నడుము చుట్టుకొలత.. వ్యక్తి ఆరోగ్యాన్ని తెలుపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం ఇతర జీవక్రియ రుగ్మతలను బయటపెడుతుందని అంటున్నారు. నడుము చుట్టు పక్కల అధికంగా ఉండే ‘విసెరల్ కొవ్వు’ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. విసెరల్ కొవ్వు అనేది.. కాలేయం, ప్యాంక్రియాస్, గుండె వంటి అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వు. చర్మం కింద ఉండే మామూలు సబ్కటానియస్ కొవ్వులా కాకుండా.. ఇది జీవక్రియలో చురుకుగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ అసమతుల్యతలకు దోహదం చేస్తుంది. ఈ మార్పులే.. ఆరోగ్య సమస్యలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. విసెరల్ కొవ్వు ఇన్సులిన్ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుంది.
ఇక పొత్తికడుపులో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల.. అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయులు ఏర్పడతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్‌తోపాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సమస్యను పట్టించుకోకపోతే.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వైద్య నిపుణుల సిఫారసు మేరకు నడుము చుట్టు కొలత అనేది.. పురుషుల్లో 90 సెంటీమీటర్ల కంటే తక్కువ, మహిళల్లో 80 సెంటీమీటర్ల లోపు ఉండాలి. అప్పుడే గుండె జబ్బులు, మధుమేహం, ఫ్యాటీ లివర్, ఇతర జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందుకోసం జీవనశైలిలో సమూల మార్పులు తీసుకురావాలి. నిత్యం చురుకుగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయాలి. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి విసెరల్ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి.
చాలామంది బరువు తగ్గడానికి ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. అయితే, చాలా సందర్భాలలో ఈ క్రాష్ డైటింగ్ అనేది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. సరైన బీఎంఐ స్థాయులను నిర్వహించడానికి, శరీరం సరిగ్గా పనిచేయడానికి.. సమతులాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో శుద్ధిచేసిన చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. హృద్రోగ సమస్యలను నివారించడంలో ఒత్తిడి నిర్వహణ కీలకంగా మారుతుంది. కాబట్టి, ధ్యానం, యోగాతోపాటు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే.. కొవ్వు నిల్వలను ప్రభావితం చేసే హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఇలా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ.. పురోగతిని పర్యవేక్షించుకుంటూ ఉండాలి. అప్పుడే తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.