కొరియన్ బ్యూటీకేర్ ఇప్పుడు ట్రెండింగ్. కె డ్రామాలు, కె పాప్లు చూసి అక్కడి వాళ్ల అందానికి పడిపోతున్నారు మన వాళ్లు. చర్మ సౌందర్యం గురించే కాదు కొరియన్ శిరోజాల మెరుపు వెనుక ఉన్న సీక్రెట్ ఇన్గ్రీడియంట్స్ ఏంటనీ వెతుకుతున్నారు. మీకూ ఆ కుతూహలం ఉంటే ఇదిగో ఆ దినుసులు…
జిన్సెంగ్: వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసేందుకు సాయపడే ఒక చెట్టు వేరు ఇది. తలపై చర్మపు రక్త సరఫరాను మెరుగు పరచి,వెంట్రుకలు పెరిగేందుకు తోడ్పడుతుంది. చర్మాన్ని పునరుత్తేజితం చేసి, కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది.
వెదురు సారం (బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్): ఇందులో పుష్కలంగా ఉండే సిలికా శిరోజాలను దృఢంగా తయారు చేస్తుంది. వెంట్రుకలకు బయటి నుంచి రక్షణ వలయాన్ని ఏర్పరచి, చిట్లకుండా, ఆరోగ్యంగా పెరిగేలా సహకరిస్తుంది
సుబాకి (కెమీలియా ఆయిల్): దీన్ని కెమీలియా నూనె అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో ఉండే ఓలిమెక్ ఆసిడ్, ఆంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల్లో తేమను పట్టి ఉంచి, పొడిబారనివ్వకుండా చేస్తాయి. వాటిని మృదువుగా, కాంతిమంతంగానూ చేస్తాయి.
ప్రపోలిస్ : తేనెటీగలు తయారు చేసే ఒక జిగురులాంటి పదార్థం ఇది. ఇందులో ఉండే యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు తల మీది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ వెంట్రుకలు పెరిగేందుకు తోడ్పడతాయి. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి.
బియ్యపు నీళ్లు: కొరియన్ స్కిన్కేర్లో ప్రధానంగా కనిపించే బియ్యపు నీళ్లను జుట్టు నిగారింపు కోసమూ వాడతారు. ఇందులోని అమైనో ఆసిడ్లు, విటమిన్, మినరల్స్ జుట్టుకు పోషణనందించి దృఢంగా మెరిసేలా చేస్తాయి. సాగే గుణాన్ని పెంచి వెంట్రుకలు చిట్లకుండా కాపాడతాయి.