుక కారణం ఇదే! ఒత్తిడిలో పెరిగే కార్టిజాల్, డిప్రెషన్లో ఏర్పడే సెరటోనిన్ లోటు కూడా తిండి వైపే నడిపిస్తాయి. ఇది ఓ తాత్కాలిక దశ అయితే ఫర్వాలేదు కానీ, అలవాటుగా మారితే మాత్రం ‘ఫుడ్ క్రేవింగ్’ ఓ వ్యసనంలా మారుతుంది. నిరంతరం నములుతూ ఉండే నోటితో అధిక కెలోరీలు, అజీర్తి, సమయానికి భోజనం చేయకపోవడం లాంటి సమస్యలతో పాటు చిట్టచివరికి ఊబకాయం శాపంగా మారుతుంది. ఆకలి వేస్తేనే తినడం, భోజనానికీ భోజనానికీ మధ్య తినకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
పిండిపిండి అయిపోతున్నారు
ఖాళీ పర్సులు తోలుతిత్తుల్లాగా వేలాడకుండా నిండుగా కనిపించడానికి వాటిల్లో చిత్తుకాగితాలు కూరతారు. నిండుదనం తప్ప మరో ప్రయోజనం ఉండని ఇలాంటి పదార్థాలను ఫిల్లర్స్ అంటాం. మన ఆహారంలోనూ ఇలాంటి ఫిల్లర్స్ ఉంటాయి. కాదు.. కాదు.. అవే ఆహారంగా మారుతున్నాయి. అదే స్టార్చ్! గోధుమలు, మక్కలు, టపియోక దుంపల నుంచి తీసిన పిండి. ఇది అలాంటి ఇలాంటి పిండి కాదు. ఇసుమంతైనా పోషకమూ, పీచు పదార్థమూ మిగలని పొడి. లోకంలోనే అన్నింటికంటే ప్రమాదకరమైన పిండిపదార్థం ఇదే అంటారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ ఎరిక్ బర్గ్. వీటితో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది, కడుపులో సుద్దగా మారి అజీర్ణానికి దారితీస్తుంది, ఒంట్లో సవాలక్ష సమస్యలకు దారితీసే ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. నేరుగా ఊబకాయానికి దారితీస్తుంది. పిండిపదార్థాలను గమనించుకుని, వాటి
మోతాదును తగ్గించాల్సిందే!
దాటవేత సమస్యే
ఉపవాసం చేయడమో, ఏడింటికల్లా భోజనాన్ని ముగించడమో వేరు. ఏదో ఒక పూట ఆహారాన్ని మిస్ చేయడం, మధ్యమధ్యలో భోజనం చేయకుండా ఉండటం వల్ల బరువు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది. శరీరం ముందస్తు జాగ్రత్తగా తక్కువ కెలోరీలను ఖర్చు చేయడం, తర్వాత తినేటప్పుడు ఎక్కువ తినడం, జీవక్రియలు మందగించడం, పోషకాహారలేమి, ఏకాగ్రతలోపం లాంటి సమస్యలు అదనం. భోజనాన్ని ‘స్కిప్’ చేయడం అంటే బరువు తగ్గడం కాదు.. ఊబకాయానికి దొడ్డిదారిలా మారుతుందని గమనించండి.
ఏదైనా మితంగా
బరువు తగ్గాలి అనుకునేవారిలో సవాలక్ష డైలమాలు ఉంటాయి. రాత్రిపూట చపాతీలు మంచివా, అన్నం మంచిదా, నెయ్యి వేసుకోవాలా వద్దా, ఏ నూనె వాడాలి, స్వీట్స్ ముట్టుకోకూడదా.. అంటూ అనుక్షణం సందిగ్ధంలో ఉంటారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా ఒక్కోసారి ఒకలా వినిపిస్తూ మరింత ఇరకాటంలో పడేస్తుంది. ప్రతి పదార్థానికీ ఓ మితం ఉంటుంది. అదేమిటో సహజంగా మనకి తెలిసిపోతుంది. ఆ మితాన్ని పాటిస్తే చాలు!

What Is Obesity Image
ఏం తింటున్నామో తెలియాలిగా
కాస్త జాగ్రత్తగా గమనిస్తే శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియా అద్భుతంగా కనిపిస్తుంది. అంత సంక్లిష్టంగా జీవక్రియలు చేసే ఒంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ, ఓ చెత్తబుట్టలాగే దాన్ని వాడేస్తుంటాం. మరీ ముఖ్యంగా విషాన్ని కొనుక్కుని మరీ తింటూ ఉంటాం. ఒక్కసారి బిస్కెట్/ చాక్లెట్ ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే తెలుస్తుంది. మైదా, రిఫైన్డ్ ఫ్లోర్, పామాయిల్ లాంటివే ఎక్కువ మోతాదులో కనిపిస్తాయి. అవే దారుణం అనుకుంటే వాటి కింద ఉండే ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, కలర్స్ పేరుతో కనిపించే సాంకేతిక భాషను కాస్త సరళీకరిస్తే వాటి వెనుక ఎన్ని దుష్పలితాలు ఉన్నాయో తెలుస్తుంది.
మాయా సంసారం
విదేశాల్లో ఆహార ఉత్పత్తులకి సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ దృష్టిని తప్పించుకున్నా, వినియోగదారులు సైతం తేడా వస్తే దావాలతో తాట తీస్తారు. మన దగ్గర అలా కాదు. మార్కెటింగ్‌దే పైచేయి. డార్క్ చాక్లెట్ అని రాస్తే చాలు.. అందులో ఏముందో కూడా చూడం. అంతే కాదు fruit juice, made with real tomatoes, energy, health, digestive, wheat, grains.. ఇలా కొన్ని పడికట్టు పదాలను చూడగానే బోల్తా పడిపోతుంటాం. వీటికి ఎక్కువగా బలయ్యేది పిల్లలే కావడం దారుణం. ఉదాహరణకు పిల్లలకు ఇష్టమైన కొన్ని క్రీం బిస్కెట్లు తీసుకుంటే వాటిమీద cream బదులు creme అని కనిపిస్తుంది. పాల పదార్థాలతో కాకుండా నూనె పదార్థాలు వాడుతూ, చట్టం నుంచి తప్పించుకోవడానికి వాడే పదం అది. ఇప్పటి పిల్లలలో ఊబకాయానికి కారణం ఇలాంటి ఆహారమే!
నీరుగారి పోవద్దు
నీటికీ బరువు తగ్గడానికి నేరుగా సంబంధం ఉందని తెలుసుకోవడం ఆశ్చర్యమే. తరచూ తగినంత నీరు తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందని వైద్యుల సూచన. నీటితో జీవక్రియల వేగం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు, పిండిపదార్థాలను సక్రమంగా జీర్ణం చేసుకునేందుకు నీరే సాయపడుతుంది. ఒంట్లో మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపేసి జీర్ణ వ్యవస్థకు సాయపడుతుంది నీరు. అలాంటి నీటిని కాదని దాహం వేసిన ప్రతిసారీ రసాయనాలన్నీ దట్టించిన కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఇక ఊబకాయమే ఫలితం!
తినడం ఓ కళ
పొద్దుపోయే వేళకి ఇంటికి చేరుకోవడం. టీవీ చూస్తూనో, మొబైల్ చాట్ చేస్తూనో తినడం ఇంటింటి కథ. తినేటప్పుడు మనోరంజకమైనవి ఏదీ చూడకూడదు అన్నది వందల ఏళ్ల నాడే ఆయుర్వేద వైద్యులు చెప్పిన మాట. నేల మీద కూర్చుని తింటే భుక్తాయాసానికి ముందే ఆహారం ఆపేయగలం. నములుతూ తినడం వల్ల త్వరగా ఆకలి తీరడమే కాకుండా జీర్ణం కూడా అవుతుంది. చిన్నపాటి కంచంలో తింటే కాస్తా అన్నం కూడా నిండుగా కనిపిస్తుంది. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో ఆహారం మీద నియంత్రణ సాధ్యమే.
సంప్రదాయ థాలీ
మనం తినే వంటలు ఒక్కరోజులో నిర్ణయించుకున్నవి కాదు. శతాబ్దాల తరబడి స్థానిక వాతావరణం, పంటలు, శ్రమకి అనుగుణంగా రూపొందించుకున్నవి. కరువులో ఆకలి తీర్చుకునేందుకో, తక్కువ ఖర్చుతో కడుపు నింపుకొనేందుకో కనుక్కున్న పాశ్చాత్య ఆహారాలు మనకు సరిపడవు. కూరగాయలు, నెయ్యి, తృణధాన్యాలు, పెరుగు అన్నీ సమపాళ్లలో ఉంటాయి మన కంచంలో. వారానికోసారి మరిన్ని పోషకాలు ఇచ్చే మాంసాహారం సరేసరి. డైట్‌ఫుడ్ పేరుతో అటూ ఇటూ పరుగెత్తాల్సిన పని లేదు. కావాలంటే మన ఆహారంలోనే దంపుడు బియ్యం, ఆకుకూరలు లాంటి జోడింపులతో బరువును నియంత్రించుకోవచ్చు.
రాత్రి కీలకం
రాత్రి ఏడింటికల్లా తినేయడం అన్నది బరువు తగ్గేందుకు ఔషధంలా పనిచేస్తుందన్నది నిజం. నిద్రపోయే సమయానికి ఆహారం అరిగిపోయి.. సుఖనిద్ర సాధ్యమన్నది పైకి కనిపించే కారణం. అన్నం తిన్నాక కూడా ఏదో ఒకటి తింటూ ఉండాలనిపించే గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లను నియంత్రిస్తుందన్నది నిపుణుల మాట. కాలేయం లాంటి అవయవాలు మలినాలను వదిలించుకునే సమయాన్ని కూడా కల్పిస్తుందీ అలవాటు. వేళ దాటిన ఆహారంతో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుందనీ, అది క్రమంగా మధుమేహానికి దారితీస్తుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. అన్నింటికీ మించి మన జీవక్రియలు సూర్యుడి నడవడికి అనుగుణంగానే ఉంటాయి. దీన్ని ‘సర్కాడియన్ రిథం’ అంటారు. దాని ప్రకారం రాత్రివేళ ఆహారం సబబు కాదు.
ఊబకాయం మన చేతుల్లో ఉండే సమస్య అని అర్థం చేసుకుంటే, దాన్ని వదిలించుకునేందుకు చిత్తశుద్ధి కావాలని గ్రహిస్తే బరువు తగ్గడంలో మొదటి మెట్టు ఎక్కినట్టే. దాన్ని సాధించేందుకు కొంత గడువును పెట్టుకుని నెలనెలా బరువును గమనించుకుంటూ… మార్పును బేరీజు వేసుకుంటూ సాగడమే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బరువు ఒక్కసారిగా తగ్గదు, తగ్గకూడదు కూడా. నెలకు రెండు కిలోల పరిమితి సరిపోతుంది. కావాలంటే సరదాగా ఇంట్లోవారితోనో, స్నేహితులతోనో సవాలు చేస్తే బరువు తగ్గేందుకు ఓ ప్రేరకం ఉంటుంది.

తెల్లనివన్నీ పాలు కాదు
పంచదార, ఉప్పు, మైదా.. ఈ మూడింటినీ కూడా white poison గా పేర్కొంటూ ఉంటారు నిపుణులు. వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం సాధ్యం కాదు. జీవితంలో ఆరోగ్యం ఎంత అవసరమో, ఆస్వాదన కూడా అంతే అవసరం కదా! కానీ, మోతాదుకి మించి ‘అలవాటు’ చేసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అధిక ఉప్పు వల్ల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది.
కిడ్నీలు, రక్తం మీద నేరుగా ప్రభావం ఉంటుంది.
అదే రక్తపోటుకు దారితీసేది. మరీ ముఖ్యంగా చిప్స్, పఫ్, కూల్ డ్రింక్స్ లాంటి పాశ్చాత్య ఆహారంలో వీటి మోతాదు ఎక్కవే. నాలుకకి తక్కువ ఉప్పును అలవాటు చేయాలి. నిమ్మకాయరసం, మిరియాల పొడి చల్లడం లాంటి ప్రత్యామ్నాయాలతో రుచి తగ్గకుండానే ఉప్పును దూరంగా ఉంచవచ్చు.
తెల్లటి పంచదారతోనూ ఇంతకుమించిన సమస్యలే ఉంటాయి. పంచదారను ‘Empty Calories’గా పేర్కొంటారు. దీనివల్ల ఎలాంటి పోషకాలూ లభించకపోగా, కొవ్వుగా మారడమే ఇందుకు కారణం. గుండె, కాలేయం, రోగనిరోధకశక్తి… ఇలా అన్ని వ్యవస్థల మీదా ఇది దుష్ప్రభావం చూపిస్తుంది. ైగ్లెకేషన్ అనే ప్రక్రియతో వయసు మీదపడేట్టు చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచి మధుమేహానికి దారితీస్తుంది. దీనికి తోడు చెరుకురసాన్ని పంచదారగా మార్చేందుకు Sulfur Dioxide, Phosphoric Acid Calcium Hydroxide లాంటి సవాలక్ష రసాయనాలు వాడతారు. పంచదార బదులు బెల్లం, స్వీట్స్ బదులు తేనె, ఖర్జూరాలు, పండ్లు తీసుకుంటే తీపి తిన్నట్టూ ఉంటుంది. అంతగా హాని జరగదు. చెరుకు బదులు స్టీవియాలాంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా ఉన్నాయి. కానీ, వీటి దుష్ఫలితాల మీద చర్చ నడుస్తున్నది. కాబట్టి చక్కెర నియంత్రన మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి.
ఇక మైదా గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఓ స్పూన్ మైదాను పచ్చిగా నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. అది ఎంత చెత్త పదార్థమో. రంగు, రుచి లేకుండా ఉండలా చుట్టుకుపోయే ఈ పిండికే రసాయనాలు, రుచులు జోడించి ఆహార ఉత్పత్తుల కంపెనీలు మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. చవకగా దొరుకుతుంది కాబట్టి మన జేబుకు నొప్పి తెలియడం లేదు. కానీ, అమూల్యమైన ఆరోగ్యాన్ని మాత్రం మైదా ఛిద్రం చేస్తుంది. మార్కెట్లో దొరికే చాలావరకూ బిస్కెట్లు, చాక్లెట్లలో మైదా, చక్కెర, పామాయిల్ మాత్రమే ఉండటం చూడవచ్చు. పిల్లలకు పండ్లు, సంప్రదాయ చిరుతిళ్లు అలవాటు చేయడం.. కొన్నాళ్ల పాటు లేబుల్స్ గమనిస్తూ ఏ ఉత్పత్తులు హానికారకమో నోట్ చేసుకుని వాటికి దూరంగా ఉండటమే ఇందుకు ప్రత్యామ్నాయం.
నూనె, చక్కెర, ఉప్పు ఎంత వాడాలి అనేదాని మీద రకరకాల అధ్యయనాలు వినిపిస్తున్నాయి. వాటిని తు.చ. తప్పకుండా పాటించడం అంత తేలిక కాకపోవచ్చు. కానీ, నెలకి ఎన్ని పాక్యెట్ల ఉప్పు, చక్కెర, నూనె తీసుకుంటున్నామో ఒకసారి బేరీజు వేసుకుంటే మన వాడకం తెలిసిపోతుంది.
మరికొన్ని టిప్స్!
గురక, ఆయాసం, నిద్రలేమి, మెట్లు ఎక్కలేకపోవడం, శరీరంలో ఏదో ఒక భారం మరింత లావుగా కనిపించడం, మెడ వెనకాల నలుపు, మోకాలి నొప్పులు, మలబద్ధకం, చెమటతో తడిసిపోతుండటం.. లాంటి లక్షణాలన్నీ ఊబకాయానికి చిహ్నాలే. పట్టించుకుంటే అంతటితో అగుతుంది లేదా మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
ప్రతిదానికీ ఓ
ప్రత్యామ్నాయం ఉంటుంది.
స్వీట్స్ బదులు పండ్లు, కూల్ డ్రింక్ బదులు
కొబ్బరినీరు, పాప్ కార్న్ బదులు పేలాలు
లేదా మక్కజొన్న, చిప్స్ బదులు అరటి చిప్స్,
పఫ్ బదులు సమోసా, పూరీ బదులు పుల్కా..
ఇలా ప్రతి జంక్ ఫుడ్‌కీ మరో మార్గం ఉంటుంది. వాటిని పాటిస్తే ఆకలికి, రుచికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
బరువు తగ్గడం మీద ఉపవాసం చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎలా చేయడమో మాత్రం చాలామందికి తెలియదు. ఉపవాసానికి ముందు రోజు రాత్రి నుంచే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఉపవాసం రోజున ఎలా ఉండాలి, విరమించాక ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అన్నది ఓ సైన్స్. పెద్దలను అడిగినా, ఆయుర్వేద పుస్తకాలు తిరిగేసినా తేలికగానే తెలిసిపోతుంది. అలా పాటిస్తేనే ఫలితం ఉంటుంది.
ఒకసారి రక్తపరీక్షలు చేసుకుని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, గత ఆరుమాసాల షుగర్ లెవల్స్ లాంటివి గమనించుకోవాలి. అవి మోతాదు మించి కనిపిస్తే ప్రమాద ఘంటికలుగా భావించి జీవనశైలిలో మార్పు తెచ్చుకోవాలి. మరీ మోతాదు మించిపోతే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో మందులు ఎలాగూ తప్పవు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని మీద గౌరవంతోనో, పారేయడానికి మనసు ఒప్పకనో ఇంట్లో మిగిలిన అన్నం అంతా తినేస్తుంటారు చాలామంది. ఊబకాయానికి ఇది కూడా కారణమే. కచ్చితమైన కొలతలు పాటించడం, మిగిలిన పదార్థాలను ఇంటి దగ్గర ఉండే బీదలకు ఇచ్చేయడంతో పాటు విందు భోజనాలకు/ పండుగలకు ముందు తర్వాత కూడా కాస్త నియంత్రణతో ఉండటం మేలు.
ఊబకాయం లక్షణాలు ఇప్పుడు చిన్నవయసులోనే కనిపిస్తున్నాయి. కానీ, గారాబంతోనో, ఇప్పుడు కాక ఎప్పుడు తింటారు లాంటి అభిప్రాయాలతోనో విస్మరిస్తున్నాం. వైద్యులు సైతం నిదానంగా సర్దుకుంటుందనే చెబుతున్నారు. కానీ ఆహారం, అలవాట్ల విషయంలో తొలిదశలోనే జాగ్రత్తపడాలి.
ఎవరికైన ఇష్టమైన కూర ఆలూ లాంటి కూరలే చెబుతారు. కాకర, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ.. లాంటి పేర్లు వింటేనే మొహం చిట్లిస్తారు. అన్నిరకాల కూరలకీ అలవాటు పడినప్పుడే పోషకాలు నిండుగా లభిస్తాయి. ఏ రుతువులో దొరికే పండ్లు, కూరలు ఆ కాలంలో తినడం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు మీద కూడా నియంత్రణ ఉంటుంది.
తెల్లటి బియ్యంతో పోల్చుకుంటే ముడిబియ్యం చాలా తక్కువే తినగలం. రుచి మాత్రమే అందుకు కారణం కాదు. పీచుపదార్థం ఎక్కువ ఉండే ఆహారంతో కొద్ది మోతాదుతోనే కడుపు నిండుతుంది. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. నిదానంగా జీర్ణమవుతూ ఆకలిని ఆపడమే కాకుండా, ఇతర మలినాలను కూడా గెంటేస్తుంది. నాజూగ్గా ఉండాలనుకునేవారికి పీచుపదార్థాలు ఔషధమే!
బరువును తేలికగా తగ్గిస్తామంటూ రకరకాల మందులు, ఉత్పత్తులు ప్రచారంలో కనిపిస్తాయి. వాటిలో చాలావరకు తప్పుదోవ పట్టించేవే. నియంత్రణ లేని భారతీయ మార్కెట్లో ఇలాంటి మాటలతో తేలికగా మోసం చేయవచ్చు. ఇక మందుల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా లేకుండా వీటి జోలికే పోకపోవడం మంచిది.
…? కె.ఎల్.సూర్య