నిన్న మొన్నటి తరాల్లో పిల్లల పెంపకమంతా తల్లులే చూసుకునేవారు. తండ్రులు ఎక్కువగా.. సంపాదన, కుటుంబ పోషణ మీద దృష్టిపెట్టేవారు. కానీ, ప్రస్తుత తరం ‘నాన్న’లు మారుతున్నారు. అందులోనూ మిలీనియల్ తండ్రులు పిల్లల పెంపకంలో ముందుంటున్నారు. ఓవైపు ఉద్యోగాలు, వ్యాపారాలను చూసుకుంటూనే.. బిడ్డల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. జీవిత భాగస్వామితోనూ పనులు పంచుకుంటున్నారు.
పిల్లల పెంపకం విషయంలో మిలీనియల్ తండ్రులు ఎక్కువ బాధ్యతలను తీసుకుంటున్నారు. బిడ్డల సంరక్షణ-పనిని సమతుల్యం చేసుకుంటున్నారు. పిల్లల కోసం వారానికి సగటున ఎనిమిది గంటలు కేటాయిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇది 1965లలోని తండ్రులు తమ పిల్లలతో గడిపిన సమయం కంటే మూడురెట్లు ఎక్కువని తేల్చింది.
కొవిడ్ వల్ల వర్క్‌ఫ్రమ్ హోమ్ పెరిగింది. దాంతో, చాలామంది ఇంటిపట్టునే ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఫలితంగా, వారికి పిల్లలతో సమయం గడిపే అవకాశం దొరుకుతున్నది. అదే సమయంలో వారి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. పాఠశాలల్లో నిర్వహించే ఈవెంట్లు, వారాంతపు వినోద కార్యక్రమాలకూ హాజరవుతున్నారు.
ఈకాలంలో ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల బాధ్యతలను కూడా భార్యాభర్తలు సమానంగా పంచుకుంటున్నారు. తల్లులు ఉద్యోగాలకు వెళ్లాల్సి రావడంతో.. పిల్లల సంరక్షణలో తండ్రులు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇక ఉన్నత విద్యావంతులు.. లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు తల్లికి మాత్రమే పరిమితమైనవి కాదని అర్థం చేసుకుంటారు.
మరికొందరు పితృత్వపు సెలవులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అవసరమైనప్పుడు ఉద్యోగాలకు సెలవులు పెట్టేస్తున్నారు. పితృత్వ సెలవుల ప్రయోజనాలు ఎక్కువగా అందించే కంపెనీల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరైతే.. పిల్లలతో సమయాన్ని గడపడానికి కెరీర్‌ను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు.
పిల్లల పెంపకం వల్ల కలిగే ఇబ్బందులనూ ఈ మిలీనియల్ తండ్రులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలకు చికిత్స
తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే.. మానసిక నిపుణులను సంప్రదిస్తున్న తండ్రుల సంఖ్య పెరగడమే దీనికి సాక్ష్యం. 55 శాతానికి పైగా జెన్-జెడ్, మిలీనియల్స్ తండ్రులు సైకాలజిస్ట్‌లను కలుస్తున్నట్టు అధ్యయనం పేర్కొన్నది.