దొంగతనం కేసు కాస్త.. మిస్టరీ మరణంగా మారడంతో కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. దొంగతనానికి ముందు అసలు ఎంఎంటీఎస్ రైలులో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు.అదే విషయంపై కోమలిని ప్రశ్నించాడు.
‘సార్..ముఖానికి మఫ్లర్ కట్టుకొన్న ఓ వ్యక్తి నాతోపాటే నెక్లెస్‌రోడ్డు స్టేషన్లో రైలు ఎక్కాడు. ఆ వ్యక్తి కాసేపటికి ముసలావిడతో మాట కలిపాడు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకొంది. ఇదే అదునుగా ఆ ముసలావిడ నగలు తీసుకొని పనిలోపనిగా ఫ్యాన్‌తోపాటు నేను జేమ్స్‌స్ట్రీట్ స్టేషన్లో రైలు దిగేశా’ అంటూ కోమలి తన దొంగతనాన్ని ఒప్పుకొంది. ‘ఎంఎంటీఎస్ రైలులో అప్పటివరకూ మఫ్లర్ వ్యక్తితో మాట్లాడుతున్న ముసలావిడ ఉన్నట్టుండి నిద్ర పోవడమేంటి? మీరు ఆమె నగలు తీసుకొంటుంటే, ఆ వ్యక్తి అడ్డుచెప్పలేదా?’ అని అడిగిన రుద్ర ప్రశ్నకు.. ‘సార్.. అప్పుడు ఏం జరిగిందో నాకేం తెలియదు.
ఏదో ఫోన్ వస్తే నేను కాల్లో ఉన్నా. ఇంతలోనే ఆ వ్యక్తి మాయమయ్యాడు. ముసలావిడ నిద్రలోకి జారుకొంది. అప్పుడే నేను దొంగతనం చేశా’ కోమలి భయపడుతూ చెప్పింది. ‘అమ్మా మేడమ్.. ఆ ఆగంతక వ్యక్తి రైలు ఎక్కినట్టు ఫుటేజీలో ఉందిగానీ.. దిగినట్టు ఎక్కడా లేదు. మీరు ఒక్కరే పెద్ద బ్యాగ్‌తో దిగినట్టు ఉంది. అసలేం జరిగిందో తమరే నిజం చెప్పాలి’ కసురుకున్నాడు రామస్వామి. ‘సార్.. ప్లీజ్ నాకు ఇంతే తెలుసు. దొంగతనం చేసినందుకు జైలు శిక్ష వేస్తే వేయండి. అంతేగానీ హత్యానేరం నాపై మోపకండి ప్లీజ్’ బతిమిలాడింది కోమలి.
ఇంతలో ఇంట్లో బాత్రూమ్లో కాలుజారి పడటంతోనే ముసలావిడ చనిపోయినట్టు రుద్రకు ఫోన్ వచ్చింది. అది విన్న రుద్ర.. ‘కోమలి గారూ.. కేసు సాల్వ్ అయ్యింది. ముసలావిడ మరణానికి మీకు సంబంధం లేదు. అయితే, దొంగతనం చేసినందుకు మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. 10 నిమిషాలు సమయం ఇస్తాం. రెడీ అయ్యి రావాలి’ అని రుద్ర అనగానే సరేనంటూ కోమలి గదిలోకి వెళ్తుండగా.. ‘అక్కా.. క్రిష్ అన్నయ్య ఎక్కడున్నాడు? నాకు ఈరోజు అబాకస్ నేర్పిస్తానని చెప్పాడు’ అంటూ పక్కింటి చింటూ పరుగెత్తుకొంటూ వచ్చాడు.
‘క్రిష్ ఎవరు?’ రుద్ర ప్రశ్నించాడు. ‘తను నా బాయ్‌ఫ్రెండ్. ఇద్దరం కలిసే ఉంటాం. ఈ రోజు తెల్లవారుజామునే ఫ్లైట్‌లో షోలాపూర్‌కు వెళ్లాడు. ప్రూఫ్ కావాలంటే వీడియో కాల్లో మాట్లాడిస్తా’ అంటూ కోమలి చెప్పింది. ‘సరే.. మీరు రెడీ అయ్యి వచ్చాక మాట్లాడుదాం’ అని చెప్పాడు రుద్ర. క్రిష్‌కు ఫోన్ కలుపుతూ గదిలోకి వెళ్లింది కోమలి.
పది నిమిషాలు గడిచింది. కోమలి వచ్చేలోపు రుద్ర అక్కడ లేడు. ఎక్కడికి వెళ్లారని అడిగితే, ఏదో ఫోన్ కాల్ వస్తే బయట మాట్లాడుతున్నారని రామస్వామి చెప్పాడు. పావుగంట తర్వాత లోపలికి వచ్చిన రుద్రతో.. ‘సార్.. క్రిష్‌తో మాట్లాడుతారా?’ అడిగింది కోమలి. సరేనన్నాడు రుద్ర. ఓ కాఫీకేఫ్లో కూర్చున్న క్రిష్.. గంటన్నర కిందటే ల్యాండ్ అయినట్టు చెప్తూ విషయమేంటని ఆరా తీశాడు.
