లీజా మంగళ్ దాస్.. సమాజం గుసగుసగా మాట్లాడుకునే విషయాల్ని, ఆలూమగలు కూడా చర్చించుకోడానికి ఇష్టపడని అంశాల్ని ప్రజా వేదికలపై లేవనెత్తుతారు. చెవులకు పట్టిన తుప్పు వదిలి పోయేలా సంభాషిస్తారు. మంగళ్ దాస్ దేశంలోనే మొట్టమొదటి సెక్సువాలిటీ ఎడ్యుకేటర్. ‘ద సెక్స్ బుక్: ఎ జర్నీ ఆఫ్ డిస్కవరీ’ తన సంచలనాత్మక రచన. లీజూస్ పేరుతో పర్సనల్ కేర్ బ్రాండ్ నడుపుతున్నారు.
మహిళ-లైంగిక సమానత్వం-ఆరోగ్యం అనే అంశంపై రువాండాలో జరిగిన మహిళా సదస్సులో ప్రసంగించారు కూడా. ‘లవ్ మ్యాటర్స్’ పేరుతో పాడ్కాస్ట్ సిరీస్ నడుపుతున్నారు. ఇన్స్టాలో లైంగిక సమస్యలకు సమాధానాలు ఇస్తారు. భ్రమల్ని బద్దలుకొడతారు. అపోహల్ని ఆమడదూరం తరిమేస్తారు. లీజా బెంగళూరులో పుట్టారు. సగం గుజరాతీ, సగం పంజాబీ. బాల్యమంతా గోవాలోనే గడిచిపోయింది. కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ‘లైంగికత, లైంగిక ఆరోగ్యం గురించి సరైన సమాచారం ఇంట్లోనే అందాలి. కన్నవారే అందించాలి. కానీ, అది జరగడం లేదు. దీంతో బాల్యం లైంగిక అజ్ఞానపు వలలో చిక్కుకుపోతున్నది’ అంటారామె.