ఆదిలాబాద్‌లో ఎంచక్కా కాసి
కాలపరీక్షకు ఎక్కువగా గురయ్యేది కర్షకులే! ఆ కాలం విసిరే సవాళ్లను అధిగమించేదీ వాళ్లే!! సాగుబడిలో నిత్య విద్యార్థి రైతు. స్వేదాన్ని నమ్ముకునే.. సేద్యంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కర్షకురాలు మీనాక్షి కూడా ప్రయోగశీలే!! అందుకే జపాన్‌లో కాసే అరుదైన మియాజాకి మామిడి రకాన్ని ముచ్చటగా సాగుచేసింది. ఇష్టంతో కృషి చేసి తొలి ఫలసాయాన్ని అందుకున్నది. కిలో లక్షలు పలికే మియాజాకి మామిడిని తెలంగాణలో తొలిగా పండించి శభాష్ అనిపించుకుంది.
వేసవి వచ్చిందంటే చాలు.. చూపులన్నీ మామిడి పండ్లపైనే నిలుస్తాయి. బంగినపల్లి, లంగ్డా, చిన్నరసాలు, పెద్దరసాలు ఇలా రకరకాలు కొనుగోలు చేసి జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటారు. రూ.100 నుంచి రూ.200 పలికే పండ్లే ఇవన్నీ! కానీ, వేలు పోస్తే గానీ ఒకటి, లక్షలు కుమ్మరిస్తే గానీ కిలో రాని మామిడి పండు రకం ఒకటుంది. అదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకి’ ఆమ్రఫలం. జపాన్‌లో ప్రసిద్ధి చెందిన ఈ రకం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కె) గ్రామంలో విరగ్గాసింది. నాలుగేండ్ల కిందట గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కేరళ నుంచి ఐదు మియాజాకి రకం మామిడి మొక్కలు తెచ్చి తన తోటలో నాటారు. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. నాలుగేండ్ల కృషి ఫలితంగా ఆ ఐదు చెట్లూ.. తొలిసారిగా కాపుకొచ్చి, మీనాక్షి కృషికి ఫలితంగా రసాలూరుతున్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి జపాన్‌లో మాత్రమే పండుతుందనే అభిప్రాయాన్ని ఈ ముఖ్రా (కె) రైతు చెరిపేసింది.

ఎన్నో ప్రత్యేకతలు..
సాధారణ మామిడి రకాలతో పోలిస్తే మియాజాకి పూర్తిగా భిన్నమైనది. ఈ రకం పండ్లు ఎరుపు-ఊదా కలగలిపిన రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సూర్యరశ్మి ప్రభావంతో వీటి తొక్కకు ప్రత్యేకమైన రంగు వస్తుంది. రుచిలో, పోషక విలువల్లో ఇవి ప్రత్యేకమైనవి. అందుకే, ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు పలుకుతుంది. దీనికి ప్రధాన కారణాలు మూడు.
ఇది చాలా అరుదుగా పండుతుంది. ప్రత్యేక సంరక్షణ అవసరం. పండ్లలో పోషక విలువలు అధికం. ఈ పండులో సహజ చక్కెర శాతం సాధారణ మామిడి రకాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, విటమిన్-సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి. శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగని వీటిని దివ్య ఔషధంగా చెప్పలేం. కానీ, అధిక పోషక విలువలు, అద్భుతమైన రుచి, అరుదైన లభ్యత మియాజాకి రకాన్ని ప్రత్యేకమైనవిగా నిలబెట్టాయి.

ఎలా సాధ్యమైందంటే..
మియాజాకి రకం సాధారణంగా జపాన్‌లోని శీతల వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. అయితే, సరైన నిర్వహణతో తెలంగాణలో కూడా పెంచవచ్చని నిరూపించారు మీనాక్షి. ‘ఈ రకం మామిడి సాగుకు నీరు నిల్వ ఉండని నేలలు ఎర్ర నేలలు లేదా ఇసుక మిశ్రమ నేలలు అనుకూలం. తగినంత సూర్యరశ్మి ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ తోటను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించాం. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవామృతం, ఘన జీవామృతం, గోమూత్ర ఆధారిత ద్రావణాలు, వేపపిండి వంటి సహజ ఎరువులు ఉపయోగించాం’ అంటారు మీనాక్షి. ‘కాయలు కాయడం మొదలుకాగానే.. ప్రతి దానికీ ప్రత్యేకంగా కవర్లు తొడిగాం. ఇలా చేయడం వల్ల పండ్లకు చీడ, పురుగు బాధలు ఉండవు. అలాగే పండ్లపై మచ్చలు ఏర్పడవు’ అని చెప్పుకొచ్చారు మీనాక్షి భర్త సుభాష్. అలాగే ఈ మొక్కలను పెంచడం ఒక ఎత్తు అయితే, లక్షల విలువ చేసే పండ్లను కాపాడటం అంతే ముఖ్యం. అడవి జంతువులు, పశువులు, దొంగతనాల నుంచి తోటను రక్షించేందుకు తోట చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు శునకాలతో కాపలా కూడా ఏర్పాటు చేసుకున్నారు.
మొత్తంగా ఎప్పుడూ ఒకే రకం పంటలు కాకుండా ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని గ్రామీణ రైతులు కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే అసాధ్యమేమీ లేదని ఈ రైతులు నిరూపించారు. ఆదిలాబాద్ నేలపై ఎర్రగా మెరిసిన ఈ మియాజాకి పండ్లు… రైతు ధైర్యానికి, సేంద్రియ వ్యవసాయానికి, ప్రయోగాత్మక ఆలోచనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఇక్కడితోనే ఆగకుండా రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆపిల్ పంటను కూడా సాగు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు ఈ మీనాక్షి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కేసీఆర్ స్ఫూర్తితో..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత హారం మాకు స్ఫూర్తి. నాలుగేండ్ల కిందట కేసీఆర్, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో 500 మామిడి మొక్కలు నాటాం. వాటిలో ఐదు మియాజాకి రకం మొక్కలను కేరళ నుంచి తెప్పించాం. ఒక్కో మొక్క ఖరీదు రూ.8000. మా తోటకు ‘కేసీఆర్ ఆర్గానిక్ మామిడి తోట’ అని నామకరణం చేశాం. అన్నిటితోపాటు మియాజాకి రకం చక్కగా ఫలాలను అందించాయి. మొదటి రెండు పండ్లను కేసీఆర్, కేటీఆర్‌కి బహూకరిస్తాం.
-మీనాక్షి