అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంనగర్ నుంచి తరలి వెళ్లినవే. తరాల కిందట తళుకులీనిన కరీంనగర్ ఫిలిగ్రీ కళ.. ఇటీవలి కాలంలో పూర్వ వైభవం సంతరించుకుంది. అంతర్జాతీయ వేడుకల్లో వెలుగులు పంచుతున్న కళాకృతుల తయారీకి చిరునామా సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ (సిఫ్కా). అంతరించిపోతున్న కళను అందలం ఎక్కిస్తున్న సిఫ్కా కథ ఇది..
SIFKA | కరీంనగర్ ఫిలిగ్రీ అంటే తెలియని వారు ఉండరు. 400 ఏండ్ల కిందనే ఖ్యాతి గడించిన ఈ హస్తకళ రెండు దశాబ్దాల క్రితం అంతరించే స్థితికి చేరుకున్నది. అప్పుడు కళను బతికించాలని ముగ్గురు యువకులు సబ్బినాడుకు సొంతమైన ఫిలిగ్రీ గ్రాఫ్ పెంచాలని కంకణం కట్టుకున్నారు. కేవలం ఒక్కరిద్దరు కళాకారులకు మాత్రమే సొంతమైన ఈ కళను ఇప్పుడు ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. సుమారు రెండువందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరు ఉమ్మడిగా తీర్చిదిద్దుతున్న చంద్రలోహ జ్ఞాపికలు జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో అదనపు వెలుగులు పంచాయి. తాజాగా అంబానీ వారింటి పెండ్లికి అంబారీపై ఊరేగుతూ వెళ్లాయి. ఆ వివాహోత్సవంలో తెలంగాణ ప్రత్యేకతను చాటాయి. ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఒకప్పుడు గోల్కొండ కేంద్రంగా పాలించిన కుతుబ్‌షాహీలు, ఆ తర్వాత వచ్చిన ఆసఫ్‌జాహీలు ఈ కళను ఎంతగానో ఆదరించారు. కాలక్రమంలో పోషణ కోల్పోయి కనుమరుగయ్యే దశకు చేరిన ఈ హస్తకళ కరీంనగర్ జిల్లా ఎలగందులలో పునరుజ్జీవం పోసుకుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన కరీంనగర్లో స్థిరపడింది. అరుదైన ఈ హస్తకళను ప్రోత్సహించేందుకు సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ (సిఫ్కా) పేరిట ఒక సొసైటీ ఏర్పాటైంది. ఔత్సాహిక యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి కళకు పూర్వవైభవం తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సిఫ్కా నిర్వాహకులు. ఈ ప్రయత్నంలో ఇక్కడ తయారైన వెండి కళాకృతులు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. జాతీయస్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు దేశంలో ఎక్కడ జరిగినా అతిథులకు ప్రదానం చేసే జ్ఞాపికలు, బహుమతులను ఇక్కడినుంచే తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది.
ఈ హస్తకళకు ఫిదా అయిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన స్నానాల గదిలో బల్లలకు, అద్దాలకు కరీంనగర్ ఫిలిగ్రీతో ప్రత్యేక ఆకృతులను తయారు చేయించుకున్నారట. ఇప్పటికీ ఈ కళాఖండాలు లండన్ మ్యూజియంలో భద్రపర్చడం కరీంనగర్ ఫిలిగ్రీ గొప్పదనాన్ని చాటి చెబుతున్నది. తెలుగు రాష్ర్టాలకు ముఖ్యులెవరు వచ్చినా కరీంనగర్ ఫిలిగ్రీ సొసైటీకి ఆర్డర్లు వస్తుంటాయి. అప్పట్లో బిల్‌క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు సిఫ్కా రూపొందించిన వెండి నెమలిని బహుమతిగా అందించారు. ఆ తర్వాత ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చినపుడు కూడా ఇక్కడినుంచే అనేక బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై మొదటిసారి హైదరాబాద్ వచ్చిన వెంకయ్య నాయుడుకు కూడా కరీంనగర్లో రూపొందించిన 2.5 కిలోల కాకతీయ కళాతోరణాన్ని కానుకగా అందించారు. రాష్ట్రపతి శీతకాల విడిది కోసం తెలంగాణకు వచ్చినపుడు కూడా ఇక్కడినుంచి బహుమతులు పంపిస్తుంటారు.
ఖ్యాతి ఖండాంతరాలకు
అమెరికా, బ్రిటన్, జపాన్, చైనా లాంటి అగ్రదేశాల అధినేతలు హాజరైన జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కూడా కరీంనగర్ ఫిలిగ్రీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నది. ఈ సదస్సుకు హాజరైన అతిథులకు అలంకరించే బ్యాడ్జీలకు సిఫ్కా రూపొందించిన కోణార్క్ చక్రం ఎంపిక కావడం విశేషం. దేశంలో అనేక హస్తకళలు, ఇతర సంస్థలు రూపొందించిన నమూనాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చివరికి కరీంనగర్ ఫిలిగ్రీ కళారూపానికి జై కొట్టింది. అలాగే ఈ సదస్సుకు హాజరైన అతిథులకు జ్ఞాపికలుగా ఇక్కడ రూపొందించిన నెమలి ప్రతిమలనే అందించారు. ఇలా నిత్యం ఉన్నతస్థాయి సదస్సులు, సమావేశాలకు బహుమతులు, జ్ఞాపికలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో కరీంనగర్ ఫిలిగ్రీ అంచెలంచెలుగా ఎదుగుతున్నది. అంతేకాదు కరీంనగర్ ఫిలిగ్రీకి జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) కింద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా వచ్చాయి.
అంబానీ కొడుకు పెండ్లికి..
అపర కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కొడుకు పెండ్లికి ఆర్డర్లు రావడంతో కరీంనగర్ ఫిలిగ్రీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఈవెంట్స్‌కు ఆర్టికల్స్ సప్లయ్ చేస్తున్న సిఫ్కా పని విధానం ముకేశ్ కుటుంబానికి చిరపరిచితమే. ఈ నేపథ్యంలోనే సిఫ్కాకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ఆర్డర్ మేరకు ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి అవసరమైన వెండి వస్తువులను సిఫ్కా కళాకారులు అచ్చెరువొందేలా తీర్చిదిద్దారు. ఈ పెండ్లి ముచ్చట ముగిసినా.. మనోళ్లు తయారుచేసిన వెండి కళాకృతుల జిలుగులు వెలుగులు పంచుతూనే ఉన్నాయి.
కళను బతికించిన ఆ ముగ్గురు
ఒకప్పటి జిల్లా కేంద్రమైన ఎలగందులలో పుట్టిన ఈ కళ ఎంతో గొప్పగా ఆదరణకు నోచుకున్నది. అయితే, నాటి ఈ హస్త కళాకారులు తమ వారసులకు తప్ప మిగతావారికి ఫిలిగ్రీ కళను పరిచయం చేసేవారు కాదు. ఈ కారణంగా కళ అంతరించిపోయే దశకు చేరింది. ఈ పరిణామాన్ని గుర్తించిన ఎర్రోజు అశోక్, గద్దె అశోక్ కుమార్, ఆకోజు వెంకటేశ్వర్లు కలిసి 2008లో సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ (సిఫ్కా) పేరిట ఒక సొసైటీని ఏర్పాటుచేశారు. పూర్తిగా అంతరించి పోతున్న దశలో ఉన్న ఈ కళను బతికించేందుకు ఒక వర్క్‌షాపును ఏర్పాటుచేశారు.
కళను విస్తరించే లక్ష్యంతో ఇప్పుడు రెండువందల మంది కళాకారులను తయారుచేశారు. మార్కెట్‌కు అనుగుణంగా, కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా తమ పని విధానాన్ని మార్చుకున్నారు. స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న మోడల్స్‌ను సిద్ధం చేసేందుకు డిజైనర్లను నియమించుకున్నారు. కోరిన విధంగా వెండితో ఇప్పుడు ఎలాంటి వస్తువులనైనా హస్తకళతో రూపొందించి అందిస్తున్నారు. ఏ కళాకృతిని రూపొందించాలన్నా చారిత్రక నేపథ్యం, ఈవెంట్ ఉద్దేశం కనబడేలా డిజైన్ చేయడంలో సిఫ్కా ప్రత్యేకతను చాటుతున్నది. దీంతో దేశంలోని రిలయన్స్ (స్వదేశీ), జీఎంఆర్, జీవీకే తదితర ప్రఖ్యాత సంస్థల నుంచి సిఫ్కాకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఫిలిగ్రీ అంటే..
కరెంటు బల్బులో ఉండే ఫిలమెంట్ లాంటి సన్నని చిన్నచిన్న తీగలను ఒకదానితో ఒకటి జతచేసి అందమైన ఆకృతిగా మలిచే కళను ఫిలిగ్రీ అంటారు. ఫిలమెంట్ నుంచే దీనికి ఆ పేరు వచ్చింది. పూర్వం తార్-కా-షాన్ అని పిలిచేవారు. ఉర్దూలో తార్ అంటే తీగ అనీ, షాన్ అంటే గొప్పతనం అని అర్థం. అచ్చతెలుగులో చెప్పాలంటే.. వెండితీగ నగిషీ అనీ, వాడుక భాషలో వెండి జాలి పని అని పిలుస్తారు. సుమారు నాలుగు శతాబ్దాల కిందట మహారాజులు పోషించిన ఈ కళకు ఎలగందుల పుట్టినిల్లుగా చెబుతారు. దీనిని ఫణయ్య అనే కళాకారుడు మొదటిసారిగా కనిపెట్టారని ఫిలిగ్రీ వారసులు చెబుతుంటారు.
కళను బతికించడంతో ఉపాధి
ఈ ఫిలిగ్రీ పని ఒకప్పుడు మా తాత, ఆ తర్వాత మా నాన్న చేసేవారు. అప్పట్లో ఈ కళ చాలా సీక్రెట్‌గా ఉండేది. వారసులకు తప్ప మరొకరికి నేర్పించే వారు కాదు. ఈ కారణంగానే కళ మరుగున పడిపోయే దశకు వచ్చింది. మా నాన్న దగ్గర ఈ కళను నేర్చుకున్న నేను మరో ఇద్దరు మిత్రులతో కలిసి సిఫ్కాను ఏర్పాటు చేశాను. అప్పటికి వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో కళాకారులు ఉండేవారు. వాళ్లందరినీ సమీకరించి మాస్టర్ వర్కర్లుగా తీసుకున్నాం. కళను విస్తరించాలనే ఉద్దేశంతో ఔత్సాహికులైన యువతీ, యువకులకు నేర్పించాం. ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఈ కళ అబ్బదు. మెరికలైన రెండువందల మందిని ఎంపిక చేసుకున్నాం. వాళ్లకు రెగ్యులర్‌గా ఉపాధి కల్పిస్తున్నాం. మార్కెట్‌కు తగినట్లు, కస్టమర్ల కోరిక మేరకు డిజైన్ చేసి వెండి వస్తువులు తయారుచేసి ఇస్తున్నాం. ఇప్పుడు మా తర్వాతి తరానికి కూడా ఈ కళ అందుబాటులో ఉంటుందనే విశ్వాసం ఉంది.
– గద్దె అశోక్ కుమార్, సిఫ్కా ప్రధాన కార్యదర్శి
…? దొంత వెంకట్ స్వామి
అవురునేని బాలకిషన్ రావు