పరిణామ క్రమంలో గొంగడి పురుగు ‘సీతాకోకచిలుక’గా మారుతుంది. ‘సీతాకోకచిలుక’ ముచ్చర్ల అరుణ పరిణామ క్రమమూ అలాంటిదే. డ్యాన్సర్ నుంచి నటిగా, నటి నుంచి గృహిణిగా, గృహిణి నుంచి ‘సోషల్’ స్టార్‌గా మార్పు చెందుతూ వచ్చారామె. ‘జీవితంలో మార్పు మినహా ఏదీ శాశ్వతం కాదు’ అంటారు అరుణ. తనకిప్పుడు, అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి పదిహేను లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. చాలామందికి అరుణ ‘ఇన్‌స్టా గ్రాండ్ మా’. ఆ హోదాను ఆమె ఆనందంగా ఆమోదిస్తున్నారు.
యాభై ఎనిమిది.. రిటైర్మెంట్తో లంకె ఉన్న అంకె. అప్పటికే ఓ ఇల్లు కట్టుకుని ఉంటారు. ఎంతోకొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. పిల్లలు కూడా జీవితాల్లో స్థిరపడి ఉంటారు కాబట్టి పరుగు ఆపేసి, విశ్రాంతికి సిద్ధం అవుతారు. మాజీ నటి, తెలంగాణ ఆడబిడ్డ ముచ్చర్ల అరుణ ఇప్పటికే ఈ సౌలభ్యాలన్నీ అనుభవిస్తున్నారు. నిజానికి, తన జీవితం మలుపుల మయం. అరుణ.. కొత్తగూడెంలో పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగారు.
తండ్రి ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్. ఆ తర్వాత కొంతకాలం వ్యవసాయం చేశారు. ఏదో డ్యాన్స్ అకాడమీలో అరుణను చూశారు ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా. మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు.. టపటపా కదులుతున్న ఆమె కనురెప్పలు సీతాకోక చిలుకల్లా అనిపించాయి. అంతే, తాను తీయబోయే చిత్రానికి హీరోయిన్ దొరికేసిందంటూ మీడియాకు చెప్పేశారు. మొదట్లో అరుణ తటపటాయించారు. ఆలోచించుకుని, ఆ తర్వాత తలూపారు.
ఆ సినిమా పేరు ‘సీతాకోకచిలుక’. అదో సంచలనం. అరుణ హఠాత్తుగా అగ్రనాయికల సరసన చేరి పోయారు. ఆఫర్ల వెంట ఆఫర్లు వచ్చాయి. జేగంటలు, జస్టిస్ చౌదరి, శ్రీవారికి ప్రేమలేఖ, స్వాతి.. ఆమె నటించిన చిత్రాల జాబితా పెద్దదే. వ్యాపారవేత్త మోహన్‌తో వివాహం తర్వాత.. సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం నుంచీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. సంప్రదాయ వంటల నుంచి చిట్కాల వరకు చాలానే పోస్ట్ చేస్తుంటారు. మట్టికుండలో వండటం ఎలా? ఇంట్లోనే జుట్టు రంగు తయారు చేసుకోవడం ఎలా?.. మహిళల ఆసక్తిని పట్టేసినట్టు ఉంటాయి ఆ వీడియోలు. కాస్త తమిళ యాస కలిసిన ఆంగ్లం వినసొంపుగానే ఉంటుంది.
అప్పట్లో వంటే రాదు
“నా వీడియోలు చూసేసి.. నేను పుట్టుకతోనే పెద్ద వంటలక్కనని భ్రమపడతారు చాలామంది. అదేం కాదు. పెళ్లి నాటికి నాకు వంటే రాదు. మా అమ్మ, అత్తమ్మ పట్టుబట్టి నేర్పించారు. మా ఆయన సహనాన్నీ మెచ్చుకోవాల్సిందే. క్రమంగా వంటింటి మీద పట్టు సాధించాను. రుచుల రహస్యాలు తెలుసు కున్నాను. మా అమ్మాయికి కూడా ఇదే సమస్య. దీంతో తన పెళ్లయిన తర్వాత,
వంట నేర్పడానికి అమ్మ హోదాలో అమెరికా వెళ్లాను.
