భూమిపై ఉన్న జీవకోటిలో మనిషిని ప్రత్యేకంగా నిలిపేది.. అతని మెదడు మాత్రమే! తనకున్న అదనపు అర్హత.. అతని తెలివితేటలే! వాటి సాయంతోనే.. అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనిషి మనుగడలో ‘మెదడు’ కీలకంగా మారుతున్నది. తాజాగా, వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా.. ‘మెదడు ఆరోగ్యం’పై ‘హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్’ కొన్ని సూచనలు చేసింది. వాటిని పాటిస్తే.. మెదడు ఆరోగ్యంతోపాటు మానసిక స్థితినీ మెరుగుపరుచుకోవచ్చు.
బ్రెయిన్‌ను నిత్యం పనిచేయిస్తూనే ఉండాలి. అప్పుడే దానిలో కొత్తకొత్త కనెక్షన్లు పుట్టుకొస్తాయి. కాబట్టి.. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండండి. క్రాస్‌వర్డ్స్, సుడోకు లాంటి ఫజిల్స్‌ను పూర్తిచేయడం, చదరంగా ఆడటం, వేరే భాష నేర్చుకోవడం.. ఇలా సరికొత్త సమాచారంతో మీ మెదడు కుస్తీ పడేలా చూసుకోండి.
క్రమంతప్పని వ్యాయామం.. మీ శరీరంతోపాటు మెదడునూ కాపాడుతుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడిస్తే.. మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ఇది బ్రెయిన్లో కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వ్యాయామంతో రక్తపోటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.
భోజనంలో అన్నిరకాల పదార్థాలు ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు, బెర్రీలు, గింజలు, చేపలు, బీన్స్‌ను ఎక్కువగా తీసుకోండి. ఇవన్నీ మెదడు ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఒమేగా-3, ఫోలేట్, యాంటి ఆక్సిడెంట్లను అందిస్తాయి.
రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ముఖ్యంగా, మధ్య వయస్కులలో అధిక రక్తపోటు.. చిత్తవైకల్య ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి, బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు ఆహారంలో ఉప్పును తగ్గించుకోండి.
ఇక ధూమపానం, మద్యపానం కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్, మద్యంలో ఉండే కెఫీన్.. రక్త నాళాలపై ప్రభావం చూపుతాయి. వీటిని పక్కన పెట్టేస్తే.. బ్రెయిన్ బాగుంటుంది.
భావోద్వేగాలతోపాటు నిద్రనూ జాగ్రత్తగా చూసుకోండి. ఆందోళన, నిరాశ, అలసట, దీర్ఘకాలిక నిద్రలేమి.. ఏకాగ్రతతోపాటు జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఏడు నుండి తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపోండి.
తలకు గాయం కాకుండా కాపాడుకోండి. ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు, క్రీడల సమయంలో తలకు దెబ్బతగలకుండా.. హెల్మెట్ ధరించండి. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు.. మెదడును సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి.