మామిడి పండ్లే కాదు.. ఆకులూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. చర్మాన్ని మెరిపించడంలో.. అందానికి మరిన్ని వన్నెలు అద్దడంలో మామిడాకులు అద్భుతమే చేస్తాయి. ఆయుర్వేదంలో విరివిగా వాడే ఆమ్రపత్రాలు.. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మామిడి ఆకుల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు.. చర్మాన్ని రక్షిస్తాయి. యూవీ కిరణాలు, కాలుష్యం నుంచి కాపాడుతాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. మామిడి ఆకుల ఫేస్‌ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే.. వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
గుప్పెడు మామిడి ఆకుల్ని తీసుకుని.. శుభ్రంగా కడగాలి. వాటిని పాన్పైన మెల్లిగా వేయించాలి. చల్లారిన తర్వాత ఆకుల్ని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని.. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి, బాగా కలపాలి. మందపాటి పేస్ట్‌గా తయారు చేసుకొని.. ముఖం మొత్తానికి బాగా అప్లయి చేయాలి. ఓ ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా మామిడి ఆకుల ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. ముఖవర్చస్సు మారిపోతుంది.