Hand Washing | చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు, రోగాలు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అయితే, దీని ప్రయోజనం అలా ఉంచితే చేతుల పరిశుభ్రత గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం.
ఎక్కువసేపు గ్లవ్స్ తొడుక్కోవడం వల్ల సురక్షితంగా ఉంటామని చాలామంది భ్రమలో ఉంటారు. నిజానికి గ్లవ్స్ తొడుక్కొని వస్తువులు ఇతరులకు ఇవ్వడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. వండుతున్నప్పుడు, ఏవైనా వస్తువులు పట్టుకొన్నప్పుడు గ్లవ్స్ వాడుతుంటారు. అయితే, గ్లవ్స్ విడిచిపెట్టిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. అంతేకాదు గ్లవ్స్‌లో కూడా దుమ్ము, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇవి ఇతరులకు వ్యాపించవచ్చు. కాబట్టి, గ్లవ్స్ ధరించడం కంటే సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిది.
హ్యాండ్ వాష్ పనితీరును నీటి ఉష్ణోగ్రత ఏమాత్రం మార్చదు. సూక్ష్మక్రిములు సబ్బు ప్రభావంతో చనిపోతాయి. నీళ్లు అవి వేడివైనా, చల్లటివైనా సబ్బు వదిలిపోవడానికే అని గుర్తుంచుకోవాలి. చేతులు కడుక్కునే విషయంలో చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లు ప్రయోజనకరమని శాస్త్రీయమైన ఆధారాలైతే లేవు.
హ్యాండ్ వాష్ (సబ్బు) స్థానాన్ని శానిటైజర్ భర్తీ చేయదు. సబ్బుతో చేతులు కడుక్కోవడంతో వచ్చే ఫలితం శానిటైజర్ ద్వారా ఒనగూరదు. అన్ని సూక్ష్మక్రిములతో పోరాటానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం సమర్థంగా పనిచేస్తుంది. శానిటైజ్ చేసుకోవడం దీనికి ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి, చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల నుంచి తగిన రక్షణ లభిస్తుంది.
చేతులను సరైన పద్ధతిలోనే కడుక్కోవాలి. అరచేతులు, వెనకభాగం, వేళ్ల మధ్య, బొటనవేలు, గోళ్ల భాగం, మణికట్టు ఇలా అన్ని భాగాలను సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలి. ఆ తర్వాత శుభ్రమైన తువాలుతో తుడుచుకోవాలి. సరైన విధానం వైద్యుడి ద్వారా తెలుసుకొని ఆచరించడం మేలు.
వాష్‌రూంకు వెళ్లివచ్చిన తర్వాత, వంటకు ముందు చేతులు కడుక్కోవాలని సాధారణంగా అనుకుంటారు. అయితే ఇది పరిసరాల్లో మనం ముట్టుకునే వస్తువులను బట్టి ఆధారపడి ఉంటుంది. రైళ్లు, బస్సులు, బాగా జనం ఉన్న ప్రదేశాలు, పెంపుడు జంతువులను తాకినప్పుడు, తలుపు హ్యాండిల్స్, ఫర్నిచర్, స్విచ్చులు, లిఫ్ట్ బటన్లు ఇలా ఎక్కువమంది వాడే వస్తువులను పట్టుకొన్నప్పుడు, మీ ముఖం, కండ్లు, ముక్కు తాకిన సందర్భాల్లో, గ్లవ్స్ ధరించడానికి ముందు ఆ తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే.