రుతుపవనాలు.. వర్షాలతోపాటు ప్రకృతి కోసం సరికొత్త అందాలనూ మోసుకొస్తాయి. అడవులకు పచ్చని కోకను కానుకగా అందిస్తాయి. వానజల్లులతో జలపాతాలు పరవళ్లు తొక్కుతాయి. కొండలు పొగమంచును సింగారించుకుంటాయి. ఇదే సమయంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి టూరిస్టులు క్యూ కడుతుంటారు. నచ్చిన ప్రదేశాలను చుట్టొచ్చి.. ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. అయితే.. ఇదే సమయంలో కొన్ని ప్రతికూలతలూ ఎదురవుతాయి. వాటిని గుర్తించకుంటే, ఆనందంగా గడవాల్సిన యాత్రలో.. అనవసరమైన కష్టాలు ఎదురవుతాయి.
వర్షాకాలం… వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. అప్పటిదాకా ఎండ దంచికొట్టినా.. ఆకస్మాత్తుగా మబ్బులు కమ్మేస్తాయి. భారీ వర్షాలు ముంచేస్తాయి. దాంతో విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వరద బీభత్సం మరీ ఎక్కువైతే.. ప్రయాణాలన్నీ రద్దవుతాయి. అలాగే, తుఫానులు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి విపత్తులతో బీచ్‌లు, ట్రెక్కింగ్, సఫారీ లాంటి బహిరంగ కార్యక్రమాలను తాత్కాలికంగా మూసేస్తారు. కాబట్టి, మీరు వెళ్లాలనుకునే ప్రాంతంలో వాతావరణ సూచనలను ఫాలో అవ్వండి.
గ్రామీణ, అభివృద్ధి చెందని మారుమూల ప్రాంతాలలో రవాణాపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, ఇంటర్నెట్ అంతరాయం లాంటివి కామన్. ఇవన్నీ మీ ప్రణాళికలన్నిటినీ తారుమారు చేస్తాయి. అందుకే.. ‘మాన్సూన్ టూరిజం’లో బ్యాకప్ షెడ్యూల్‌ను కూడా పెట్టుకోండి. ‘ప్లాన్ బి’లో ఇండోర్ వెకేషన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వండి.
వర్షాకాలంలోని వాతావరణం దోమల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా, ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఇలాంటి తేమ పరిస్థితులలో.. ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పక్కా ప్రణాళికతో ఉండాలి.
వర్షాకాలంలోనే సందర్శించాల్సిన కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. ఆయాచోట్లకు టూరిస్టులు పోటెత్తుతుంటారు. దాంతో, సదరు పర్యాటక ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో హోటల్స్, రిసార్ట్స్ నిర్వాహకులు రేట్లు పెంచేస్తారు. దాంతో, బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది.