ఒక మహిళ తలుచుకుంటే తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ గొప్ప మార్పును కచ్చితంగా తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణే మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాకు చెందిన 22 ఏళ్ల లీలా సాహు. ఇప్పుడు ఆమె వల్లే తన గ్రామానికి రోడ్డు పడుతున్నది. ఇంతకీ ఎవరీ లీలా సాహు..? ఆమె ఒక ఫేమస్ యూట్యూబర్. ఆమె చేసే వీడియోలకు అధిక సంఖ్యలో ఫాలోవర్లు, మంచి వ్యూయర్షిప్ కూడా ఉంది. లీలా సాహుకు మొదట్నుంచీ సామాజిక బాధ్యత ఎక్కువే! అలా ఆమె గత ఏడాది నుంచి తమ గ్రామంలో వాహనాలు వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని, దాంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు వీడియోలు చేశారు.
ఒక్క వీడియోతో ఆపకుండా ఆమె దీన్ని క్యాంపెయిన్‌గా నిర్వహించారు. మా ఊరికి రోడ్డు కావాలంటూ, ప్రజల సమస్యలను వివరిస్తూ వరుసగా వీడియోలు చేశారు. ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, పురిటి నొప్పులతో బాధపడే గర్భవతుల ఇబ్బందుల గురించి ఆ వీడియోల్లో వివరించారు. ప్రస్తుతం ఆమె కూడా గర్భవతిగా ఉన్నా, వీడియోలు చేయడం మాత్రం ఆపలేదు. ఖుద్ధీ ఖూర్ద్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రి వరకు రోడ్డు కావాలని ఆమె ఏడాదిగా పోరాడుతున్నారు. తన వీడియోలతో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.
తన వీడియోలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ ఎంపీ రాజేశ్ మిశ్రా వరకు అందర్నీ ట్యాగ్ చేసేవారు లీలా సాహు. అలా ఆమె క్యాంపెయిన్ కు ప్రజల నుంచీ మంచి స్పందనలు రావడంతో ఎట్టకేలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. స్థానిక ఎమ్మెల్యే అజయ్ సింగ్ రాహుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆమె తాజా వీడియోలో తెలిపారు. అలాగే ఎంపీ రాజేశ్ మిశ్రా మాట్లాడుతూ, “లీలా సాహు డెలివరీ డ్యూ డేట్ లోపు రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ఆమెకు ఇతర సదుపాయాలు కూడా అందిస్తామ’ని హామీ ఇచ్చారు.