తెలంగాణ రాష్ట్రం… ఎన్నో ఘనతలకు నెలవు. చారిత్రక, వారసత్వ సంపదలకు నిలయం. విభిన్న సంస్కృతుల కేంద్రం. ప్రాచీన జీవన విధానంలో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉన్నది. మంచుయుగం, రాతియుగంలో తెలంగాణ ఆనవాళ్లు ఎప్పుడో నిర్ధారణ అయ్యాయి. తాజా పరిశోధనలతో మరో ఘనత ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. మంచుయుగం కంటే ముందుగా ఉన్న ట్రయాసిక్ యుగంలోనూ ఇక్కడ జీవం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. వీటి వయసు దాదాపు 20 కోట్ల సంవత్సరాలని పరిశోధకుల అభిప్రాయం.
ట్రయాసిక్ యుగంలో తొలిభాగంగా భావించే జురాసిక్ యుగంలోనూ తెలంగాణకు ఓ చరిత్ర ఉన్నదని తేలింది. గోదావరి తీరంలో 1979లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఆధ్వర్యంలో సేకరించిన రాక్షసబల్లి (డైనోసార్) శిలాజాలపై పరిశోధన ముగింపు దశకు చేరిందని, ఇవి 20 కోట్ల ఏండ్ల క్రితం నాటి ఆనవాళ్లుగా నిర్ధారించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరా సారియా వర్గానికి చెందిన డైనోసార్వని తేల్చారు. గోదావరి తీరంలోని మరేరి, ధర్మారం, కాటారం ప్రాంతంలో తారావత్ కుట్టి దీనిని కనిపెట్టారు. ప్రాంతం, పరిశోధకుడి పేరును కలిపి ఈ డైనోసార్‌కు మలేరి కుట్టి అని పేరుపెట్టారు. దీనిపై పరిశోధనలు తెలంగాణ చరిత్రకు మరింత ప్రాచీనత తీసుకురానున్నాయి.
శిలాజాల నిధి ఈ నేల
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గోదావరికి ఇరువైపులా ఆంజియోస్పెర్మ్ (ఆవృతబీజ) వృక్షాలు విస్తృతంగా ఉండేవని, వీటి ఆకులను ఆహారంగా తీసుకునేందుకు ఈ ప్రాంతంలో డైనోసార్లు ఎక్కువగా తిరిగేవని పరిశోధకులు తేల్చారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డైనోసార్ల ఆనవాళ్ల కోసం దాదాపు శతాబ్దం క్రితం నుంచే విదేశీ పరిశోధకులు ఈ ప్రాంతంలోని ప్రాచీన శిలాజాలపై పరిశోధనలు చేశారు.
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్త పొన్నాల యాదగిరి 1980లో గోదావరి తీరంలోని వేమనపల్లి ప్రాంతంలో ఎగిరే రాక్షసబల్లి (ఆరియోప్టెరిక్స్) అవశేషాలను గుర్తించారు. డైనోసార్ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకుల శిలాజాలు లభ్యమయ్యాయి. 20 కోట్ల ఏండ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో డైనోసార్లు మనుగడ సాగించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత గోదావరి తీరంలో సంభవించిన అనేక ప్రకృతివిపత్తుల కారణంగా అవి అంతరించిపోయాయి. కోట్ల ఏండ్ల క్రితం జీవించిన వీటి ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడ్డాయి.
ప్రాచీన జీవజాతుల నిలయం
ఆదిమానవుని అస్థికలు మనదేశంలో మొదటిసారిగా ప్రాణహిత పరిసరాల్లో 1980లో కనుగొన్నారు. ఆఫ్రికా, యూరప్, చైనా తర్వాత మనదేశంలోనే ఇవి లభించాయి. ఆసియాలో అత్యంత పురాతన డైనోసార్‌గా భావిస్తున్న వాల్కరియా మలరినిసిస్ శిలాజాలు మంచిర్యాల జిల్లాలో… ఆరోసార్ శిలాజాలు ధర్మారం అటవీ ప్రాంతంలో 1989లో గుర్తించారు. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో సూక్ష్మ సకశేరుకాల శిలాజ అవశేషాలు దొరికాయి. నిజామాబాద్ జిల్లాలో చేపలు, ఉభయచరాలు, బల్లులు, పాములు మొదలగు సరీసృపాల శిలాజాలు లభించాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద లభ్యమైన డైనోసార్ పూర్తి శిలాజాన్ని హైదరాబాద్ జీఎస్ఐ కార్యాలయ ప్రాంగణంలో భద్రపరిచారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కొండపల్లి అడవిలో 15 కోట్ల ఏండ్ల వయసు ఉన్న వృక్ష శిలాజాలను 2014లో తెలంగాణ జాగృతి చరిత్ర బృందం గుర్తించింది. ఇలా తెలంగాణకు ఘనమైన ప్రాచీన జీవజాతుల మనుగడ చరిత్ర ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ‘డైనోసారియం’లో కనిపించే రాక్షస బల్లి ఆకృతిని 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో రూపొందించారు.
ఈ అవశేషాలు వేమనపల్లిలో 1974- 1980 సంవత్సరాల మధ్యకాలంలో దొరికాయి. వేమనపల్లిని ఆ కాలంలో యామనపల్లి అని పిలిచేవారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్ యమనపల్లియెన్సిస్’ అనే శాస్త్రీయనామాన్ని పెట్టారు. ఈ రాక్షసబల్లి శిలాజం ఎత్తు 16 అడుగులు, పొడవు 44 అడుగులు. ఇక, పరిశోధనల్లో భాగంగా తెలంగాణలో లభ్యమైన పురాతన జీవరాశుల శిలాజాలపై పరిశోధనలను మరింత పెంచేందుకు గోదావరి తీర ప్రాంతంలో ఫాజిల్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నది.
మనది ప్రాచీన చరిత్ర
మనదేశంలో మొదట గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో డైనోసార్ల అవశేషాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరుగాడిన వాటి జీవిత విశేషాలపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జియలాజికల్ స్టడీ యూనిట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తదితర సంస్థల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. గోండ్వానా కాలం నాటి గ్లాసిఫా ఫైటిస్ రకానికి చెందిన కోనిఫెర్స్ని పోలిన మొకలు శిలాజాలుగా మారాయి.
ఇంతటి అరుదైన ప్రపంచ గుర్తింపు పొందగల ప్రాచీన సహజ సంపద క్రమంగా అంతరించి పోతున్నది. దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ వెలుగులోకి రాని అనేక చారిత్రక విశేషాలు ఇంకా భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోదావరి-ప్రాణహిత నది ప్రాంతాల్లో పరిశోధనలు చేపడితే మరిన్ని ఆనవాళ్లు దొరికే అవకాశం ఉన్నది. గతంలో లభ్యమైన జంతు, వృక్ష శిలాజాలతో ఒక శిలాజాల పార్ను ఏర్పాటుచేస్తే పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– అరవింద్ ఆర్య, పురావస్తు చరిత్ర పరిశోధకుడు
…? పిన్నింటి గోపాల్