ఇంటిలోపల గాలి కాలుష్యం పెరిగిపోతున్నది. ఫర్నిచర్, పెయింట్స్, ఫ్లోర్, టాయిలెట్ క్లీనింగ్ ఉత్పత్తుల నుంచి వచ్చే రసాయనాలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ఇంటి లోపలి గాలిని శుద్ధి చేయడంలో కొన్ని మొక్కలు సమర్థంగా పనిచేస్తాయని ‘నాసా’ చెబుతున్నది. వీటిని పెంచుకుంటే.. ఇండోర్ పొల్యూషన్ తగ్గుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ భరోసా ఇస్తున్నది.
స్పైడర్ ప్లాంట్: ఇంట్లోని కార్పెట్లు, ఫర్నిచర్ నుంచి వెలువడే ఫార్మాల్డిహైడ్తోపాటు పెయింట్స్, క్లీనింగ్ ఏజెంట్స్ నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలను స్పైడర్ ప్లాంట్ మొక్క సమర్థంగా తొలగిస్తుంది. ఈ మొక్క తక్కువ కాంతిలోనూ సులభంగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. పడక గదుల్లో పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
స్నేక్ ప్లాంట్: రోజువారీ గృహోపకరణాలలో కనిపించే సాధారణ ఇండోర్ టాక్సిన్లు.. ఫార్మాల్డిహైడ్, బెంజీన్. వీటిని ఫిల్టర్ చేయడంలో స్నేక్ప్లాంట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ఇంటీరియర్కైనా.. ఇట్టే సరిపోతుంది. ఇల్లు, కార్యాలయాల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
పీస్ లిల్లీ: ఇంట్లో వ్యాపించే ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఎథిలిన్, అమ్మోనియాలను పీస్ లిల్లీ మొక్కలు సమర్థంగా వడపోస్తాయని నాసా భరోసా ఇస్తున్నది. గాలి కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు గదికి కొత్త అందాన్ని తీసుకురావడంలోనూ ఈ మొక్కలు ముందుంటాయి. ఆకుపచ్చ రంగులో నిగనిగలాడే ఆకులు, తెల్లని పువ్వులు.. ఇంటి మూలమూలలనూ ప్రకాశవంతంగా మారుస్తాయి. అంతకుమించి.. గాలి కాలుష్యాన్ని దూరం చేస్తాయి.
కలబంద: అందానికీ, ఆరోగ్యానికీ అండగా నిలిచే కలబంద మొక్కలు.. ఇంటి లోపలి కాలుష్యాన్నీ తగ్గిస్తాయని మీకు తెలుసా? గోడల రంగులు, ఫ్లోర్, బాత్రూమ్, టాయిలెట్ క్లీనర్ల నుండి విడుదలయ్యే కాలుష్య కారకాలను కలబంద ఇట్టే తొలగిస్తుంది. ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. కుండీలో ఒక్క కలబంద మొక్కను పెంచితే.. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.