జరిగిన విషయాన్ని వివరించిన రుద్ర.. కేసు నమోదు చేసి కోమలిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాడు. వెంటనే తాను బయల్దేరుతున్నట్టు చెప్పాడు క్రిష్. వీడియో కాల్‌ను ఎండ్ చేసిన రుద్ర.. కోమలితో.. ‘కోమలి గారూ.. మీరు చేసింది ఓ దొంగతనం. కంప్లయింట్ ఇచ్చిన ముసలావిడ కూడా లేదు. సొమ్ము కూడా రికవరీ అయ్యింది. సో.. మిమ్మల్ని బయటకు తీసుకురావడం ఇప్పుడు నాకు చాలా సులువు. అయితే, అది జరుగాలంటే మీరు నాకు ఓ సాయం చేయాలి’ అన్నాడు.
రుద్ర నోటివెంట ఎన్నడూ వినని మాటలు రావడంతో ఒకింత ఆశ్చర్యంతో బిత్తరపోయాడు రామస్వామి. కోమలి అంగీకారం కూడా తీసుకోకుండా రుద్ర చెప్పడం ప్రారంభించాడు. ‘కోమలి గారూ.. ఇటీవల ఓ కేసు వచ్చింది. అదో థెఫ్ట్ అండ్ మర్డర్ మిస్టరీ కేసు. దాన్ని సాల్వ్ చేస్తే, నాకు ప్రమోషన్ వస్తుంది. అంటున్నానని తప్పుగా అనుకోకండి.. థెఫ్టింగ్లో మీకు కొంత అనుభవం ఉంది కాబట్టి, ఈ కేసును సాల్వ్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తారని అనుకొంటున్నా. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చే సూచనలతో కేసు సాల్వ్ అయితే, ఈ ముసలావిడ థెఫ్ట్ కేసులో మిమ్మల్ని బయటపడేలా చేస్తా’ అంటున్న రుద్ర మాటలకు ఏం చెప్పాలో తెలియక వినసాగింది కోమలి.
రుద్ర మొదలుపెట్టాడు.. ‘వైజాగ్‌కు చెందిన ఓ అబ్బాయీ, అమ్మాయి లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. పేరెంట్స్ లేకపోవడంతో జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు తెగబడ్డారు’ అని రుద్ర అనడంతోనే.. ‘సార్.. మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థమయ్యింది. ప్లీజ్. మేము జల్సాలకు ఏం తెగబడలేదు’ అని కోమలి కసురుకొంటుండగానే.. ‘కోమలి గారూ.. ఇది మీ స్టోరీ ఏమీ కాదు. మొత్తం విన్నాక మీరే ఆ మాట చెప్తారు. ముందు వినండి’ అని రుద్ర అనడంతో కోమలి శాంతించింది.
రుద్ర తిరిగి మొదలుపెట్టాడు. ‘చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడటం, పోలీసులకు దొరక్కపోవడంతో వీరి దోపిడీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పెద్దమొత్తంలో డబ్బు సమకూరడంతో అప్పటికే, గర్భం ధరించిన ఆ అమ్మాయి అతనితో పెండ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే, అతను ఎందుకో దాన్ని రిజెక్ట్ చేశాడు. దీంతో అతణ్ని అడ్డు తొలగించుకోవాలని ఆమె ఓ ప్లాన్ వేసింది. ఎప్పటిలాగే, తమ దొంగతనాన్ని ఓ రైలులో ఫిక్స్ చేశారు. అది ఎంఎంటీఎస్’ అని రుద్ర అనగానే.. కోమలి మళ్లీ అంతెత్తున లేచింది.
‘సార్.. దొంగతనం చేసినంత మాత్రాన నేను..’ ఆమె అంటుండగానే.. రామస్వామి పక్కింటి చింటూను తీసుకొచ్చాడు. ఒక్కసారిగా అవాక్కయ్యింది కోమలి. ‘కోమలి గారూ.. ఒకసారి క్రిష్‌కు వీడియోకాల్ కలుపుతారా? చింటూ మాట్లాడుతానంటున్నాడు.. అలాగే మీకు, క్రిష్‌కు ఉన్న రిలేషన్‌షిప్‌ను పక్కింటి వాళ్లు కూడా చెప్తారట.. ఇంతకుముందే ఫోన్ కాల్ పేరిట బయటకు వెళ్లి ఆ తతంగాన్ని తెలుసుకొన్నా’ అని రుద్ర అనగానే.. తొలుత గద్దించిన కోమలి.. రుద్ర ఒక విషయం చెప్పగానే.. ఏడుస్తూ నిజం ఒప్పేసుకొంది. మఫ్లర్ కప్పుకొన్న వ్యక్తి క్రిషేనని, గర్భిణి అయిన తనను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో రైలులో హత్య చేసి ఆ పెద్ద బ్యాగ్‌లో శవాన్ని పెట్టినట్టు ఒప్పకొంది. అతనితో పెనుగులాట జరుగడంతో రైలులో ఫ్యాన్ ఊడి వచ్చిందని, అదే తనను పట్టించిందని ఏడ్చింది. ఇంతకీ, కోమలినే హంతకురాలని రుద్ర ఎలా కనిపెట్టినట్టు?
…? రాజశేఖర్ కడవేర్గు