మహిళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ.. మెనోపాజ్. అయితే, ఇది కేవలం హార్మోన్లపైనే ప్రభావం చూపించడం లేదట. అనేక ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నదట. తాజా పరిశోధన ప్రకారం.. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో గుండె వ్యాధుల ప్రమాదం పెరగడంతోపాటు కీళ్ల నొప్పులు, బ్రెయిన్ ఫాగ్ లాంటి మరిన్ని సమస్యలూ కనిపిస్తున్నాయట. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్లు తగ్గుముఖం పడుతాయి. అదే సమయంలో సైటోకిన్ల స్థాయులు పెరుగుతాయి. ఈ మార్పు.. రక్తనాళాలపై ప్రభావం చూపి, హృదయ సంబంధ సమస్యలకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మెనోపాజ్‌కు చేరుకోని అదే వయసు గల స్త్రీలతో పోలిస్తే.. మెనోపాజ్‌కు గురైన మహిళల్లో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని అధ్యయనాలు నిరూపించాయి. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్లు తగ్గడం వల్ల కీళ్ల వాపు పెరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు దాడిచేస్తాయి. అప్పటికే ఉన్నవారిలో మరింత తీవ్రమవుతాయి.
ఇక న్యూరో ఇన్ఫ్లమేషన్పైనా.. మెనోపాజ్ ప్రభావం గురించి అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. వయసు పెరగడం, ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం వల్ల.. ఇతర కణజాలాల మాదిరిగానే మెదడు కూడా ప్రభావితం అవుతుంది. ఈ న్యూరో ఇన్ఫ్లమేషన్.. బ్రెయిన్ ఫాగ్తోపాటు జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తుంది. పెరిమెనోపాజ్-మెనోపాజ్ సమయంలో కనిపించే మార్పులు.. వివిధ శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయనీ, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులతోపాటు జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు కారణమవుతాయనీ ‘హార్వర్డ్ హెల్త్’ చెబుతున్నది. ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనీ, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమంతప్పని వ్యాయామం చేయడంతోపాటు తగినంత నిద్రపోవాలని సూచిస్తున్నది.