గుజరాత్‌లోని పల్లె మహిళలు.. పనికిరాదని పారబోసే చెత్తతోనే సంపదను సృష్టిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ.. సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దానిని విక్రయిస్తూ.. అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అటు ప్రకృతిని కాపాడటంతోపాటు ఇటు కుటుంబానికీ ఆర్థిక భరోసా ఇస్తున్నారు.
గుజరాత్‌లోని సబర్కంత జిల్లా హర్షల్ గ్రామంలో ఇప్పుడు అడుగడుగునా స్వచ్ఛతే దర్శనమిస్తున్నది. అక్కడి మహిళలు ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తారు. ఈ చెత్తతో కొత్త ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సేకరించిన చెత్తను షెడ్‌కు తరలించి.. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేస్తారు. ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు, కూరగాయల వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఎరువును తయారుచేస్తున్నారు.
ఈ సేంద్రియ ఎరువులను స్థానిక రైతులకు విక్రయిస్తున్నారు. ఈ ఎరువులు వాడటం వల్ల భూసారం పెరుగుతున్నదనీ, మంచి దిగుబడి వస్తున్నదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎరువుల తయారీకి పనికిరాని పొడి చెత్త, లోహపు వ్యర్థాలను స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తున్నారు. ఇక పునర్వినియోగ వస్తువులను రీసైకిల్ చేసి అమ్ముతున్నారు. ఇందుకోసం స్థానిక స్క్రాప్ డీలర్లతో ఒప్పందం కూడా చేసుకున్నారు. మొత్తంగా చెత్త సమస్యను పరిష్కరించడంతోపాటు వ్యర్థాల నుంచి మూడు రకాల అర్థవంతమైన ప్రయోజనాలు అందిస్తున్న హర్షల్ గ్రామ మహిళల పనితీరుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.