ఎండలను తట్టుకోవడం కష్టమై పోతున్నది. ఇంట్లో ఉన్నా.. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దాంతో, ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. దీనివల్ల కరెంటు బిల్లు తడిసి మోపెడవుతున్నది. అయితే.. ఓ చిన్న చిట్కాతో ఇంటిని చల్లగా చేసుకోవచ్చు. సింపుల్‌గా.. తడి టవల్స్‌ను కిటికీలకు ఆరేస్తే సరి. రూపాయి ఖర్చులేకుండా.. ‘కూల్‌కూల్’ అంటూ ఎంజాయ్ చేయొచ్చు.
‘ఎవాపరేటివ్ కూలింగ్’ అని పిలిచే ఈ ఆలోచన పాతకాలం నాటిదే! కిటికీకి తడి టవల్, తడి కర్టెన్ను కట్టినప్పుడు.. బయట నుంచి వచ్చే వేడిగాలి ఆ తడి గుడ్డలోంచి ప్రవహిస్తుంది.
అప్పుడు గాలిలోని వేడిని టవల్‌లోని నీరు గ్రహిస్తుంది. దాంతో గాలి ఉష్ణోగ్రత తగ్గి.. గదిలోకి చల్లని గాలి వీస్తుంది. ఇదికూడా ఒకరకమైన ‘నేచురల్ ఎయిర్ కూలర్’ లాగా పనిచేస్తుందన్న మాట. ఇందుకోసం గాలి ఎటువైపు నుంచి వస్తున్నదో చూసుకొని.. ఆ కిటికీకి తడి టవల్ కట్టాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
ఇంకా చల్లదనం కావాలనుకుంటే.. టవల్‌ను ఐస్ వాటర్‌లో ముంచి, వేలాడదీయొచ్చు. అయితే, టవల్ త్వరగా ఆరిపోతుంది కాబట్టి, అప్పుడప్పుడూ దానిపై నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే.. విద్యుత్తు వినియోగం లేకుండానే గదిని చల్లబరుచుకోవచ్చు. గదిలో తేమ పెరిగి.. చర్మం, గొంతు పొడిబారకుండా ఉంటుంది.