నా కూతురే కాదు, చాలామంది యువతులకు పాకశాస్త్రం పెద్ద ఇబ్బంది అని అర్థమైంది. ‘నువ్వు నాకు చెబుతున్నవన్నీ.. ప్రపంచానికీ చెప్పొచ్చుగా’ అని సలహా ఇచ్చింది నా కూతురు. అలా వంటల వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. చిట్కాలు, సలహాలు, సూచనలు, ముచ్చట్లు.. క్రమంగా నా పరిధిని విస్తరించాను. మొదట్లో పెద్దగా స్పందన ఉండేది కాదు. మెల్లగా అభిమానులు పెరిగారు. ప్రశంసలు అందుతున్నాయి. ఆ ఆత్మీయతే నా బలం. ఒకప్పుడు నన్ను నటిగా గుర్తించేవారు. అది నా పాత్రలకు దక్కిన గౌరవం. ఇప్పుడు నన్ను నన్నుగా గౌరవిస్తున్నారు. గ్లామర్‌తో సంబంధం లేని గుర్తింపు ఇది” అంటారు అరుణ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.
రుచి.. అభిరుచి
“మీరు గమనించారో లేదో నా వంటల్లో ఆయా రుతువుల్లో పండే కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. సంప్రదాయానికి కొంత ఆధునికత జోడిస్తాను. బిర్యానీలో కందిపప్పు వేసి.. దాల్ బిర్యానీ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ విరివిగా ఉపయోగిస్తాను. వీటివల్ల రుచికి రుచి, పోషకాలకు పోషకాలు. వంట పనిలో కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేయాలి. దీనివల్ల డైనింగ్ టేబుల్ మీద.. అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తారు. స్టార్ షెఫ్ సంజీవ్‌కపూర్ వీరాభిమానిని నేను. ఆయన వీడియోలు చూస్తాను. తెలంగాణలో పుట్టిపెరగడం వల్ల తొక్కులు, పొడులు అంటే ప్రాణం. మా ఆయనేమో ఉత్తరాదివారు. ఆయన అభిరుచులు ఆయనకు ఉంటాయి. మా కిచెన్‌లో ఉత్తర-దక్షిణాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తాను. సంక్లిష్టమైన వంట ప్రక్రియలకు నేను దూరంగా ఉంటాను.
ఇన్‌స్టాలో పరిచయం చేయను కూడా. నేటి తరానికి అంత సమయం ఎక్కడుంది చెప్పండి? నేను నా కూతుళ్లతో ఎలా మాట్లాడతానో వీడియోలలోనూ అలానే మాట్లాడతాను. ఏదైనా అడిగితే స్పందిస్తాను. ఇదే నా విజయ రహస్యం. ‘అభిమానులు, అనుచరులు’ అనే మాట నాకు నచ్చదు. ‘ఆత్మీయులు’ అనుకుంటే సరి పోతుంది” అని వివరిస్తారు అరుణమ్మ.
ఒక చిట్కా..
ఆహారధాన్యాలను నిల్వ ఉంచిన పాత్రలో ఓ వేప కొమ్మ వేయండి. పురుగుల బెడద ఉండదు.
ఒక సలహా..
వంట పనిని కష్టంగా భావించకండి. ఇష్టంగా చేయండి. మరింత ఇష్టంగా వడ్డించండి.
బామ్మ మాట
మొగుడి మనసు గెలవాలంటే, ముందుగా అతని పొట్ట గెలవాలి.
ఇన్‌స్టా అకౌంట్:
www.instagram.com/mucherla.aruna
ఇష్టమైన రుచులు
గాజర్ కా హల్వా మక్క రొట్టెలు డ్రైఫ్రూట్ లడ్డూ చిక్కీ