ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. ఎలా వెళ్లాలి? ఏ బస్సు ఎక్కాలి? మెట్రో స్టేషన్ ఎక్కడ మారాలి? అని వేర్వేరు యాప్‌లలో వెతుక్కుంటున్నారా? ఇకపై ఆ అవసరం లేదు. మన దేశానికి చెందిన ‘మ్యాప్ మై ఇండియా’ తన యాప్‌ను తాజాగా అప్డేట్ చేసింది. ప్రజారవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను జోడించింది. మీరు రోజూ బస్సులు లేదా మెట్రోలలో ప్రయాణించే వారైతే, ఈ అప్డేట్ మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
హైదరాబాద్‌తోపాటు దేశంలోని 18 కీలక నగరాల్లో ప్రయాణించే వారికి ఈ యాప్ ఒక గైడ్‌లా పనిచేస్తుంది. ఏ రూట్ ఎంచుకోవాలి? ఏ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలి? అనే వివరాలతోపాటు బస్సు లేదా రైలు వచ్చే సమయాన్ని కూడా కచ్చితంగా చూపిస్తుంది.
గూగుల్ మ్యాప్స్‌లో లేని 3డీ జంక్షన్ వ్యూ, స్పీడ్ బ్రేకర్ల హెచ్చరికలు లాంటి మరిన్ని ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం లైవ్ లొకేషన్ షేరింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ రాబోతున్నది. విదేశీ యాప్‌లపై ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా ఇది ఒక గొప్ప అడుగు కాబోతున్నది.