ఉత్సాహంగా విహారయాత్రలకు వెళ్లి.. ఉసూరుమంటూ తిరిగొస్తుంటారు చాలామంది. బయటి ఆహారం..తగినంత వ్యాయామం లేకపోవడంతో యాత్ర పూర్తయ్యేసరికి జ్వరం, సర్ది మాత్రలు వేసుకునే పరిస్థితికి వస్తుంటారు. ముఖ్యంగా ‘మలబద్ధకం’తో ఎక్కువగా బాధపడుతుంటారు. దీనినే ‘ప్రయాణ మలబద్ధకం’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి గల కారణాలు, నివారణ మార్గాలను ఇలా వివరిస్తున్నారు.
ప్రయాణాల సందర్భంగా శరీరం సమతుల్యతను కోల్పోతుంది. నిత్యకృత్యాలకూ అంతరాయం ఏర్పడుతుంది. విహారాల్లో సమయానుకూలంగా నిద్రలేవడం, భోజనం చేయడం లాంటివి వీలుపడదు. రైళ్లు, బస్సుల్లో ఎక్కువసేపు కూర్చొనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. క్రమంగా తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుంది.
ప్రయాణాల్లో వచ్చే మొదటి ప్రమాదం.. డీహైడ్రేషన్! విహారయాత్రల్లో పడి చాలామంది శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగుతుంటారు. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. పెద్దపేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమస్య ముదిరితే ప్రయాణం మధ్యలోనే నిలిచిపోతుంది. కాబట్టి, ఎప్పుడైనా, ఎక్కడైనా.. శరీరానికి కావాల్సినంత హైడ్రేషన్ అవసరమని గుర్తించాలి. యాత్రల్లో ఉన్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలి. అందుకోసం వాటర్ బాటిల్ ఎప్పుడూ వెంట ఉండేలా చూసుకోవాలి.
విహార యాత్రలకు వెళ్తే బయటి ఆహారమే దిక్కు. అందులోనూ లోకల్, స్ట్రీట్ ఫుడ్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారు. రోజువారీగా తీసుకొనే పండ్లు, సలాడ్లు, తృణధాన్యాలు లాంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా ఫైబర్ తక్కువై.. పేగు కదలికలు నెమ్మదిస్తాయి. మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అల్పాహారంలో పండ్లు.. మధ్యాహ్నం పూట సలాడ్లు ఉండేలా చూసుకోవాలి. స్నాక్స్ సమయంలో చిప్స్‌కు బదులుగా.. డ్రైఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తీసుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న మార్పులే.. మంచి ప్రభావం చూపిస్తాయి.
ప్రయాణాల్లో ఎక్కువ సమయంపాటు కదలకుండా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. రైళ్లు, బస్సుల్లో కాస్త అటూ ఇటూ నడవాలి. సొంత కారులో యాత్రకు వెళ్తే.. కనీసం రెండు గంటలకు ఒకసారైనా కారు ఆపి కాసేపు నడవాలి. హోటళ్లలో లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఎక్కాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడక సాగించాలి. ఇతర విషయాల్లో రెగ్యులర్ షెడ్యూల్ మిస్ అయినప్పటికీ.. సమయానికి భోజనం చేయాలి. ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడాన్ని తగ్గించాలి. అప్పుడే.. ‘ప్రయాణ మలబద్ధకం’ దూరం అవుతుంది. ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకుంటే.. మీ ప్రయాణం సంతోషంగా సాగుతుంది.